తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఇస్రో: సవాళ్లు అధిగమించింది.. అద్భుతమే చేసింది

భారత్​ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చంద్రయాన్-2 ప్రయోగం నిర్వహించబోతోంది. ఈ దిశగా.. ఇస్రో శాస్త్రవేత్తలు ఎదుర్కొన్న సవాళ్లు... వాటిని అధిగమించేందుకు చేసిన ప్రయత్నాలు అపూర్వం. చంద్రునిపై వాతావరణ పరిస్థితులు, నీటి జాడ, అక్కడ ఉండే రసాయనాల గుట్టు విప్పే లక్ష్యంతో చేస్తున్న ఈ ప్రయోగం సఫలమైతే... మన శాస్త్రవేత్తల కృషి ఫలించినట్లే.

By

Published : Jul 22, 2019, 6:08 AM IST

Updated : Jul 22, 2019, 8:19 AM IST

ఇస్రో- 'సవాళ్లు అధిగమించింది.. అద్భుతమే చేసింది'

చంద్రయాన్​-2.... చంద్రునిపై వాతావరణ పరిస్థితులను, నీటి జాడలను అధ్యయనం చేయడం కోసం ఇస్రో చేపడుతున్న బృహత్తర ప్రయోగం. యావత్​ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ప్రయోగానికి రంగం సిద్ధమైంది. సాంకేతిక సమస్యలతో చంద్రయాన్ 2ఒకసారి వాయిదా పడినా.. ఈసారి మాత్రం గురి తప్పకుండా ఉపగ్రహాన్ని జాబిల్లిపై పంపేందుకు శాస్త్రవేత్తలు సమాయత్తమయ్యారు. ఈ ప్రయోగంలో ఎదురయ్యే సవాళ్లు ఊహించి వాటిని అధిగమించేందుకు శాస్త్రవేత్తలు చేపట్టిన చర్యలు అమోఘం. మరి వాటి గురించి తెలుసుకుందామా..?

సురక్షిత ల్యాండింగే పెద్ద సవాల్

చందమామ మీద ఉన్న వాతావరణం గురించి మనకు అవగాహన తక్కువే. అక్కడి పరిస్థితులను తట్టుకుని యంత్రపరికరాలు సమర్థంగా పనిచేయగలవా.. సురక్షితంగా వాహక నౌక గమ్య స్థానాన్ని చేరుతుందా.. చేరిన తర్వాత క్షేమంగా జాబిల్లిపై దిగుతుందా లేదా... అన్నదే ఇస్రోకు ఎదురైన ప్రధాన సమస్య. అందుకే ఈ విషయాలపై ఇస్రో శాస్త్రవేత్తలు భారీ కసరత్తే చేశారు. ముఖ్యంగా ల్యాండింగ్​ ప్రక్రియ కోసం... చంద్రునిపై ఉండే ప్రత్యేక పరిస్థితులను భూమిపైనే సృష్టించారు. ఆర్బిటర్​, ల్యాండర్​, రోవర్​పై విస్తృతంగా పరీక్షలు నిర్వహించారు.

ధూళిని తట్టుకోవడం ఎలా?

జాబిల్లి ఉపరితలం ధూళిమయం..! అది పరికరాల్లో చేరిపోయి.. వాటిని పాడు చేసే అవకాశం ఉంది. దీనిని అధిగమించేందుకు.. కొన్ని రకాల శిలలను పిండిచేసి, అచ్చం చంద్రుడిపై ఉన్నట్టే కృత్రిమ ధూళిని సిద్ధం చేశారు. ఈ ధూళిపై రోవర్​ను ప్రయోగాత్మకంగా నడుపుతూ.. మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దారు.

