కరోనా వైరస్‌పై భారీ యుద్ధానికి కేంద్రం సన్నద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. వైరస్‌పై పోరుకు సిద్ధంగా ఉండాలని సైన్యం, నౌకాదళం, వాయు సేనలకు స్పష్టం చేసింది కేంద్ర ప్రభుత్వం. బాధితులకు చికిత్స అందించడానికి అవసరమైన నిర్బంధ కేంద్రాలను ఏర్పాటు చేయాలని పేర్కొంది. 2వేల 500 కేసులను ఏకకాలంలో పర్యవేక్షించే బాధ్యతలను త్రివిధ దళాలకు అప్పగించింది.
కరోనాపై భారత్ భారీ యుద్ధం- త్రివిధ దళాలకు బాధ్యత - కరోనా వైరస్
ప్రాణాంతక కరోనా వైరస్ భారత్‌లో వేగంగా వ్యాపిస్తోంది. ఈ తరుణంలో వైరస్‌ను ఎదుర్కొనే బాధ్యతలను కేంద్రం.. త్రివిధ దళాలకు అప్పగించినట్టు సమాచారం. రానున్న రోజుల్లో ఈ దళాల నేతృత్వంలో ఓ భారీ ఆపరేషన్ జరిగే అవకాశమున్నట్టు తెలుస్తోంది.
![కరోనాపై భారత్ భారీ యుద్ధం- త్రివిధ దళాలకు బాధ్యత Govt has asked Army,Navy&Air Force to be prepared for quarantine facilities for over 2500 suspected cases in coming days.](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6281952-thumbnail-3x2-army.jpg)
ఈ నేపథ్యంలోనే మార్చి 18న ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్టణంలో జరగాల్సిన నేవీ విన్యాస కార్యక్రమాలను రద్దు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. 40 దేశాలు పాల్గొనే ఈ కార్యక్రమానికి కొత్త తేదీలు నిర్ణయించే పనిలో అధికారులు ఉన్నట్లు తెలిసింది.
నిజానికి కరోనాపై భారత్ ఫిబ్రవరిలోనే విజయం సాధించింది. కేరళలో నమోదైన మూడు కేసులను సమర్థంగా పరిష్కరించారు వైద్యులు. కానీ తాజాగా మరో ముగ్గురికి వైరస్ సోకినట్టు అధికారులు నిర్ధరించారు. ప్రస్తుతం వారిని నిర్బంధంలో ఉంచి వైద్యం అందిస్తున్నారు. ఇదే క్రమంలో ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో మరో ఆరుగురికి వైరస్ సోకినట్టు అధికారులు అనుమానిస్తున్నారు.