నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వానికి వరసగా రెండోసారి 2019 మే 23న ప్రజలు అఖండ మెజారిటీ ఇచ్చి బాధ్యతలు అప్పగించారు. రెండు పర్యాయాలు వరసగా ఒకే పార్టీకి, నాయకుడికి లోక్‌సభలో మెజారిటీ మద్దతు లభించడం 1971 తరవాత ఇదే మొదలు. పదవిలో ఉన్న ప్రధాని ఇందిరాగాంధీని ఆమె రక్షకులే బలి తీసుకున్న నేపథ్యంలో 1984 లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. దేశ సమగ్రతకు పెనుసవాలు ఎదురైన సందర్భంలో రాజీవ్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్‌కు ప్రజలు అసాధారణ మెజారిటీ కట్టబెట్టారు. అప్పటికి ఆరేళ్ల క్రితమే చైనా తన ఆర్థిక వ్యవస్థను ఆధునీకరించే ప్రయత్నాలు ప్రారంభించింది. 1984-89 మధ్యకాలంలో ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టం చేయడానికి, ఆర్థిక సంస్కరణలు చేపట్టి పోటీ వ్యవస్థను రూపొందించడానికి, పాలనను సమూలంగా సంస్కరించి ప్రజల జీవితాలను మార్చేందుకు అద్భుతమైన అవకాశం వచ్చింది. దాన్ని సద్వినియోగం చేసుకోవడంలో భారత రాజకీయ వ్యవస్థ విఫలమైంది.
ప్రజా తీర్పు అంతరార్థం
సంస్కరణలకు కట్టాలి పట్టం.. ఇదే ప్రధాని తక్షణ కర్తవ్యం! నరేంద్ర మోదీ పట్ల అచంచల విశ్వాసంతో రెండు దఫాలు వరసగా ప్రజలు ఇచ్చిన తీర్పులు యథాస్థితిని కొనసాగించడం కోసం కాదు- దేశ రాజకీయాన్ని, పాలనను, ఆర్థిక వ్యవస్థను సమూలంగా మార్చి స్వచ్ఛ పాలన అందిస్తారని; ప్రజల ఆకాంక్షలు, అవసరాలు తీర్చే బలమైన ఆర్థికవ్యవస్థను నిర్మిస్తారన్న ఆశతో మద్దతిచ్చారు. రెండోసారి మోదీకి బాధ్యతలు అప్పగించి కొద్దిమాసాలే అయినా, ఇప్పటికే దేశంలో చాలా ప్రాంతాల్లో అసంతృప్తి, నిరసన వ్యక్తమవుతున్నాయి. గడచిన నెలరోజుల్లో రెండు అంశాలపై ప్రజల నుంచి తీవ్రమైన భావోద్వేగాలు వ్యక్తమయ్యాయి. వాటిలో ఒకటి- హైదరాబాదు నగర శివార్లలో ‘దిశ’పై జరిగిన అత్యాచారం!
దేశవ్యాప్తంగా ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించిన పరిణామమిది. అనంతరం పోలీసు కాల్పుల్లో నేరస్తులు మరణించడం, ఆ సందర్భంగా వ్యక్తమైన ఆనందోత్సాహాలు. ఇది ప్రభుత్వం ఒక్క రోజులో సృష్టించిన సమస్య కాదు. అయినా దీర్ఘకాలంగా చట్టబద్ధపాలన ద్వారా ప్రజలకు భద్రత కల్పించడంలో వ్యవస్థ వైఫల్యానికి ‘దిశ’ ఉదంతం ఒక నిదర్శనం. ప్రభుత్వం మొదటి బాధ్యత శాంతిభద్రతలు కాపాడటం, ప్రజలకు రక్షణ ఉందన్న భరోసా కల్పించడం, నేరాలు అదుపు చేయడం, చట్టబద్ధ పాలన ద్వారా సత్వర న్యాయం అందించడం, న్యాయస్థానాల ద్వారా కఠిన శిక్షలు పడేందుకు అనువుగా చర్యలు చేపట్టడం.
ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా, నాయకులకు ఎంత ప్రజాదరణ లభించినా, ఈ మౌలిక బాధ్యత నెరవేర్చడంలో దేశమంతటా మన వ్యవస్థ విఫలమైందనే చెప్పాలి. చట్టబద్ధపాలనను సంస్కరించడం క్షణాల్లో జరిగే పని కాదు. ఇందుకు పకడ్బందీగా, దీర్ఘకాలిక దృక్పథంతో ముందుకు సాగాలి. బలమైన పోలీసు, ఫోరెన్సిక్, స్వతంత్ర నేరపరిశోధన, సమర్థమైన ప్రాసిక్యూషన్, కోర్టుల్లో వేగంగా నేరవిచారణ అత్యవసరం.