రోవర్​కు భారీ బెలూన్

భూమితో పోలిస్తే చంద్రునిపై గురుత్వాకర్షణ శక్తి 6 రెట్లు తక్కువ. భూమిపై 6 కేజీల బరువుండే వస్తువు.. చంద్రునిపై ఒక కేజీ మాత్రమే ఉంటుంది. అందుకే రోవర్​ బరువు తగ్గి తిరుగుతుందో లేదో అనే సందేహంతో దానికి భారీ బెలూన్​ కట్టారు. అది రోవర్ బరువును కొంతమేరపైకి లాగేసింది. ఆ పరిస్థితిలో అదెలా పనిచేస్తుందో పరీక్షించారు.

సొంత నిర్ణయాలు తీసుకోగలగాలి..!

ల్యాండర్, రోవర్లను చంద్రునిపై ఏ ప్రాంతంలో దించాలో శాస్త్రవేత్తలు నిర్ణయించగలరు. మరి అక్కడ అడ్డంకులు ఎదురైతే... ఎలా? అపుడు మరో సురక్షితమైన చోటులో దిగేందుకు వాటంతట అవే నిర్ణయం తీసుకోవాలి. అందుకోసం ల్యాండర్, రోవర్లలో వందలాది సెన్సర్లు అమర్చారు. ఇవి చంద్రుడికి ఎంత ఎత్తులో ఉన్నది... ఎంత వేగంతో వెళ్తున్నదీ లెక్కిస్తూ ఉంటాయి. వీటి పని విధానం పరీక్షించేందుకు బెంగళూరుకు 400కిలోమీటర్ల దూరంలోని చల్లకెరెలో పూర్తిగా చంద్రుడి ఉపరితలం పోలిన 10 బిలాలను కృత్రిమంగా రూపొందించారు శాస్త్రవేత్తలు. రెండు చిన్న విమానాలకు సెన్సర్లు అమర్చి... వాటిని బిలాల మీద ఎగిరేలా చేశారు. అవి ఉపరితలం నుంచి కిలోమీటరు ఎత్తులో ఉండి కూడా బిలాలను, రాళ్లను గుర్తించగలిగాయి.

సాఫ్ట్​ ల్యాండింగ్​

ఒకప్పుడు వ్యోమనౌకలు పరీక్షించిన అనంతరం.. నింగిలో వేగంగా దూసుకెళ్లి ఢీకొట్టి ముక్కలైపోయేవి. అందుకని పరికరాలను బెలూన్​ లాంటి కాప్సుల్స్​లో పెట్టి కిందపడేలా చేసేవారు. అది పడుతూ లేస్తూ కొంత దూరం వెళ్లి ఆగేది. ఈ క్రమంలో అందులోని పరికరాలు పాడైపోయి... ల్యాండర్లు విఫలమయ్యేవి.

ఈ సమస్యను అధిగమించేందుకు చంద్రయాన్​-2 కోసం వ్యతిరేక దిశలో మండే ప్రత్యేకమైన చిన్న చిన్న రాకెట్లు రూపొందించారు. వీటిని తమిళనాడు మహేంద్రగిరిలోని ఇస్రో ప్రొపల్షన్ కేంద్రంలో ప్రత్యేకంగా పరీక్షించారు. చంద్రుడిపై సాఫ్ట్​ ల్యాండింగ్ కోసం 47 ప్రయత్నాలు జరుగగా అందులో 27 విఫలమయ్యాయి. ఈ పరీక్షలతో ఇస్రో శాస్త్రవేత్తలకు అనేక కొత్త విషయాలు తెలిశాయి.

అంత తేలిక కాదు..

5 లక్షల 30 వేల కిలోమీటర్ల దూరంలోని చంద్రుడి వద్దకు వ్యోమపరికరాలను కచ్చితత్వంతో వెళ్లేలా చేయడం చాలా కష్టం. ప్రతిదశలోనూ.. కచ్చితంగా ఎంత అవసరమో బేరీజు వేసి.. సరిగ్గా అంతే స్థాయిలో రాకెట్లు మండించి, నిర్దిష్ట మార్గంలోకి మళ్లించాల్సి ఉంటుంది. వీటికి సంబంధించిన లెక్కలు పక్కాగా ఉండాలి. అంతిమంగా ల్యాండర్ తనవేగం తగ్గించుకుని జాబిల్లిపై క్షేమంగా దిగాలి. తన దారి తనే నిర్దేశించుకోవాలి. అందుకు నియంత్రణ వ్యవస్థ సక్రమంగా పనిచేయాలి. ఎక్కడా ప్రతికూలతలకు ఆస్కారం ఉండకూడదు. అంతదూరంలోని వ్యోమనౌకతో కమ్యునికేషన్ అంత తేలిక కాదు. కఠిన వాతావరణ పరిస్థితులను అధిగమించి సున్నితమైన పరిశోధన యంత్రాలు సాఫీగా పని చేయాలి.

అందుకే కాస్త ఆలోచించాల్సి వస్తోంది..

ఇన్ని సవాళ్లు ఉన్నందునే, చంద్రయానమంటే... అభివృద్ధి చెందిన దేశాలు సైతం కాస్త ఆలోచించాల్సి వస్తోంది. గతంలో అమెరికా మానవ సహిత యాత్రలు చేపట్టినా.. ఇప్పుడు అంతగా ఆసక్తి చూపడంలేదు. 1969లో నీల్​ ఆమ్​స్ట్రాంగ్​, బజ్​ ఆల్డ్రన్​లు తొలిసారిగా చంద్రునిపై కాలుమోపారు. చివరిగా 1972లో మానవులు చందునిపైకి వెళ్లి వచ్చారు. అక్కడి శిలల నమూనాలు తీసుకొచ్చి పరిశోధనలు చేశారు.

అమెరికా, సోవియట్​ యూనియన్​ల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరిగిన కాలంలో అంతరిక్ష రంగంలో విస్తృత పరిశోధనలు జరిపి, చంద్రుని పైకి యాత్రలు నిర్వహించాయి. అయితే అవి జాబిల్లిపై జెండాలు పాతి, తమదే పైచేయి అనిపించుకోవడానికే పరిమితమయ్యాయి. వాళ్లు చేసిన పరిశోధనలు పరిమితం. పైగా ఆనాటి సాంకేతిక పరిజ్ఞానం, కంప్యూటింగ్​ సామర్థ్యం కూడా తక్కువే.

విజయమే లక్ష్యం

1950ల నుంచి చంద్రునిపైకి అనేక దేశాలు వ్యోమనౌకలు పంపినా... 2008లో భారత్​ ప్రయోగించిన చంద్రయాన్​-1 మాత్రమే తొలిసారిగా జాబిల్లిపై నీటి జాడ గుర్తించింది. అయినా ప్రపంచ దేశాల దృష్టి చంద్రునిపై గాక, భూ దిగువ కక్ష్యపై నిలిచింది. 400 కిలోమీటర్ల ఎత్తులోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం -ఐఎస్​ఎస్​ నిర్మాణంపైనే అగ్రదేశాలు దృష్టి కేంద్రీకరించాయి. అందుకే నేటికీ చంద్రుడి గురించి అన్వేషించాల్సింది చాలానే ఉంది. ఈ ఉద్దేశంతోనే భారత్​ చంద్రయాన్​-2 ప్రాజెక్టు చేపట్టింది. ఈ ప్రయోగం సఫలమైతే.. అది చరిత్రాత్మక విజయంగా నిలిచిపోతుంది. ఇస్రో పేరు ప్రపంచమంతా మారుమోగిపోతుంది.

ఇదీ చూడండి: ఇమ్రాన్​పై 'పెద్దన్న' చిన్నచూపు.. నెటిజన్ల ట్రోల్స్​

Last Updated : Jul 22, 2019, 8:19 AM IST

ABOUT THE AUTHOR

...view details