గోవా: బలం పెరిగాక మిత్రపక్షాలకు భాజపా హ్యాండ్ గోవాలోని భాజపా ప్రభుత్వం మంత్రివర్గ విస్తరణకు సిద్ధమైంది. కాంగ్రెస్ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు భాజపాలో విలీనమైన నేపథ్యంలో వారిలోని ముగ్గురిని కేబినెట్లోకి తీసుకోనుంది. డిప్యూటీ స్పీకర్ మైఖేల్ లోబోను మంత్రివర్గంలోకి తీసుకుంటున్నట్లు భాజపా వర్గాలు తెలిపాయి.
కేబినెట్‌లో చేరే ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేల పేర్లు మాత్రం వెల్లడించలేదు. ప్రమాణ స్వీకార కార్యక్రమం నేడు మధ్యాహ్నం 3 గంటలకు జరుగుతుందని సావంత్ తెలిపారు.
అంతకుముందు మంత్రివర్గ విస్తరణ కోసం ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ గోవా ఫార్వర్డ్ పార్టీకి చెందిన ముగ్గురు మంత్రులు సహా స్వతంత్ర ఎమ్మెల్యే రోహన్ ఖౌంటేను మంత్రి పదవులకు రాజీనామా చేయాలని ఆదేశించారు.అయితే భాజపా జాతీయ నాయకత్వంతో చర్చించిన తర్వాతే రాజీనామాలపై నిర్ణయం తీసుకుంటామని జీఎఫ్పీ అధినేత విజయ్ సర్దేశాయ్ స్పష్టం చేశారు.
2017, 2019 మార్చిలో భాజపా గోవాలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడానికి జీఎఫ్పీ మద్దతు తప్పనిసరైంది. ఇప్పుడు 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల చేరికతో ఆ పార్టీ మద్దతు భాజపాకు అవసరం లేకుండా పోయింది. కొత్త అండ వచ్చేసరికి మిత్రపక్షాలను భాజపా లెక్కచేయడం లేదు.
40 మంది సభ్యులున్న గోవా అసెంబ్లీలో ప్రస్తుతం భాజపాకు 27, కాంగ్రెస్‌కు 5, గోవా ఫార్వర్డ్ పార్టీకి ముగ్గురు, ఎన్సీపీ, ఎమ్జీపీలకు ఒక్కో సభ్యులుండగా ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు ఉన్నారు