విదేశాల్లో చిక్కుకుపోయిన ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా(ఓసీఐ) కార్డు హోల్డర్లను దేశంలోకి అనుమతిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. కుటుంబ సభ్యుల్లో ఎవరైనా అత్యవసర పరిస్థితుల్లో ఉంటే భారత్కు రావచ్చని తెలిపింది. ఓసీఐ కార్డులోని కొన్ని విభాగాలకు చెందిన వారికి ఈ సౌలభ్యం కల్పించింది.
భారతీయులకు జన్మించి, ఓసీఐ కార్డు కలిగి ఉన్న మైనర్లు, భారత పౌరులను వివాహం చేసుకుని ఓసీఐ కార్డు ఉన్న వ్యక్తులు, భారత పౌరులకు జన్మించి విదేశాల్లో చదువుకుంటున్న యూనివర్సిటీ విద్యార్థులను దేశంలోకి అనుమతిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే సమయంలో.. ప్రత్యేక విభాగానికి చెందిన ఓసీఐ కార్డు హోల్డర్ల జీవితకాల వీసా సదుపాయాన్ని పునరుద్ధరించినట్లు వెల్లడించింది.