లాక్డౌన్ సమయంలో నిత్యావసర వస్తువుల లభ్యతపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ గురువారం స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్ఓపీ)ను జారీ చేసింది. ప్రజలకు వస్తు, సేవలు అందించే విషయంలో ఎలాంటి ఆటంకాలు ఏర్పడకుండా రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని సూచించింది.
చిన్న రిటైల్ దుకాణాలు, పెద్ద వ్యవస్థీకృత రిటైల్ స్టోర్, ఈ-కామర్స్ కంపెనీ సేవల్లో ఎటువంటి ఆటంకాలు ఉండకూడదని హోం మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఫుడ్ డెలివరీ సేవలు అందించే రెస్టారెంట్లు, నిత్యఅవసర పదార్థాల నిల్వలకు ఉపయోగించే గిడ్డంగులకు కూడా అనుమతి ఇవ్వాలని సూచించింది. అలాగే నిత్యవసర సరకుల రవాణా చేసే డ్రైవర్లు, లోడర్లకు, రవాణాదారులకు అనుమతి ఇవ్వాలని స్పష్టం చేసింది.
వలస కూలీలను ఆదుకోండి
కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు ప్రకటించిన 21 రోజుల లాక్డౌన్ కారణంగా వలస కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో వీరికి ఆహారం, ఆశ్రయం కల్పించాలని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. హాస్టళ్లలో ఉన్న విద్యార్థుల శ్రేయస్సు దృష్ట్యా.. ప్రస్తుతం ఉంటున్న చోటే వారుండేలా చూడాలని స్పష్టం చేసింది.
పెద్ద సంఖ్యలో వలస కార్మికులు తాము పనిచేస్తున్న ప్రాంతాలను విడిచిపెట్టి... వందలాది కిలోమీటర్ల దూరంలోని తమ స్వస్థలాలకు నడుచుకుంటూ వెళ్తూ, మార్గమధ్యంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్రం తాజా సూచనలు చేసింది.
ఇంటికే ఔషధాలు