అసోం, మిజోరం రాష్ట్రాల మధ్య నెలకొన్న సరిహద్దు వివాదాన్ని పరిష్కరించేందుకు సహకరిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా.. అసోం ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్‌కి హామీ ఇచ్చారు. ప్రధాని మోదీ సైతం.. ఇరురాష్ట్రాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొనకుండా తగిన చర్యలు తీసుకోవాలని సోనోవాల్‌కి సూచించారు.
'అసోం-మిజోరం వివాద పరిష్కారానికి సహకరిస్తాం' - 'అసోం-మిజోరం సరిహద్దు వివాద పరిష్కారానికి సహకరిస్తాం'
అసోం, మిజోరం రాష్ట్రాల ప్రజల మధ్య ఆదివారం జరిగిన భారీ ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదాన్ని పరిష్కరించటానికి అన్నివిధాలా సహకారమందిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. అసోం ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్‌కు హామీ ఇచ్చారు.
మరోవైపు హోంశాఖ కార్యదర్శి అజయ్‌కుమార్ భల్లా నేతృత్వంలో రెండు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో వర్చువల్ సమావేశం జరిగింది. అంతర్రాష్ట్ర సరిహద్దులో శాంతి భద్రతలను పరిరక్షిస్తూ వివాదం చెలరేగకుండా తగిన చర్యలు తీసుకోవాలని రెండు రాష్ట్రాలకు భల్లా సూచించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఆదివారం రెండు రాష్ట్రాల ప్రజల మధ్య జరిగిన భారీ ఘర్షణ గురించి ప్రధానమంత్రి కార్యాలయానికి, హోం మంత్రిత్వశాఖకి అసోం ముఖ్యమంత్రి తెలియజేశారు. మిజోరం ముఖ్యమంత్రి జొరాంథంగాతో కూడా ఈ విషయంపై సోనోవాల్ చర్చించారు. సరిహద్దు సమస్యలను సామరస్యంతో పరిష్కరించుకుందామని పిలుపునివ్వగా జోరాంథంగా సమ్మతించారు.
ఇదీ చదవండి :అసోం- మిజోరం సరిహద్దు ప్రజల మధ్య ఘర్షణ