దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచార ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు రాజ్యసభ సభ్యులు. హైదరాబాద్ షాద్నగర్లో పశువైద్యురాలిని బలిగొన్న నిందితుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన నిర్ణయాలు తీసుకోవాలని రాజ్యసభలో చర్చ సందర్భంగా కోరారు.
యావత్ దేశం ఏకతాటిపైకి రావాలి
అత్యాచారం, హత్య ఘటనలు చట్టాలు చేయటం ద్వారా పరిష్కారం కావన్నారు రాజ్యసభలో కాంగ్రస్ ప్రతిపక్షనేత గులాం నబీ ఆజాద్.
" నాకు తెలిసినంత వరకు మహిళలపై ఇలాంటి దాడులు తమ ప్రాంతంలో జరగాలని ఏ ఒక్క ప్రభుత్వం, ఏ ఒక్క పార్టీ, నాయకుడు, అధికారి కోరుకోడు. వీటిపై మనం ఇప్పటికే చాలా చట్టాలు చేశాం. ప్రస్తుతం జరుగుతున్న ఘటనలను చూస్తే.. కేవలం చట్టాలు చేసినంత మాత్రాన ఇవి ఆగవని అనిపిస్తోంది. ఈ సమస్యను పూర్తిగా నిర్మూలించేందుకు యావత్ దేశం, ప్రజలు ఒక్కటిగా నిలబడాల్సి ఉంది. ప్రతి ప్రాంతంలో అవగాహన కల్పించాలి. పార్లమెంటులో, విధానసభలో, పెద్ద పెద్ద విద్యాసంస్థల్లో, ప్రైవేటు సంస్థల్లో ఇలాంటి వాతావరణం కల్పించాలి. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మతాలు, రాజకీయాలకు అతీతంగా విచారణ జరిపి, కఠినంగా శిక్షించాల్సి ఉంది. "
- గులాం నబీ ఆజాద్, రాజ్యసభలో ప్రతిపక్ష నేత.
బహిరంగంగా శిక్షించాలి..
దిశపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితులను బహిరంగంగా ప్రజల మధ్య శిక్షించాలని ఎస్పీ ఎంపీ జయా బచ్చన్ డిమాండ్ చేశారు.
" ఇలాంటి హేయమైన అత్యాచార ఘటనలపై ఇక్కడ నిల్చొని ఎన్నిసార్లు మాట్లాడానో కూడా నాకు గుర్తులేదు. నిర్భయ కానీ, కథువా ఘటన కానీ, హైదరాబాద్ దుర్ఘటన కానీ.. ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఏం జరిగింది? ప్రభుత్వాలు ఎలా స్పందించాయి? దోషులను ఏ విధంగా శిక్షించారన్నది ప్రజలు గమనిస్తున్నారు. కొన్ని దేశాల్లో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ప్రజలే బహిరంగంగా దోషులను శిక్షిస్తారు. ఇది నా సూచన. కొంచెం కష్టమే. అయినప్పటికీ ఇలాంటి కిరాతకులను ప్రజల మధ్యలోకి తీసుకొచ్చి వారి ద్వారానే శిక్షించాలి. "
- జయా బచ్చన్, ఎంపీ.