దేశవ్యాప్తంగా 2020-21 ఖరీఫ్ సీజన్ పంట ఉత్పత్తులు మార్కెట్‌కు వస్తున్నాయి. ఈ సీజన్లో ఇప్పటి వరకు 3.57 లక్షల మంది రైతుల నుంచి 42.55 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేసినట్లు కేంద్రం వెల్లడించింది. ఇందు కోసం కనీస మద్దతు ధర కింద రూ. 8032.62 కోట్లు ఖర్చు చేసినట్లు వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజాపంపిణీ మంత్రిత్వ శాఖ ప్రకటన జారీ చేసింది. కేంద్ర తీసుకొచ్చిన నూతన వ్యవసాయ సంస్కరణ చట్టాలతో మద్దతు ధరపై విమర్శలు వెల్లువెత్తుతున్న క్రమంలో ఈ మేరకు ప్రకటన చేయటం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్లో 30.70 లక్షల మెట్రిక్ టన్నుల పప్పు దినుసులు, నూనెగింజల కొనుగోలుకు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, గుజరాత్, హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్‌లకు అనుమతులు ఇచ్చినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఆయా రాష్ట్రాల నుంచి అందిన ప్రతిపాదనల మేరకు ఈ అనుమతులు ఇచ్చినట్లు స్పష్టం చేసింది. అలాగే.. 1.23 లక్షల మెట్రిక్ టన్నుల కొబ్బరి పంటను కొనుగోలు చేసేందుకు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలు అనుమతులు ఇచ్చినట్లు తెలిపింది కేంద్రం. ఇతర రాష్ట్రాల నుంచి ప్రతిపాదనలు అందిన తర్వాత వాటికి కూడా అనుమతులు ఇస్తామని పేర్కొంది. మార్కెట్లో ధరలు తగ్గినప్పటికీ.. రైతుల నుంచి కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయనున్నట్లు తెలిపింది.