సుష్మా స్వరాజ్ మరణవార్త విని దేశ వ్యాప్తంగా ఆమె అభిమానులు శోక సంద్రంలో మునిగారు. తమ ప్రియనేత ఇక లేరన్న నిజాన్ని జీర్ణించుకోలేకపోయారు. దేశ విదేశాల్లోని సుష్మ ప్రియులు ఆమెను స్మరించుకున్నారు. అయితే గీత అనే దివ్వాంగురాలు(మూగ-చెవిటి) తన తల్లి లాంటి సుష్మను కోల్పోయానని విలపిస్తోంది. పాకిస్థాన్లో తప్పిపోయిన తనను స్వదేశానికి రప్పించడంలో సుష్మ ఎంతో కృషి చేశారని గుర్తుచేసుకుంది. తన సంరక్షకురాలిని కోల్పోయానని సంజ్ఞలతో చెప్పుకొచ్చింది గీత.
ఎనిమిదేళ్ల వయసులో...
గీతకు ఎనిమిదేళ్ల వయసున్నప్పుడు పాకిస్థాన్లో తప్పిపోయింది. లాహోర్ నగరంలో సంఝౌతా ఎక్స్ప్రెస్లో ఒంటరిగా కనిపించిన గీతను అక్కడి ఈదీ ఫౌండేషన్ వారు చేరదీశారు. అనంతరం 2015లో గీత భారత్కు తిరిగివచ్చింది. అప్పటి విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్.. దివ్యాంగురాలైన గీతను స్వదేశానికి రప్పించడంలో కీలకపాత్ర పోషించారు. భారత పుత్రికగా గీతను పేర్కొన్నారు సుష్మ. ఈ దివ్యాంగురాలి.. తల్లి దండ్రులెవరో తెలియకపోయినా గీతను ప్రభుత్వం సంరక్షిస్తుందని భరోసానిచ్చారు.