గురువారం విడుదలైన హరియాణా ఎన్నికల ఫలితాల్లో మెజారిటీకి 6 సీట్ల దూరంలో నిలిచిపోయింది భాజపా. శుక్రవారం ఆ పరిస్థితి మారిపోయింది. మధ్యాహ్నానికల్లా కావాల్సిన మద్దతు కూడగట్టుకుని ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధంగా ఉంది కమల దళం. స్వతంత్రులతో కలిపి తన బలాన్ని 40 సీట్ల నుంచి 48కి పెంచుకుంది. వీరితో పాటు లోక్‌హిత్ పార్టీ నేత గోపాల్ కండా కూడా కాషాయ దళానికి తన మద్దతు ప్రకటించారు. ఇక్కడే వచ్చింది అసలు సమస్య.
గోపాల్ ఓ వివాదాస్పద నేత. ఆయనపై ఓ కేసు కూడా ఉంది. ఆత్మహత్యకు పాల్పడేలా ఓ మహిళను ప్రేరేపించారన్నది ఈ లోక్‌హిత్ నేతపై ఉన్న ప్రధాన ఆరోపణ. ఇప్పుడు ఈ వివాదాస్పద నేత మద్దతు ప్రకటించడం, భాజపా దాన్ని అంగీకరించేందుకు సిద్ధమవడంపై విపక్షాలు మండిపడ్డాయి. గోపాల్ కండా మద్దతును ఎలా స్వీకరిస్తారని ప్రశ్నలు సంధిస్తున్నాయి.
ఈ అంశంపై సొంత పార్టీ నుంచే భాజపాకు తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. కండా మద్దతుపై భాజపా వైఖరిని తీవ్రంగా తప్పుపట్టారు ఆ పార్టీ సీనియర్ నేత ఉమా భారతి. 2012లో కాంగ్రెస్ హయాంలో మంత్రిగా ఉన్న సమయంలో కండాపై వచ్చిన ఆరోపణలను ఉమా భారతి గుర్తుచేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కీర్తి ప్రతిష్ఠలపై ఈ అంశం ఓ మాయని మచ్చగా మిగిలిపోతుందని ఉమా భారతి హెచ్చరించారు.
భాజపాపై తీవ్ర విమర్శలు చేశారు కాంగ్రెస్ ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా. కండా... కాంగ్రెస్ మంత్రిగా ఉన్న సమయంలో ప్రధాని మోదీ, అమిత్‌షా.. ఆయనపై తీవ్ర ఆరోపణలు చేశారని గుర్తుచేశారు. ఇప్పడు ఆయన మద్దతుతోనే ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేస్తారని ప్రశ్నించారు.