తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'పార్లమెంట్​ సమావేశాలపై ప్రభుత్వానిదే నిర్ణయం'

పార్లమెంట్​ శీతాకాల సమావేశాలు నిర్వహించేందుకు లోక్​సభ సచివాలయం సిద్ధంగా ఉందని దిగువసభ స్పీకర్​ ఓం బిర్లా వెల్లడించారు. అయితే తేదీలను మాత్రం ప్రభుత్వమే నిర్ణయిస్తుందని పేర్కొన్నారు. మరోవైపు దిల్లీలో కరోనా పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎంపీలు అక్కడికి వెళ్లేందుకు విముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఫలితంగా పార్లమెంట్​ శీతాకాల సమావేశాలు ఈసారి జరగకపోవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి.

Govt decides dates: Om Birla on holding Winter Session of Parliament
'పార్లమెంట్​ సమావేశాలపై ప్రభుత్వానిదే నిర్ణయం'

By

Published : Nov 22, 2020, 5:16 AM IST

పార్లమెంటు శీతాకాల సమావేశాలపై సందిగ్ధత నెలకొన్న తరుణంలో లోక్​సభ స్పీకర్​ ఓం బిర్లా కీలక వ్యాఖ్యలు చేశారు. సమావేశాలను నిర్వహించేందుకు లోక్​సభ సచివాలయం సిద్ధంగా ఉందని... అయితే తేదీలపై ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలన్నారు. దిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు ఓం బిర్లా.

"లోక్​సభ సెక్రటేరియట్​ సిద్ధంగా ఉంది. కానీ పార్లమెంట్​ శీతాకాల సమావేశల తేదీలు వెలువడాల్సి ఉంది. పార్లమెంట్​ వ్యవహారాలపై ఏర్పాటు చేసిన కేబినెట్​ కమిటి దీనిని నిర్ణయిస్తుంది."

-- ఓం బిర్లా, లోక్​సభ స్పీకర్​.

అనంతరం.. ఈ నెల 25, 26వ తేదీల్లో గుజరాత్​లోని కేవడియాలో 80వ అఖిల భారతీయ సంభాపతుల సదస్సును నిర్వహించినున్నట్టు వెల్లడించారు ఓం బిర్లా. ఈ సదస్సులో రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారని పేర్కొన్నారు.

సమావేశాలు జరిగేనా?

కరోనా సంక్షోభం నేపథ్యంలో ఈ ఏడాది పార్లమెంట్​ వర్షాకాల సమావేశాలు సెప్టెంబర్​లో జరిగాయి. ప్రత్యేక ఏర్పాట్లు చేసి, కరోనా నిబంధనలు పాటిస్తూ సభను నిర్వహించారు. అయినప్పటికీ పలువురు ఎంపీలకు కరోనా సోకింది.

సహజంగా నవంబర్​-డిసెంబర్​లో పార్లమెంట్​ శీతాకాల సమావేశాలు జరుగుతాయి. కానీ ప్రస్తుతం దేశరాజధాని దిల్లీలో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. కేసులు, మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దిల్లీకి వెళ్లేందుకు ఎంపీలు విముఖంగా ఉన్నట్టు సమాచారం. ఫలితంగా ఈసారి సమావేశాలు జరగకపోవడానికి ఎక్కువ అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

ఇదీ చూడండి:-హిందుత్వానికి అర్థం చెప్పిన ఫడణవీస్‌

ABOUT THE AUTHOR

...view details