టీమిండియా మాజీ క్రికెటర్, తూర్పు దిల్లీ భాజపా ఎంపీ గౌతమ్ గంభీర్ కనిపించడం లేదంటూ దిల్లీలో కొన్ని చోట్ల పోస్టర్లు వెలిశాయి. దిల్లీలో కాలుష్యంపై జరిగిన పార్లమెంటరీ స్థాయి సమావేశానికి ఆయన గైర్హాజరు కావడం వల్ల గుర్తు తెలియని వ్యక్తులు ఈ రకంగా పోస్టర్లు అంటించి నిరసన తెలిపారు.
మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ కనిపించడం లేదు!
భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యుడు, మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ కనిపించడం లేదంటూ దిల్లీలో పోస్టర్లు ప్రత్యక్షమయ్యాయి. స్థానికంగా రద్దీగా ఉండే ప్రాంతాల్లో గుర్తు తెలియని వ్యక్తులు ఈ పోస్టర్లు అతికించారు.
‘ఈ వ్యక్తిని ఎక్కడైనా చూశారా? ఈయన చివరిసారిగా ఇండోర్‌లో జిలేబీలు తింటూ కనిపించారు. దిల్లీ మొత్తం ఈయన ఆచూకీ కోసం వెతుకుతోంది’ అని రాసి ఉన్న బ్యానర్లు, పోస్టర్లను రద్దీగా ఉన్న ప్రాంతాల్లో ఉంచారు. ఈ నెల 15వ తేదీన భారత్-బంగ్లా మ్యాచ్ సందర్భంగా ఇండోర్‌కు వెళ్లారు గంభీర్. అక్కడ కామెంటేటర్‌గా వ్యవహరించారు. ఆ సమయంలో దిల్లీలో కాలుష్య నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు పట్టణాభివృద్ధికి సంబంధించిన పార్లమెంటరీ స్థాయి సంఘం భేటీ అయింది. ఈ సమావేశానికి గైర్హాజరు కావడం వల్ల ఆయన విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఈ పోస్టర్లను కొందరు ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు తయారుచేయించినట్లు తెలుస్తోంది.