దేశంలో నిజాముద్దీన్ మత ప్రార్థనలు రేపిన కలకలంతో కేంద్రం అప్రమత్తమయింది. అందులో పాల్గొన్న వారి వివరాలు యుద్ధప్రాతిపదికన సేకరించాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది.
ఈ మేరకు రాష్ట్రాలు, యూటీల ముఖ్యకార్యదర్శులు, డీజీపీలతో ఇవాళ సమావేశమయ్యారు కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా. ప్రార్థనలకు హాజరైన విదేశీయులను గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సాధారణ వీసా కింద వచ్చి.. మత సమావేశాలకు హాజరైన నేరం కింద పరిగణించాలని సూచించారు. ప్రార్థనల్లో పాల్గొన్న వారు ఎవరిని కలిశారు.. ఎక్కడెక్కడ తిరిగారు వంటి వివరాలను సేకరించాలని స్పష్టం చేశారు.
తబ్లీగీ జమాత్ కార్యక్రమానికి హాజరైన వారిని గుర్తించటంలో పలు సమస్యలు ఎదురవుతున్నట్లు కేంద్రానికి రాష్ట్రాలు విన్నవించాయి. కరోనా నివారణకు చేపట్టిన కొన్ని చర్యలకు ఈ వెతుకులాట విఘాతం కలిగిస్తోందని తెలిపాయి. విదేశీయులను మాత్రం ఇప్పటికే గుర్తించినట్లు రాష్ట్రాలు వెల్లడించాయి. వారిపై వీసా ఉల్లంఘనలకు సంబంధించి చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు గౌబా సూచించారు.
మర్కజ్లో 2,300 మంది..
నిజాముద్దీన్‌లోని మర్కజ్ భవనంలో 2,300 మందికి పైగా తబ్లిగ్ జమాత్ కార్యకర్తలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీరిని మూడు రోజులుగా ఖాళీ చేయిస్తున్నారు. ఇందులో 617 మందిని ఆసుపత్రుల్లో చేర్పించారు. మిగిలిన వారిని క్వారంటైన్ కేంద్రాలకు తరలించారు.