ట్రాన్స్ జెండర్లకు ప్రభుత్వ పథకాలు చేరువ చేయడంపై కేంద్రం దృష్టిపెట్టింది. ఇందుకోసం వారికి ఒక ప్రత్యేక గుర్తింపు కార్డు జారీ చేయడంపై కసరత్తు చేస్తోంది. దీనికి సంబంధించి జాతీయ ట్రాన్స్జెండర్ మండలి మొదటి సమావేశం గురువారం నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ సమావేశానికి సామాజిక న్యాయ శాఖ మంత్రి తావర్ చంద్ గహ్లోత్ అధ్యక్షత వహించారు.
"ట్రాన్స్ జెండర్లు ప్రస్తుతం సమాజంలో ఎదుర్కొంటున్న సమస్యలపై కేంద్రంతో చర్చలు జరిపాం. కేంద్రం కొత్తగా ప్రవేశ పెట్టనున్న ప్రత్యేక గుర్తింపు కార్డు పైనా చర్చించాం. కానీ ఇంకా నిర్ణయానికి రాలేదు. మా డిమాండ్లలో ఇదీ ఒకటి. గుర్తింపు కార్డు జారీ చేయటం వల్ల ట్రాన్స్ జెండర్స్కు ఎంతో మేలు జరుగుతుంది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా భారత్లోని ట్రాన్స్జెండర్లకు ప్రత్యేక మండలి ఉంది. సమాజంలో ట్రాన్స్జెండర్లను మమేకం చేసేందుకు కేంద్రం కృషి చేస్తోంది."