బాధ్యత లేదా?
అన్ని పార్టీల, ప్రభుత్వాల ప్రథమ కర్తవ్యం చట్టబద్ధపాలనకు భరోసా ఇవ్వడం. ఆ బాధ్యతను విస్మరించిన ప్రభుత్వాలు యథాస్థితిని కొనసాగించడానికే పరిమితమయ్యాయి. ప్రజలు ప్రతిరోజూ ఆందోళనలు చెయ్యలేరు. దారుణ నేరాలు జరిగినప్పుడు మాత్రం వారు విచలితులవుతున్నారు. తాత్కాలిక ఉపశమనాలతో ప్రజలను శాంతపరచడం తప్ప తమకున్న అధికారాన్ని, పలుకుబడిని వ్యవస్థలో అవసరమైన మార్పులు తీసుకు వచ్చేందుకు ఉపయోగించలేదు. అలాగే నేరం చేస్తే శిక్ష పడుతుందన్న భయమూ నశించిపోయింది. నేరస్తుడు తన నేరాన్ని అంగీకరిస్తే తప్ప, మిగిలిన కేసుల్లో శిక్షలు పడేది 10 శాతం కంటే తక్కువే. సంవత్సరాల తరబడి నేర విచారణ జరిగి, ఆ తరవాత కేవలం నూటికి పదిలోపు కేసుల్లో మాత్రమే శిక్ష పడితే, ఇక సమాజంలో నేరస్తులకు భయం ఉండదు; ప్రజలకు రక్షణ ఉండదు!
పౌర జ్వాల
ఇటీవల భావోద్వేగాలను, ఆందోళనలను పెంచిన మరో అంశం- పౌరసత్వ చట్ట సవరణ. చట్టబద్ధపాలనను సంస్కరించలేకపోవడం కేవలం ప్రభుత్వ వైఫల్యం. కాని సమాజంలో అందరినీ కలిపే రీతిన; జాతి ఔన్నత్యం, రాజ్యాంగ విలువలను ఇనుమడింపజేసే తీరున కాకుండా పెద్దగా ప్రజాప్రయోజనం లేకున్నా వివిధ వర్గాల మధ్య అపనమ్మకాన్ని పెంచే పద్ధతిలో చట్టసవరణ చేపట్టారు. ఇది ప్రభుత్వం కావాలని చేపట్టిన చర్య.
వేల సంవత్సరాల చరిత్ర కలిగిన భారతావని- అన్ని మతాలకు, భావాలకు స్వాగతం పలికింది, ఆశ్రయమిచ్చింది. 2600 ఏళ్ల క్రితమే యూదులు మన గడ్డ మీద అడుగుపెట్టి, నాటికీ నేటికీ ఏ రకమైన దుర్విచక్షణ లేకుండా జీవిస్తున్నారు. క్రీస్తు శిలువనెక్కిన కొద్ది సంవత్సరాలకే క్రైస్తవం మన మలబారు తీరానికి వచ్చింది. ఆనాటి నుంచి ఎలాంటి వేధింపులు లేకుండా క్రైస్తవం భారత్‌లో మనగలుగుతోంది.
పార్సీలు పర్షియాలో దాడుల నుంచి తప్పించుకుని భారత గడ్డ మీద అడుగుపెట్టి ఈ దేశ నిర్మాణంలో నాడూ నేడూ కీలక పాత్ర వహిస్తున్నారు. మహమ్మదు ప్రవక్త నిర్యాణం తరవాత కొద్ది దశాబ్దాలకే ఇస్లాం భారత్‌లోకి ప్రవేశించింది. ఆనాటి నుంచి ఏ ఆటంకం లేకుండా పూర్తి స్వేచ్ఛతో మనగలుగుతోంది. ఈ నేపథ్యంలో మన పొరుగుదేశాల్లో మతపరమైన దుర్విచక్షణ కారణంగా వేధింపులకు, హింసకు గురైనవారికి ఆశ్రయం ఇవ్వడం మన సమాజానికి గల సహజ లక్షణం.
