దేశ మొట్టమొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్)గా జనరల్ బిపిన్ రావత్ రేపు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ నేపథ్యంలో సీడీఎస్ అధ్యక్షతన నడిచే నూతన సైనిక వ్యవహారాల విభాగాన్ని ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. త్రివిధ దళాలకు సంబంధించిన అంశాలను ఈ విభాగం ద్వారా సీడీఎస్ పర్యవేక్షిస్తారు.
సైన్యాధిపతిగా ఇవాళే పదవీ విరమణ చేసిన రావత్ మూడేళ్లపాటు సీడీఎస్‌గా కొనసాగనున్నారు. రావత్ వారసుడిగా జనరల్ మనోజ్ ముకుంద్ నరవణే ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టారు.
త్రిదళాధిపతి యూనిఫాం...
మన దేశంలో త్రివిధ దళాలకు వేర్వేరు ఏకరూప దుస్తులు ఉన్నాయి. ఎయిర్‌ఫోర్స్ సిబ్బంది నీలం వస్త్రాలు ధరిస్తే.. ఆర్మీ ముదురు ఆకుపచ్చ, నేవీ దళం తెలుపు రంగు దుస్తులు ధరిస్తుంది. ఈ మూడుదళాలకు అధిపతిగా త్రిదళాధిపతి (సీడీఎస్)ని కేంద్ర ప్రభుత్వం నియమించింది. భారత తొలి త్రిదళాధిపతిగా జనరల్ బిపిన్‌రావత్ నియమితులయ్యారు. అయితే ఆయనకు ఎలాంటి యూనిఫాం ఉంటుందన్న దానిపై సాధారణంగా కొంత ఆసక్తి ఉంటుంది. దీనికి తెరదించుతూ ఇండియన్ ఆర్మీ ఓ చిత్రాన్ని విడుదల చేసింది.
భుజాలపై కుంకుమ రంగు బ్యాడ్జీ, దానిపై బంగారు వర్ణంలో త్రివిధ దళాల గుర్తులు ఉంటాయి. అయితే సీడీఎస్ దుస్తులు మాత్రం ఆయన మాతృ సర్వీసువే ఉంటాయి. అంటే ఉదాహరణకు నూతనంగా ఎంపికైన సీడీఎస్ ఆర్మీకి చెందిన వారైతే ముదురు ఆకుపచ్చ దుస్తుల్నే ధరిస్తారు. మూడు సర్వీసులను మేళవించేలా త్రిదళాధిపతి టోపీని రూపొందించారు. ఆయన ర్యాంకును గుర్తించేలా భుజాలపై కత్తులు, నక్షత్రాల చిహ్నాలు ఉండబోవు. ఆయా దళాధిపతులకు కాలర్‌పై నాలుగు నక్షత్రాలు ఉంటాయి. కానీ, సీడీఎస్‌కు వీటిని తొలగించనున్నారు. అయితే సర్వీసు రిబ్బన్‌లను మాత్రం అలాగే ఉంచుతారు.
మరోవైపు త్రివిధ దళాల ఛీఫ్‌ల కార్యాలయాలపై ఆయా సర్వీసు జెండాలను ఎగురవేస్తుంటారు. అయితే త్రిదళాధిపతి కార్యాలయంపై ఎలాంటి జెండా ఎగుర వేస్తారన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ మూడు సర్వీసులను కలబోసేలా మరో జెండాను తయారు చేస్తారా? అనే దానిపై స్సష్టత రావాల్సి ఉంది.
సైన్యాధిపతిగా సెలవు.. సీడీఎస్‌గా రేపు రావత్ బాధ్యతలు