కిలో చెత్త ఇస్తే చాలు కడుపునిండా భోజనం పెట్టాలని సంకల్పించింది.. ఛత్తీస్‌గఢ్ సర్గుజాలోని అంబికాపుర్ పురపాలక సంస్థ. దేశంలోనే మొదటిసారిగా ప్లాస్టిక్ వ్యర్థాలనే బిల్లుగా తీసుకుని భోజనం పెట్టేందుకు 'గార్బేజ్ కేఫ్' ను ఏర్పాటు చేయనుంది.
ఈ వినూత్న పథకం ఎంతో మంది నిరుపేదలకు ఉపయోగకరంగా ఉండబోతోంది. చెత్త సేకరించి జీవనం సాగించేవారు, వీధి బాలలు ఎందరో ఈ కేఫ్‌కు కాస్త చెత్త ఇచ్చి పొట్ట నింపుకోవచ్చు. నగర పర్యావరణాన్ని రక్షిస్తూ పేదల ఆకలి తీర్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామంటున్నారు.
"పురపాలక సంస్థ బడ్జెట్లో గార్బేజ్ కేఫ్ కోసం ప్రత్యేక నిధులు కేటాయించాం. పేదవారికి ఉచిత భోజనం అందించేందుకు ప్రయత్నిస్తున్నాం. దీన్ని మేము స్వచ్ఛతతో జోడించాం. ఎవరైనా రోడ్లపై ఉన్న కిలో ప్లాస్టిక్‌ను తీసుకువస్తే వారికి ఉచితంగా అన్నం పెడతాం. అర కిలో ప్లాస్టిక్ తెస్తే ఉచిత అల్పాహారం పెడతాం. ఈ విధంగా మేము స్వచ్ఛతను పెంపొందిస్తూ, పేదలకు సాయం చేస్తున్నాం."