పౌరచట్టానికి వ్యతిరేకంగా నినదిస్తోన్న ప్రజల గొంతునుభాజపా ప్రభుత్వం...పోలీసు బలగాలతో నొక్కే ప్రయత్నం చేస్తోందని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆరోపించారు. పౌరచట్టం వివక్షాపూరితమన్న సోనియా.. ఇది ప్రజాస్వామ్యంలో ఆమోదయోగ్యం కాదని వ్యాఖ్యానించారు. పౌరచట్టంపై ప్రభుత్వ విధానాన్ని తప్పు పట్టారు కాంగ్రెస్ అధ్యక్షురాలు. విద్యార్థులకు, ఆందోళనకారులకు కాంగ్రెస్ సంఘీభావం తెలుపుతోందన్నారు. పౌరచట్టంతో పాటు ప్రతిపాదిత దేశవ్యాప్త ఎన్ఆర్సీ.. పేదలను బాధించే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
"కాంగ్రెస్ పార్టీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. పౌరచట్టానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తోన్న విద్యార్థులు, యువత, ప్రజలను అణిచేందుకు భాజపా ప్రభుత్వం.. పోలీసు బలగాలను వినియోగించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. వర్సిటీలు, ఐఐటీ, ఐఐఎం వంటి దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ విద్యాసంస్థల్లో... భాజపా ప్రభుత్వ వివక్షాపూరిత విధానాలపై స్వచ్ఛందంగా నిరసనలు చెలరేగుతున్నాయి.
ప్రజాస్వామ్యంలో తప్పుడు నిర్ణయాలు, విధానాలపై మాట్లాడేందుకు, అభిప్రాయాలను తెలిపేందుకు ప్రజలకుహక్కు ఉంది. అదేసమయంలో పౌరుల అభిప్రాయాలను తెలుసుకోవడం ప్రభుత్వ విధి. భాజపా ప్రభుత్వం ఆందోళనకారుల మాటలు వినేందుకు సిద్ధంగా లేదు. వారిని అణిచేందుకు పోలీసు బలగాలను వినియోగిస్తుంది. ఇది ప్రజాస్వామ్యంలో ఆమోదయోగ్యం కాదు."