ఎక్కడ ఏ విపత్తు సంభవించినా ముందుండే జాతీయ విపత్తు స్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్).. కొవిడ్-19తో యుద్ధానికి సిద్ధమైంది. దేశంలో ఎన్నడూ ఎరుగని లాక్డౌన్కు దారితీసిన కరోనా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడేందుకు పూనుకుంది. అత్యవసర సమయాల్లో అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు పూర్తయినట్లు తెలిపారు ఎన్డీఆర్ఎఫ్ సారథి ఎస్ఎన్ ప్రధాన్.
శిక్షణ పొంది సిద్ధమయ్యారు
ఇప్పటికే వైరస్ ప్రభావిత రాష్ట్రాల్లో బలగాలను మోహరించినట్లు ఎన్డీఆర్ఎఫ్ డైరక్టర్ జనరల్ ఎస్ఎన్ ప్రధాన్ తెలిపారు. సిబ్బంది అంతా వ్యక్తిగత రక్షణ సామగ్రితో సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. రాష్ట్ర అధికారుల సమాచారం మేరకు ఘటనా స్థలాలకు వెళ్లి వైరస్ బాధితులకు, వైద్య బృందాలకు సహాయ చర్యలు చేపడతారని వెల్లడించారు.
"నెల రోజుల నుంచి నౌకాశ్రయాలు, విమానాశ్రయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను సైనికులు తెలుసుకున్నారు. మాస్కులు, గ్లౌసులు, రక్షక దుస్తులతో ఎలా వ్యవహరించాలో శిక్షణ పొందారు. సామాజిక దూరం పాడించడం, ప్రాథమిక చికిత్స వంటి కీలకాంశాలపట్ల అవగాహన పెంచుకున్నారు" అని తెలిపారు ప్రధాన్.