అదే లక్ష్యమైతే మత దుర్విచక్షణకు, మతం కారణంగా హింసకు గురయ్యే వారందరికీ ఆశ్రయం ఇచ్చి, వారికి పౌరసత్వం కల్పించే చట్ట సవరణను అన్ని వర్గాల మద్దతుతో, ఎవరికీ ఆందోళన అశాంతి కలగకుండా సునాయాసంగా చేపట్టవచ్చు. కాని ఇదేదో ఇస్లాముకు వ్యతిరేకంగా చేస్తున్నారన్న అనుమానాలు కలిగించే పద్ధతిలో చట్టం ఉండటంతో సమస్యలు తలెత్తాయి. ఈశాన్య భారతంలో బంగ్లాదేశ్‌నుంచి కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో వలస వచ్చినవారిని గుర్తించేందుకు చేపట్టిన ఎన్‌ఆర్‌సీ (పౌర పట్టిక)ని దేశమంతా కచ్చితంగా అమలు చేసి, విదేశాల నుంచి వచ్చిన ‘చెదల’ని పారదోలతామన్న ప్రకటనల కారణంగా ఆందోళనలు చెలరేగాయి. ఫలితంగా కొన్ని వర్గాల్లో తలెత్తిన అనుమానాలను తక్షణం తొలగించే ప్రయత్నాలు చేయకుండా, మరింత రెచ్చగొట్టే ప్రకటనలను బాధ్యతాయుత స్థానాల్లోనివారే చేయడం దురదృష్టం.
ఈ రెండు ఉదంతాలను పరిశీలిస్తే ప్రస్తుతం దేశంలో పెరుగుతున్న అసంతృప్తికి, ప్రజల్లో వ్యాపిస్తున్న అభద్రత భావానికి కారణాలు బోధపడతాయి. జాతినిర్మాణంలో, ఆర్థికవ్యవస్థను పరిపుష్టం చేయడంలో వైఫల్యానికి కారణాలు తేటపడతాయి. ఈ ప్రభుత్వం ఎన్నికల్లో ప్రజల మద్దతు పొందగలిగిందిగాని- దాని వెనక ఉన్న ప్రజల ఆర్తిని, ఆకాంక్షలను గుర్తించలేకపోయింది. దేశాన్ని ఆధునీకరించడానికి, చైనాకు దీటుగా ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేయడానికి, సమాజంలో సామరస్య భావనను పెంపొందించడానికి, ప్రపంచంలో ఒక ఉన్నతమైన నాగరికతకు ప్రతీకగా భారత్‌ను నిలబెట్టేందుకు ఒక అద్భుత అవకాశాన్ని ప్రజలు మోదీకి ఇచ్చారు.
ఇప్పటికైనా తేరుకోవాలి...
కొంతకాలం వృథా అయినా ఇంకా సమయం మించి పోలేదు. ప్రభుత్వానికి వనరుల కొరత ఉంది. చాలా రాష్ట్రాలు ఆర్థిక సంక్షోభం అంచున ఉన్నాయి. ప్రభుత్వాల ఆదాయాలు ఆశించినంతగా పెరగకపోగా, అనుత్పాదక ఖర్చులు పెచ్చరిల్లుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఆర్థిక క్రమశిక్షణను పాటించడం అవసరం. రాష్ట్రాల స్థాయిలో తాయిలాల కోసం చేస్తున్న వ్యయాన్ని చట్టబద్ధంగా అదుపు చేయాలి. గతంలో ద్రవ్యలోటును అదుపు చేయడానికి ద్రవ్య బాధ్యత బడ్జెట్ నిర్వహణ(ఎఫ్‌ఆర్‌బీఎం) చట్టం; వస్తుసేవల పన్ను (జీఎస్‌టీ)కోసం రాజ్యాంగ సవరణ తెచ్చినట్లుగానే- అన్ని పార్టీలను కలిపి కేంద్ర, రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం సాధించి, తాత్కాలిక జనాకర్షక పథకాలు రాష్ట్రాల బడ్జెట్లో పరిమిత శాతం దాటకుండా చట్టం తీసుకురావడం అవసరం. ప్రధాని మోదీకి ఆ స్థాయి, నైపుణ్యాలు ఉన్నాయి.
నూతనంలో జరగాల్సినవి...
