ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా దేశంలో జనాభా పెరుగుదలపై ఆందోళన వ్యక్తం చేశారు కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి దేశ జనాభా గణనీయంగా పెరిగిందని పేర్కొన్నారు. జన సంఖ్యను నియంత్రించేందుకు ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న తల్లిదండ్రుల ఓటు హక్కును తొలగించాలని సూచించారు.
భాజపా బిహార్ రాష్ట్ర నాయకుడు, కేంద్ర పశుసంవర్ధక, మత్స్య శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. జనాభా దినోత్సవం సందర్భంగా దేశ జనాభా పెరుగుదలకు సంబంధించిన గ్రాఫిక్ చిత్రాలను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. 1947-2019 మధ్య దేశ జనాభా 366 శాతం పెరిగిందని అందులో పేర్కొన్నారు. అదే సమయంలో జనాభా తక్కువగా ఉన్న అమెరికాలో కేవలం 113 శాతం మాత్రమే జన సంఖ్య పెరిగిందని ఉదహరించారు.
భారత్లో జనాభా పెరుగుదల పలు సమస్యలకు కారణమవుతోందని ట్విట్టర్లో రాసుకొచ్చారు సింగ్. భారత ఆర్థిక వ్యవస్థ, సామాజిక సామరస్యత, అవకాశాలను ఇది దెబ్బతీస్తుందని పేర్కొన్నారు. నియంత్రణలో విఫలమవటానికి మతపరమైన అడ్డంకులు ఒక కారణమని తెలిపారు. రాజకీయ నాయకులంతా ఏకతాటిపైకి వచ్చి జనాభా నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలని కోరారు.
జనాభా నియంత్రణకు పటిష్ఠ చర్యలు అవసరమని తెలిపారు గిరిరాజ్ సింగ్.