30 కేజీల బంగారం అక్రమ రవాణా కేసులో నిందితులను పట్టుకునేందుకు కేరళ పోలీసుల సాయం కోరాయి కేంద్ర సంస్థలు. సాంకేతికంగా కేసు దర్యాప్తులో సహకారం అందించాలని లేఖ రాశాయి.
కేరళలో రాజకీయ దుమారం రేపిన బంగారం స్మగ్లింగ్ కేసులో ఓ మహిళ, ఆమె స్నేహితుడు ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వీరిద్దరు గతంలో కేరళలోని యూఏఈ కాన్సులేట్‌లో అధికారులుగా బాధ్యతలు నిర్వర్తించారు.
ఈ కేసులో భిన్న కోణాలున్నాయని, సమగ్ర విచారణ చేపట్టి వాస్తవాలు వెలుగులోకి తీసుకురావాలని ప్రధాని నరేంద్ర మోదీకి బుధవారం లేఖ రాశారు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్. కేసు దర్యాప్తులో జోక్యం చేసుకోవాలని కోరారు. మరునాడు కేంద్ర సంస్థలు కేరళ పోలీసులకు లేఖ రాశాయి.
బెయిల్ కోసం..
బంగారం స్మగ్లింగ్ కేసులో పరారీలో ఉన్న ప్రధాన నిందితురాలు ముందస్తు బెయిల్ కోసం కేరళ హైకోర్టును ఆశ్రయించింది. బుధవారం రాత్రి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసింది.
ఇదీ కేసు..
ఇటీవల యూఏఈ నుంచి తిరువనంతపురం విమానాశ్రయానికి అక్రమంగా తీసుకొచ్చిన దాదాపు 30 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. యూఏఈ కాన్సులేట్ మాజీ ఉద్యోగి అయిన సరిత్ అనే వ్యక్తి వద్ద ఈ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సరిత్‌ను అదుపులోకి తీసుకున్న అధికారులు మరో నిందితురాలు స్వప్నపై లుక్ ఔట్ నోటీసులు జారీ చేశారు.
యూఏఈ నుంచి కేరళలోని ఆ దేశ కాన్సులేట్‌కు వచ్చే పార్సిళ్ల ద్వారా 30 కిలోల బంగారాన్ని స్మగ్లింగ్ చేసినట్లు సమాచారం.
రాజకీయ దుమారం..
ఈ కేసు కేరళలో దుమారం రేపింది. ముఖ్యమంత్రి విజయన్ కార్యాలయం వరకు వెళ్లింది. సీఎం కార్యదర్శిగా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఐటీ శాఖ కార్యదర్శి శివశంకర్‌ను విధుల నుంచి తప్పించారు. బంగారం అక్రమ రవాణాలో ఆరోపణలు ఎదుర్కొంటున్న స్వప్నా సురేశ్‌ను ఐటీ శాఖలో ఆయనే నియమించారు. స్వప్నా సురేశ్‌ను ఐటీ శాఖలోకి ఏ విధంగా తీసుకున్నారనే అంశంపై ముఖ్యమంత్రి పినరయి విజయన్... శివశంకర్ నుంచి వివరణ కోరనున్నారు. మరోవైపు నిందితురాలు స్వప్నా సురేశ్.. ముఖ్యమంత్రి విజయన్‌తో కలిసి ఉన్న చిత్రాలు చర్చనీయాంశమయ్యాయి.
ఇవీ చూడండి: