హెలిప్యాడ్‌పై సాధన చేసి జాతీయ హాకీ ట్రయల్స్‌కు ఎంపిక ఛత్తీస్‌గఢ్ కొండగావూన్ జిల్లాలోని పలు పల్లెలపై నక్సలైట్ల ప్రభావం అధికం. తుపాకీ తూటాల శబ్దాలతో ఆ ప్రాంతం మారుమోగుతుంది. అభివృద్ధికి నోచుకోక.. చాలా వెనుకబడిపోయాయి ఆ గ్రామాలు. అలాంటి ప్రాంతం నుంచి వచ్చిన 9 మంది బాలికలు జాతీయ స్థాయి జూనియర్ హాకీ ట్రయల్స్‌కు ఎంపికయ్యారు. ఎన్నో సవాళ్లకు ఎదురొడ్డి నిలిచి.. జాతీయస్థాయికి వెళుతోన్న ఆ అమ్మాయిల ప్రతిభ ఎంతో మందికి ప్రేరణగా నిలుస్తోంది.
జిల్లాలోని మర్దపాల్కు చెందిన అమ్మాయిలు (14-17 ఏళ్ల వయసు) 2016లో శిక్షణ ప్రారంభించారు. అప్పటి వరకు వారు హాకీ స్టిక్‌ను చూడనేలేదు. కనీసం కాలికి షూ ఎలా వేసుకుంటారో కూడా వారికి తెలియని దుర్భర పరిస్థితి.
మావోయిస్టులను మట్టుబెట్టేందుకు కొండగావూన్ జిల్లాలో మోహరించిన ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) దళాలు వారికి శిక్షణ ఇచ్చాయి. ఐటీబీపీ ప్రోత్సాహంతో ఓ వైపు శిక్షణ పొందుతూ.. మర్దపాల్ కన్య ఆశ్రమంలో ఉంటూ చదువు కొనసాగించారు బాలికలు. ఈ ఏడాది జాతీయ స్థాయి జూనియర్ మహిళా హాకీ ట్రయల్స్ క్యాంప్‌నకు ఎంపికయ్యారు.
బాలికలు జాతీయ స్థాయి ట్రయల్స్‌కు ఎంపికవటంపై సంతోషం వ్యక్తం చేశారు ప్రధాన శిక్షకుడు, ఐటీబీపీ హెడ్ కానిస్టేబుల్ సూర్య స్మిత్.
" కొండగావూన్ ప్రాంతంలో విధుల్లో చేరిన తొలినాళ్లలోనే ఇక్కడి అమ్మాయిల్లో మంచి ప్రతిభ దాగి ఉందని గుర్తించాను. తమ కృషి, పట్టుదల, అంకితభావంతో వారు ఈ దశకు చేరుకున్నారు. కానీ.. సరైన వసతులు లేవు. ప్రస్తుతం 55 మందికి శిక్షణ ఇస్తున్నా. వారికి మంచి సౌకర్యాలు కల్పించి, శిక్షణ ఇస్తే అద్భుతాలు సృష్టిస్తారు. కన్య ఆశ్రమం సమీపంలో హాకీ ఆడేందుకు అనుమతించాలి. దాని ద్వారా రోజూ సాధన చేసే వీలు కలుగుతుంది. ప్రస్తుతం అరకొర వసతులతో.. మర్దపాల్ పోలీస్ క్యాంప్‌లోని హెలీప్యాడ్‌లో సాధన చేస్తున్నారు."
- సూర్య స్మిత్, ప్రధాన శిక్షకుడు
పాఠ్యపుస్తకాల్లో హాకీ జాతీయ క్రీడ అని చదువుకున్నప్పటికీ.. ఐటీబీపీ తమకు శిక్షణ ప్రారంభించే వరకు హాకీ గురించి ఏమీ తెలియదని చెప్పారు క్రీడాకారిణి సులోచన నేతమ్. హెలీప్యాడ్‌లో సాధన చేస్తున్నామని, ఇటీవలే తమకు హాకీ ఇండియా నుంచి శాశ్వత గుర్తింపు కార్డులు వచ్చాయన్నారు. హెలిప్యాడ్‌లో కొద్ది ప్రాంతం సిమెంట్ వేసి ఉందని.. మిగతా ప్రాంతం ఎత్తు పల్లాలుగా ఉండటం వల్ల దెబ్బలు తగులుతాయనే భయం ఉంటుందని చెప్పారు. తమకు సరైన మైదానం ఏర్పాటు చేయాలని కేంద్ర క్రీడల మంత్రి కిరణ్ రిజిజును కోరారు.
ఇదీ చూడండి: ఆవు-దూడకు 'మహా' పోలీసుల డీఎన్ఏ పరీక్ష