కరోనా వ్యాక్సిన్ అత్యవసర అనుమతులు, వినియోగం కోసం కేంద్రం విధివిధానాలను అన్వేషిస్తోంది. మూడో దశ క్లినికల్ ట్రయల్స్ పెండింగ్‌లో ఉన్న టీకాలకు తుది అనుమతులు ఇచ్చే విషయంపై సమాలోచనలు జరుపుతోంది. టీకా ముందస్తు కొనుగోలు ఒప్పందాలు, ధర వంటి విషయాలపై ఇటీవల కేంద్ర వైద్య శాఖ నిర్వహించిన సమావేశంలో చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ సమావేశానికి నీతి ఆయోగ్ సభ్యుడు వినోద్ పాల్, ప్రధాన శాస్త్రీయ సలహాదారుడు కే విజయ రాఘవన్, కేంద్ర వైద్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్‌లు హాజరయ్యారు.
"కొవిడ్ టీకా అత్యవసర వినియోగం కోసం ప్రధానమంత్రి కార్యాలయం ఏర్పాటు చేసిన వ్యాక్సిన్ టాస్క్ ఫోర్స్(వీటీఎఫ్) నియమాలు రూపొందిస్తుందని సమావేశంలో నిర్ణయించారు. వ్యాక్సిన్‌పై ఏర్పాటు చేసిన జాతీయ నిపుణుల బృందం.. ధరలు, మార్కెటింగ్ విషయాలపై విధానాలు రూపొందిస్తుంది."
-అధికార వర్గాలు
టీకాల అంశంలో పనిచేస్తున్న రెండు ప్రధాన సంస్థలు ఇందుకు సంబంధించిన నియమాలు స్పష్టంగా నిర్వచిస్తాయని అధికారులు వెల్లడించారు. అంతర్జాతీయంగా అనుమతులు లభించిన టీకాలను పరిశీలించే బాధ్యతలను సైతం వీటికి కట్టబెట్టినట్లు తెలిపారు. టీకా కొనుగోలు, ధరలపై చర్చల అంశాన్ని జాతీయ నిపుణుల బృందం పర్యవేక్షిస్తుందని చెప్పారు. మూడో దశ క్లినికల్ ట్రయల్స్ ఫలితాలు వచ్చిన వెంటనే జాతీయ నిపుణుల బృందం ఆయా టీకా సంస్థలతో చర్చలు జరుపాలని నిర్ణయించినట్లు చెప్పారు.
90 శాతానికిపైగా సమర్థతతో పనిచేస్తున్న ఫైజర్, మోడెర్నా టీకాలు.. అత్యవసర వినియోగం కోసం అమెరికా నియంత్రణ సంస్థ అనుమతులు కోరుతున్న నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయానికి ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇప్పటివరకు నిర్వహించిన అధ్యయనాల్లో తమ టీకా 95 శాతం సమర్థంగా పనిచేస్తుందని ఫైజర్ వెల్లడించింది. మోడెర్నా సంస్థ తయారు చేసిన టీకా 94.5 శాతం సమర్థంగా పనిచేస్తోందని తేలింది.
ఇదీ చదవండి-ఆయుర్వేద పట్టభద్రులూ శస్త్రచికిత్సలు చేయొచ్చు