పార్లమెంటు సమావేశాల పొడగింపు! పార్లమెంట్ సమావేశాలను పొడిగించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ముమ్మారు తలాక్, సమాచార హక్కు చట్ట సవరణ వంటి కొన్ని కీలక బిల్లులను ఆమోదించుకునేందుకు సమావేశాలను పొడిగించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు భాజపా వర్గాలు తెలిపాయి.
సమాచార, ప్రసారాల శాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్ కూడా ఈ విషయంపై స్పందించారు.
"పార్లమెంటు సమావేశాలు వంద రోజులపాటు కొనసాగాలని విపక్షాలు కోరుతున్నాయి. అదే మేం చేయబోతున్నాం. సమావేశాలను పొడగిస్తే వివిధ సమస్యలపై చర్చించే అవకాశం కలుగుతుంది."
-ప్రకాశ్ జావడేకర్, సమాచార, ప్రసారాల శాఖ మంత్రి.
మంగళవారం జరిగిన భాజపా పార్లమెంటరీ పార్టీ సమావేశంలోనూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. ఆ పార్టీ ఎంపీలకు ఈ విషయంపై సూచనలు చేశారు. ప్రభుత్వం ప్రతిపాదించిన చట్టాల ఆమోదానికి పార్లమెంటు సమావేశాలను 10 రోజుల పాటు పొడగించే అవకాశం ఉందని తెలిపారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి కూడా ఈ విధంగానే స్పందించారు.
"సమావేశాల పొడగింపునకు అవకాశం లేకపోలేదు. మేం నిర్ణయం తీసుకున్న తర్వాత అధికారికంగా ప్రకటిస్తాం."
-ప్రహ్లాద్ జోషి, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి
పార్లమెంటు సమావేశాల పొడగింపు అంశం ప్రభుత్వ అధీనంలో ఉంటుంది. నిజానికి జూన్ 17న ప్రారంభమైన సమావేశాలు జులై 26న ముగియాల్సి ఉంది.
ఇదీ చూడండి: లోక్సభలో చర్చకు తలాక్ బిల్లు- నేడు ఆమోదం!