నూతన సంవత్సరంలోకి అడుగుమోపుతున్న తరుణంలో దేశంలో అలుముకున్న నైరాశ్యాన్ని తొలగించాలి. ఆర్థిక వ్యవస్థ విస్తరణకు చట్టబద్ధపాలనను సంస్కరించడం; అధికారాన్ని బాధ్యతలతో సమన్వయపరచి వికేంద్రీకరించడం; ప్రజలకు సేవలను విధిగా, నిర్దిష్ట కాలపరిమితిలోగా అందించే చట్టం చేసి అమలు చేయాలి. అవినీతిని అదుపు చేసేందుకు కావలసిన వ్యవస్థాగత ఏర్పాట్లు చేయడంతోపాటు- ప్రస్తుత ఖర్చులకు లోబడే ఉత్తమ ప్రమాణాల విద్యను ప్రతి బిడ్డకు అందించడం కోసం సమగ్ర సంస్కరణలు తీసుకురావాలి.
పరిమిత వ్యయంతో మంచి ఆరోగ్యాన్ని అందరికీ అందించే ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలి. ఇవన్నీ దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురయ్యాయి. వీటికి డబ్బు ఖర్చు లేదు- కేవలం రాజకీయ సంకల్పం, పాలన సామర్థ్యం కావాలి. కొత్త సంవత్సరంలో ఈ చర్యలు ప్రారంభించి వచ్చే నాలుగేళ్లలో కావలసిన మార్పులు చేయడం అసాధ్యం కాదు. ఎన్నికల్లో ఓట్ల కొనుగోలు, కోట్ల ఖర్చు, అంతులేని అవినీతి, దుష్పరిపాలన పెరిగిపోతున్నాయి. మౌలికమైన రాజకీయ సంస్కరణలు వెన్వెంటనే చేపడితేనే ప్రజాస్వామ్యాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించగలం.
ప్రభుత్వాన్ని కనీసం రాష్ట్రాల్లో, స్థానిక ప్రభుత్వాల్లో ప్రత్యక్షంగా ఎన్నుకునే ఏర్పాట్లు చేయాలి. దామాషా పద్ధతి ఎన్నికల వ్యవస్థను కొలువుదీర్చి రాజకీయాలను సమూలంగా ప్రక్షాళించడంతోపాటు- మూడో అంచె ప్రభుత్వాలకు పూర్తి బాధ్యతలు అప్పగించి, ప్రజలకు జవాబుదారీగా, పారదర్శకంగా స్థానిక ప్రభుత్వాలు పనిచేసేలా ఏర్పాట్లు చేయాలి.
సంస్కరణలతోనే ప్రగతి...
ఈ సమూల సంస్కరణలు తెచ్చినప్పుడే ప్రజాస్వామ్యం కేవలం ఒక అధికార క్రీడగా కాకుండా, మనందరికి ఉమ్మడి సేవలందించే సమగ్ర వ్యవస్థగా రూపొందుతుంది. వీటిని సాధిస్తే అది నిజమైన రాజకీయ విజయం. వీటిని సాధించలేని ప్రభుత్వాలు, నాయకులు ఎన్నికల్లో నెగ్గవచ్చుగాని దేశ నిర్మాణంలో, జాతి భవిష్యత్తును భద్రపరచడంలో విజయం సాధించినట్లు కాదు. వచ్చే నాలుగేళ్లు- మన దేశ భవిష్యత్తుకు పరీక్షా సమయం. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని చరిత్ర సృష్టించడం ఒక జాతిగా మనకు అసాధ్యమేమీ కాదు.
అందుకు ముందుచూపు, రాజకీయ సంకల్పం, సమర్థ నాయకత్వం, ఆరోగ్యకరమైన బహిరంగ చర్చ, సమాజంలో పరస్పర విశ్వాసం, క్రమశిక్షణ అవసరం. ఈ మార్పులు కేవలం ఒక ప్రధానమంత్రి వల్లనో, ప్రభుత్వం వల్లనో మాత్రమే సాధ్యం కావు. అన్ని వర్గాల ప్రజలు, ఆలోచనాపరులు ఐక్యంగా అవిశ్రాంత కృషి చేస్తేనే సాధ్యం. అందుకు నాయకత్వం వహించి నడిపించే అరుదైన అవకాశం నరేంద్ర మోదీ ప్రభుత్వం ముందుంది. కొత్త సంవత్సరంలో ప్రభుత్వం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటుందనే ఆశిద్దాం!
డాక్టర్ జయప్రకాష్ నారాయణ్ - రచయిత- ప్రజాస్వామ్య పీఠం(ఎఫ్డీఆర్), లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపకులు