తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కరోనా సమర వ్యూహంలో.. వలస జీవులకు ఆసరాగా నిలవాలి

కోరలు చాస్తున్న కరోనాను జయించడానికి 21 రోజుల దిగ్బంధాన్ని ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలు వలస శ్రామికులపై పిడుపాటులా పడింది. వీరందరినీ తిరిగి ఇంటికి చేర్చే బాధ్యతను తీసుకున్న ప్రభుత్వాలు ఆ పనుల్లో నిమగ్నమయ్యాయి. నిజానికి సరైన అవగాహన కలిగించి.. అప్రమత్తంగా ఉండాలన్న స్పృహను పెంచడం వారితో పాటు సమాజానికి మంచి చేస్తుంది.

government should Support for migrants
వలస జీవులకు ఆసరా

By

Published : Apr 1, 2020, 8:02 AM IST

కదం తొక్కుతూ కదిలే జనసమూహాలతో పదం కలిపి నిశ్శబ్ద మృత్యుఘాతాలతో విరుచుకుపడటం కరోనా వైరస్‌ నైజం. కాబట్టే 21 రోజుల దిగ్బంధాన్ని ప్రకటిస్తూ ఎక్కడివారు అక్కడే, ఎవరిళ్లకు వాళ్లే పరిమితం కావాలన్నది మార్చి 24న కేంద్ర ప్రభుత్వం జారీచేసిన ఆదేశాల సారాంశం! కొవిడ్‌ విజృంభణకు కళ్ళెం వేసి అది అంటువ్యాధిగా మారకుండా నియంత్రించేందుకు కేంద్రం ప్రకటించిన దిగ్బంధం- లక్షలాది వలస శ్రామికులపై పిడుగుపాటులా మారింది. రోజూ నాలుగు లక్షల మందికి భోజన సదుపాయం కల్పిస్తామని ప్రకటించినా, ఊళ్లకు వెళ్లడానికే సిద్ధపడిన వేలమంది కోసం దిల్లీ ప్రభుత్వం 570 బస్సులు, యూపీ ప్రభుత్వం ఆదరాబాదరా వెయ్యి బస్సులు నడిపాయి. వలస కూలీల్ని సొంత ఊళ్లకు పంపించడానికి బిహార్‌, రాజస్థాన్లూ విస్తృతంగా బస్సుల్ని తిప్పాయి. సందట్లో సడేమియాలా ఘజియాబాద్‌ పరిసర ప్రాంతాలకు చెందిన వలస కూలీల కుటుంబాల్ని యూపీ బిహార్లకు తరలించిన ప్రైవేటు ఆపరేటర్లు- 50 సీట్ల బస్సులో 120మందిని కుక్కి, మరెంతోమందిని బస్సుపైన ఎక్కించి చేసిన విన్యాసం కరోనా ముప్పునకు ప్రత్యేక ఆహ్వానం పలికేటంత తీవ్రమైనది.

మానవీయ వ్యూహాలేవి?

మరోవంక బరేలీ చేరిన వలస కూలీల్ని కూర్చోబెట్టి సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణం పిచికారీ చేసిన వైనం నిర్ఘాంతపరుస్తోంది. ఈ అమానుషానికి తెగించిన యూపీ అధికారగణం- వలస కూలీల బట్టలపై వైరస్‌ ఆనవాళ్లను నాశనం చెయ్యడానికే ద్రావణాన్ని పిచికారీ చేయాల్సివచ్చిందని సమర్థించుకోవడం నగుబాటు! ఆ ద్రావణాన్ని మనుషుల మీద ప్రయోగించరాదన్న కచ్చితమైన నిషేధాలున్నా- సంక్లిష్ట పరిస్థితుల్లో కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టే అధికారుల దుందుడుకుతనం క్షమార్హం కాదు. గుజరాత్‌లోని సూరత్‌లోనూ రవాణా సదుపాయం కోసం వలస కూలీల ఆగ్రహం కట్టలు తెంచుకొని శాంతి భద్రతల పరిస్థితి ఉత్పన్నమైన నేపథ్యంలో- వలసదారుల ఆందోళనల్ని ఉపశమింపజేసే మానవీయ వ్యూహాలు అన్నిచోట్లా సమర్థంగా పట్టాలకెక్కాలి!

సాందరన శిబిరాలు

జన సంచారాన్ని కట్టుదిట్టంగా నియంత్రించకుంటే కరోనా కోరల్లో చిక్కి విలవిల్లాడాల్సి వస్తుందని భారతీయ వైద్యపరిశోధన మండలి (ఐసీఎమ్‌ఆర్‌) విస్పష్టంగా హెచ్చరించినందునే మోదీ ప్రభుత్వం దేశవ్యాప్త దిగ్బంధాన్ని అమలుచేస్తోంది. సర్కారీ లెక్కల మేరకే మూడు లక్షలమంది వలస కూలీలు లాక్‌డౌన్‌ నిబంధనల్ని ఉల్లంఘించారంటూ- జిల్లాలు రాష్ట్రాల సరిహద్దుల్ని మూసేసి, చిక్కుబడిపోయిన శ్రామికుల కోసం హైవేల వెంబడి సాంత్వన శిబిరాలు నెలకొల్పాలని కేంద్రం నిర్దేశించింది. అందుకోసం విపత్తు సహాయ నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వాలు వినియోగించుకోవాలని సూచించింది. జీవన్మరణ సమస్యగా మారిన యుద్ధంలో కరోనాపై మనం గెలవాల్సిందేనన్న ప్రధాని మాటే- యావత్‌ జాతి మనోగతం. నిరక్షరాస్యులైన వలస కూలీల్లో కొవిడ్‌ ముప్పు తీవ్రత పట్ల సదవగాహన కల్పించడం నేటి అవసరం! ఏ మాత్రం ప్రమత్తత అయినా ఎంత వినాశకరమో, భౌతిక దూరం ఎంత ప్రాణావసరమో నిరూపించే నిదర్శనాలు దేశీయంగానే పోగుపడుతున్నాయి.

