మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా అక్టోబరు 2 నుంచి భారత్లో సింగిల్ యూస్ ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధిస్తున్నట్లు ప్రకటించారు ప్రధాని నరేంద్ర మోదీ. న్యూయార్క్లో జరుగుతున్న ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశాల్లో ప్రసంగించారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవం నాటికి 2 కోట్ల మంది పేదలకు ఇళ్లు నిర్మిస్తామని వెల్లడించారు. 2025 నాటికి క్షయ విముక్త భారత్ లక్ష్యాన్ని చేరుకుంటామని తెలిపారు.
అభివృద్ధి చెందుతున్న దేశమైన భారత్ ఐదేళ్లలో 11 కోట్ల మరుగుదొడ్లను నిర్మించిందన్నారు మోదీ. వచ్చే ఐదేళ్లలో 15 కోట్ల గృహాలకు రక్షిత మంచినీరు అందించనున్నట్లు పేర్కొన్నారు.
ఉగ్రవాదంపై ప్రపంచమంతా ఏకం కావాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు మోదీ. శాంతి, సామరస్యాలే ప్రపంచానికి భారత్ ఇచ్చే సందేశమని స్పష్టం చేశారు మోదీ. గాంధీ సిద్ధాంతాలు శాంతి, అహింస ఎప్పటికీ అనుసరణీయమని పేర్కొన్నారు భారత ప్రధాని. భారత్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని ఐరాస సర్వసభ్య సమావేశంలో మోదీ ప్రసంగించారు.
450 గిగావాట్ల పునరుత్పాదక శక్తి సాధనకు భారత్ కృషి చేస్తోందని చెప్పారు మోదీ. వాతావరణ మార్పుపై పోరాడుతున్న దేశాల్లో భారత్ ముందు వరుసలో ఉంటుందన్నారు. జాతీయ విపత్తును తట్టుకునేలా నిర్మాణాలు చేపట్టేందుకు కొయలిషన్ ఫర్ డిజాస్టర్ రెసిలియెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్(సీడీఆర్ఐ)ను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు మోదీ.
ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో మోదీ ప్రసంగం