లాక్డౌన్ అమలు చేసినప్పటి నుంచి 22 సార్లు ఇంధన ధరలను పెంచారంటూ భాజపా ప్రభుత్వంపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ విరుచుకుపడ్డారు. ధరలు పెంచుతూ ప్రజల నుంచి డబ్బులను బలవంతంగా వసూలు చేస్తున్నారని ఆరోపించారు. పెంచిన ధరలను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేశారు.
ఆకాశాన్నంటుతున్న ఇంధన ధరలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ చేపట్టిన "స్పీక్ అప్ అగైనస్ట్ ఫ్యూయల్ హైక్" కార్యక్రమంలో సోనియా గాంధీ పాల్గొన్నారు. ఓవైపు కరోనా వైరస్ పట్టి పీడిస్తుంటే.. మరోవైపు ధరల బాదుడుతో ప్రజల జీవితాలు అస్తవ్యస్తంగా తయారవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
"కరోనా సంక్షోభంలో పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తక్షణమే తగ్గించాలని.. కాంగ్రెస్ సభ్యులతో సహా నేను ప్రధాని మోదీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. మార్చి నుంచి పెట్రోల్, డీజిల్ మీద పెంచిన ఎక్సైజ్ సుంకాలను ఉపసంహరించుకోవాలని కోరుతున్నా. దానితో దేశ ప్రజలు లబ్ధిపొందుతారు. కరోనా సంక్షోభంలో ప్రజలకు ఇది ఉపశమనం ఇస్తుంది."
--- సోనియా గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు.