తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భారత్​ బంద్​: లాక్​డౌన్​గా మారిన జనతా కర్ఫ్యూ! - governments of various states in india announces lockdown till march 31

కరోనా వైరస్​ను నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం కన్నా ముందే పలు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. జనతా కర్ఫ్యూ విజయవంతం అయిన నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో నిర్బంధం కొనసాగిస్తూ ప్రభుత్వాలు ప్రకటనలు వెలువరించాయి. పలు ప్రాంతాల్లో పాక్షికంగా ఆంక్షలు విధించగా.. మరికొన్ని ప్రాంతాల్లో పూర్తి స్థాయి లాక్​డౌన్​ ప్రకటించాయి. అయితే అత్యవసర సేవలను మినహాయించాయి.

coronavirus
కరోనా

By

Published : Mar 22, 2020, 6:46 PM IST

దేశంలో కరోనా వైరస్ కట్టడికి కేంద్రం కీలక నిర్ణయాలు వెలువరించింది. అన్ని అంతర్ రాష్ట్ర బస్సులు, ప్యాసెంజర్​ రైలు సర్వీసులను మార్చి 31 వరకు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. కరోనా కేసులు నమోదైన 75 జిల్లాలను పూర్తిగా నిర్బంధించాలని సంబంధిత రాష్ట్రాలను ఆదేశించింది.

కేంద్రం నిర్ణయానికి ముందే పలు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. అత్యవసర సేవలు మినహా అన్ని సర్వీసులను రద్దు చేసేందుకు సిద్ధమయ్యాయి. ప్రధాని పిలుపు మేరకు దేశవ్యాప్తంగా విజయవంతమైన జనతా కర్ఫ్యూనే లాక్​డౌన్​కు తొలి అడుగుగా మలుచుకున్నాయి. ఈ నిర్బంధాన్ని కొనసాగిస్తున్నట్లు ప్రకటించాయి.

  • మార్చి 31 వరకు దిల్లీలోని అన్ని(ఏడు) జిల్లాల్లో లాక్​డౌన్ విధిస్తూ అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రవాణా సేవలను రద్దు చేసింది. అంతర్జాతీయ విమానాల రాకపోకలను నిషేధించింది.
  • పంజాబ్​లోని పలు జిల్లాలను నిర్బంధించనున్నట్లు తొలుత ప్రకటించిన ఆ రాష్ట్ర ప్రభుత్వం... అనంతరం రాష్ట్రమంతటికీ వర్తింపజేస్తున్నట్లు వెల్లడించింది. మార్చి 31 వరకు నిర్బంధం కొనసాగనున్నట్లు పేర్కొంది. లాక్​డౌన్ సమయంలో ప్రభుత్వ సేవలు సహా ఆహార పదార్థాలు అమ్మే దుకాణాలు అందుబాటులో ఉంటాయని స్పష్టం చేసింది. బంద్ సమయంలో ఉద్యోగుల జీతాల్లో కోతలు విధించవద్దని సంస్థలను కోరింది.
  • కోల్​కతా సహా బంగాల్​లోని పలు ప్రాంతాలు మార్చి 27 వరకు నిర్బంధంలోనే ఉండనున్నట్లు మమత ప్రభుత్వం వెల్లడించింది. అత్యవసర సదుపాయాలు మాత్రం అందుబాటులో ఉంటాయని స్పష్టంచేసింది.
  • ఉత్తరాఖండ్ ప్రభుత్వం మార్చి 31 వరకు రాష్ట్రంలో నిర్బంధం ప్రకటించింది. ఆహార పదార్థాలు, కూరగాయల అమ్మకాన్ని ఈ నిర్బంధం నుంచి మినహాయిస్తున్నట్లు స్పష్టం చేసింది.
  • కేంద్ర పాలిత ప్రాంతమైన ఛండీఘడ్​లోనూ మార్చి 31 వరకు నిర్బంధం విధించింది అక్కడి యంత్రాంగం. రవాణా సేవలను రద్దు చేసింది. వదంతులను నమ్మొద్దని ప్రజలకు సూచించింది.
  • గుజరాత్​లోని పలు నగరాల్లో విధించిన పాక్షిక లాక్​డౌన్​ను... అక్కడి ప్రభుత్వం కొనసాగించింది. అహ్మదాబాద్, సూరత్, వడోదర, రాజ్​కోట్​లో ఈ ఆంక్షలు మార్చి 25 వరకు వర్తిస్తాయని ప్రకటించింది. మార్చి 29 వరకు.. ప్రభుత్వ కార్యాలయాలు 50 శాతం ఉద్యోగులతో(రొటేషన్ పద్ధతితో) పనిచేస్తాయని తెలిపింది.
  • ఉత్తర్​ప్రదేశ్​లోని 15 జిల్లాల్లో నిర్బంధం విధిస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. తొలి విడత లాక్​డౌన్​లో భాగంగా ఆయా ప్రాంతాల్లో మార్చి 25 వరకు ఆంక్షలు కొనసాగనున్నట్లు తెలిపారు.
  • హరియాణాలో వైరస్ ప్రభావం ఉన్న 7 జిల్లాలను నిర్బంధంలో ఉంచేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మరోవైపు రాష్ట్రంలో జనతా కర్ఫ్యూ కొనసాగించే అవకాశం ఉన్నట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి తెలిపారు.
  • ముందు జాగ్రత్త చర్యగా తెలంగాణలోనూ లాక్​డౌన్​ ప్రకటిస్తున్నట్లు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్​ రావు తెలిపారు. ప్రగతి భవన్​లో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి ఈ మేరకు నిర్ణయం ప్రకటించారు. ప్రజలు బయటకు రావద్దని కోరారు.

ఆంధ్రప్రదేశ్​లో కర్ఫ్యూను రెండు రోజుల పాటు కొనసాగించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి:జనతా కర్ఫ్యూలో రాజకీయ ప్రముఖులు- చప్పట్లతో సంఘీభావం

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details