వలస శ్రామికుల్లో స్పృహ పెంచాలి

సౌదీ అరేబియా నుంచి వచ్చిన మహిళ దిల్లీలోని మౌజ్‌పూర్‌ మొహల్లా క్లినిక్‌ డాక్టర్‌ను సంప్రతించి వెళ్లాక, ఆ వైద్యుడి కుటుంబంతోపాటు ఎనిమిది మందికి కరోనా సోకింది. ఆ డాక్టర్‌ దగ్గర చికిత్స పొందిన 900 మందిని ఇప్పుడు క్వారంటైన్‌ చేయాల్సి వచ్చింది. ఇటలీ జర్మనీల్లో పర్యటించి వచ్చిన బల్‌దేవ్‌ సింగ్‌ అనే మతబోధకుడు ఇంటిపట్టున ఉండకుండా వెలగబెట్టిన నిర్వాకం అతడి ప్రాణాల్ని బలిగొనడమే కాదు, పంజాబులోని రెండు జిల్లాలకు చెందిన 24 గ్రామాలవారిని (26 వేలమంది) క్వారంటైన్‌లోకి నెట్టింది. దిల్లీ కేంద్రంగా పనిచేసే తాబ్లిఘి జమాత్‌ ఇటీవల నిర్వహించిన సమ్మేళనం- కరోనా వ్యాప్తికి, 10 మరణాలకు, పలు రాష్ట్రాలకు చెందిన వందలమంది ఆసుపత్రులపాలు కావడానికీ కారణమైంది. వ్యక్తిగత జాగ్రత్తలు పాటించకున్నా, సమూహాలతో సన్నిహితమైనా కరోనా కాటు తప్పదన్న స్పృహను వలస శ్రామికుల్లో పెంచి, సంక్షోభం సమసేదాకా సంరక్షణ కేంద్రాల్లో వారిని జాగ్రత్తగా చూసుకోవాలి!

నిరంతరాయంగా నిత్యవసరాల సరఫరా

అధిక సంఖ్యాక జనం ఒకేసారి అస్వస్థులయ్యే దుస్థితి తలెత్తకుండా మూడు వారాల దిగ్బంధం ఉపకరిస్తోందని తాజా అధ్యయనాలు చాటుతున్నాయి. ఈ సమయంలో రాష్ట్రాలన్నీ తమ సరిహద్దులకు చేరిన వలస కూలీలందర్నీ సరైన వైద్యపరీక్షల తరవాత కచ్చితంగా రెండు వారాలపాటు క్వారంటైన్‌ చెయ్యాలని కేంద్రం సూచిస్తోంది. కరోనా కంటే ముందు ఆకలితో చచ్చేలా ఉన్నామంటూ కన్నీళ్ల పర్యంతం అవుతున్న వలస కూలీల వేదన వర్ణనాతీతం. ఈ కష్టకాలంలో వారిని కడుపులో పెట్టుకొని చూసుకొంటామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన భరోసా సంస్తుతిపాత్రం! ఈ పవిత్ర కర్తవ్య నిర్వహణలో రాష్ట్రాలకు నిత్యావసరాల సరఫరా నిరంతరాయంగా సాగేలా కేంద్రం పూనిక వహించాలి. ప్రజాపంపిణీ వ్యవస్థకు ప్రతి నెలా 40 లక్షల టన్నుల ఆహార ధాన్యాలు అవసరం కాగా గోదాముల్లో అయిదు కోట్ల 80 లక్షల టన్నుల నిల్వలు పేరుకొని ఉన్నాయి. అన్నార్తుల ఆకలి తీర్చడానికి వాటిని మళ్ళించాల్సిన సమయమిది!

రాష్ట్రాలు కీలక పాత్ర పోషించాలి

పశ్చిమ్‌ బంగ, బిహార్‌, ఝార్ఖండ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, ఉత్తరాఖండ్‌ తదితర రాష్ట్రాల్లోని పల్లెలు తమ గడ్డపై నుంచి వలసపోయినవారికి తలుపులు మూసేస్తున్నాయి! ఆ వాస్తవాన్ని వలస జీవులకు చెప్పి ఎక్కడివారు అక్కడే ఉండేలా ఒప్పించడం, భోజన సదుపాయాలు కల్పించి ఆదుకోవడం- కరోనాపై సమర వ్యూహంలో రాష్ట్రాలు పోషించాల్సిన కీలకపాత్ర కావాలి. వందల మంది వలస కూలీల్ని ఉంచే సంక్షేమ కేంద్రాల్లోనూ కరోనా విధినిషేధాలు గట్టిగా అమలవ్వాలి. జనసాంద్రత అత్యధికంగా ఉన్న ఇండియా కొవిడ్‌ను ఎలా ఎదుర్కొంటుందన్న సందేహ జీవులకు సమాధానంగా- కేంద్రం, రాష్ట్రాల ఉమ్మడి వ్యూహం విజయవంతం కావాలి!

ఇదీ చదవండి:అసలు ఏమిటీ తబ్లీగీ జమాత్‌? వీటి లక్ష్యాలేంటి?

ABOUT THE AUTHOR

...view details