తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వాట్సాప్​పై కేంద్రం అసహనం.. 'పెగసస్'​పై వివరణకు ఆదేశం

పెగసస్ స్పైవేర్​​ కారణంగా పాత్రికేయులు, మానవహక్కుల కార్యకర్తల సమాచారం చోరీకి గురైన వ్యవహారంపై వాట్సాప్​ సంస్థను వివరణ కోరింది కేంద్రం. ఇటీవల జరిగిన సమావేశాల్లో ఈ విషయాన్ని ప్రస్తావించలేదని సంస్థపై అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. హ్యాకింగ్ విషయంలో కేంద్రం, భాజపా పాత్రపై ప్రశ్నలు సంధించారు కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ.

వాట్సాప్​పై కేంద్రం అసహనం.. 'పెగసస్'​పై వివరణకు ఆదేశం

By

Published : Nov 1, 2019, 7:02 PM IST

దిగ్గజ మెసెంజర్​ వాట్సాప్​లో పెగసస్​ స్పైవేర్​తో పాత్రికేయులు, మానవహక్కుల కార్యకర్తల సమాచారం తస్కరణకు గురవడం దుమారం రేపింది. ఈ విషయంపై వివరణ ఇవ్వాలని వాట్సాప్​ను ఆదేశించింది కేంద్రం. నవంబరు 4వరకు గడువిచ్చినట్లు సమాచారం. కోట్లాది మంది భారతీయుల వ్యక్తిగత సమాచారానికి ఎటువంటి భంగం వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలని వాట్సాప్​ సంస్థకు సూచించింది కేంద్రం. హ్యాకింగ్ ఎప్పుడు జరిగిందో తెలపాలని స్పష్టం చేసింది.

పెగసస్​ హ్యాకింగ్ జరిగి కొన్ని నెలలవుతున్నా... ఈ విషయాన్ని తమ దృష్టికి తీసుకురాలేదని వాట్సాప్​పై కేంద్రం అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. పలు సార్లు సమావేశాలు జరిగినా ఈ​ ప్రస్తావన ఎందుకు రాలేదని ఆ​ సంస్థ అధికారులను ప్రభుత్వం ప్రశ్నించినట్లు తెలుస్తోంది.

కావాలని చేశారా?

పెగసస్​ వ్యవహారం ఇప్పుడు వెలుగులోకి రావడంపై కేంద్రప్రభుత్వంలోని కొందకు అధికారులు అనుమానాలు వ్యక్తంచేశారు.

సామాజిక మాధ్యమాల దుర్వినియోగాన్ని అరికట్టే నిబంధనల రూపకల్పనకు 3 నెలల సమయం ఇవ్వాలని ఇటీవలే సుప్రీంకోర్టును కేంద్రం కోరింది. వాట్సాప్ వంటి యాప్​లలో సందేశాలు ఎవరు పంపుతున్నారో తెలిసే వ్యవస్థ ఉండాలని టెక్ సంస్థలపై ప్రభుత్వం ఒత్తిడి తెస్తోంది. ఇందుకు ఆయా సంస్థలు విముఖంగా ఉన్నాయి. సందేశాల మూలాలు కనుగొనేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టకుండా నివారించేందుకే ఈ 'పెగసస్'​ దుమారాన్ని ఉద్దేశపూర్వకంగా సృష్టించారా అని ప్రభుత్వ అధికారి ఒకరు ప్రశ్నించారు.

వాట్సాప్ స్పందన...

పెగసస్​ దుమారంపై వాట్సాప్ స్పందించింది. భారతీయుల వ్యక్తిగత స్వేచ్ఛను కాపాడే విషయంలో ప్రభుత్వానికి పూర్తి మద్దతు ఇస్తామని స్పష్టంచేసింది. హ్యాకర్లకు కఠిన శిక్ష పడేలా చూసేందుకు అవసరమైన చర్యలు చేపట్టినట్లు తెలిపింది వాట్సాప్.

స్పష్టతకు ప్రియాంక డిమాండ్​..

పెగసస్​ స్పైవేర్​ వ్యవహారంలో కేంద్రంపై విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ. ఒకవేళ ఇందులో భాజపా, కేంద్రం ప్రమేయం ఉంటే అది మానవహక్కులను కాలరాసిట్లేనని ధ్వజమెత్తారు. ఈ విషయంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్​ చేశారు ప్రియాంక.

మోదీ ప్రభుత్వం సెల్​ఫోన్లను హ్యాక్ చేస్తోందని ఆరోపించారు ప్రియాంక. ఇలాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరగాలన్నారు.

వాట్సాప్‌ ద్వారా 'పెగసస్‌' ఎలా వచ్చింది?

ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్‌ఎస్‌వో కంపెనీ అభివృద్ధి చేసిన 'పెగసస్‌' అనే హానికర స్పైవేర్‌ను తయారు చేసి ఫోన్లలోకి జొప్పించి పలు సంస్థలు హ్యాకింగ్‌కు యత్నించాయని వాట్సాప్‌ స్వయంగా అంగీకరించింది. భారత్‌లోని కొందరు పాత్రికేయులు, మానవ హక్కుల కార్యకర్తలు సహా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1,400 మంది ఫోన్లలోకి ఈ స్పైవేర్‌ను జొప్పించి గూఢచర్యం జరిపినట్లు తేలింది. టొరంటో విశ్వవిద్యాలయంలోని 'సిటిజన్‌ ల్యాబ్‌' అనే సైబర్‌ భద్రత ప్రయోగశాల సాయంతో ఈ దాడిని గుర్తించి, ఈ ఏడాది మేలోనే అడ్డుకున్నామని వాట్సాప్‌ తెలిపింది.

ఇదీ చూడండి: ఝార్ఖండ్​ ఎన్నికలకు మోగిన నగారా- 5 దశల్లో పోలింగ్

ABOUT THE AUTHOR

...view details