దేశంలోని వీఐపీల భద్రతా విధుల్లో బ్లాక్ క్యాట్ కమాండోలు ఇక ఉండరా? గాంధీల కుటుంబ భద్రతలో ప్రత్యేక రక్షణ దళం-ఎస్పీజీని తొలగించినట్లే.. ఇక వీఐపీలకు జాతీయ రక్షణ దళం- ఎన్ఎస్జీ భద్రతను కేంద్రం తొలగించనుందా? ఔననే అంటున్నాయి అధికార వర్గాలు.
రెండు దశాబ్దాలుగా వీఐపీలకు బ్లాక్ క్యాట్ కమాండోలు భద్రత కల్పిస్తున్నారు. తీవ్రవాద చర్యల నుంచి వీఐపీలను కాపాడేందుకు.. దీటైన భద్రత కోసం వీరిని ప్రభుత్వం వినియోగిస్తోంది. అయితే ఇప్పుడు ఈ భద్రతను తొలగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.
ఆ 13 మందికే...
ఎన్ఎస్జీ బ్లాక్ క్యాట్ కమాండోల భద్రత దేశంలోని 13 మందికి మాత్రమే ఉంది. అధునాతన ఆయుధాలను చేతబట్టి ఆ వీఐపీలు ఎక్కడికి వెళ్లినా వారి భద్రతను ఈ కమాండోలు పర్యవేక్షిస్తారు. ఒక్కొక్కరికి దాదాపు 24 మంది కమాండోలు రక్షణగా ఉంటారు.
ఏం చేస్తారు...?
రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఉత్తర్ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, మాజీ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, ములాయం సింగ్ యాదవ్, ప్రకాశ్ సింగ్ బాదల్, ఫరూక్ అబ్దుల్లా, అసోం ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్, మాజీ ఉప ప్రధాని ఎల్కే అడ్వాణీకి భద్రత కల్పిస్తోన్న ఈ కమాండోల స్థానంలో త్వరలో పారామిలటరీ దళాలు రానున్నాయి.