తెలంగాణ

telangana

ETV Bharat / bharat

గ్యాంగ్​స్టర్ దుబే హతం- అచ్చం సినిమాలానే! - ప్రియాంక గాంధీ

ఉత్తర్‌ప్రదేశ్‌లో 8 మంది పోలీసులను పొట్టనపెట్టుకున్న కరుడుగట్టిన నేరస్థుడు వికాస్​ దుబే హతమయ్యాడు. శుక్రవారం ఉదయం యూపీ స్పెషల్​ టాస్క్​ఫోర్స్​ పోలీసులతో వికాస్​ ఘర్షణ పడగా.. అది ఎన్​కౌంటర్​కు దారితీసింది. పోలీసుల కాల్పుల్లో గాయపడిన నిందితుడిని ఆస్పత్రికి తరలించేలోపే ప్రాణాలు కోల్పోయాడు. ఈ కేసులో ఇప్పటివరకు ప్రధాన నిందితుడు దుబే సహా ఆరుగురు మరణించారు. ఈ ఎన్​కౌంటర్​ వ్యవహారంపై రాజకీయ విమర్శలు చెలరేగుతున్నాయి.

Gangster Vikas Dubey shot dead in Kanpur encounter
ఎన్​కౌంటర్​లో గ్యాంగ్​స్టర్​ వికాస్​ దుబే హతం

By

Published : Jul 10, 2020, 12:40 PM IST

ఉత్తర్​ప్రదేశ్‌లో తనను పట్టుకునేందుకు వచ్చిన పోలీసులపై కాల్పులకు తెగబడి.. ఎనిమిది మందిని బలిగొన్న గ్యాంగ్‌స్టర్ వికాస్‌ దుబే కథ ముగిసింది. యూపీలోని కాన్పుర్‌కు సమీపంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ప్రధాన నిందితుడు హతమయ్యాడు.

మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిన్​లో గురువారం అరెస్టయిన దుబేను.. పోలీసులు కాన్పూర్‌ తరలిస్తుండగా వాహనం బోల్తా పడింది. ఇదే అదునుగా భద్రతా సిబ్బంది నుంచి తుపాకీ లాక్కొని కాల్పులు జరపగా.. ఆత్మరక్షణ కోసం తాము జరిపిన ఎదురుకాల్పుల్లో దుబే చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. దుబే జరిపిన కాల్పుల్లో నలుగురు భద్రతా సిబ్బంది కూడా గాయపడినట్లు వెల్లడించారు.

వికాస్​ మృతదేహం
బోల్తాపడిన కారు

కరుడుగట్టిన నేరగాడు...

తన గ్యాంగ్​తో ఉత్తర్​ప్రదేశ్​లో ఎన్నో దురాగతాలకు పాల్పడ్డాడు వికాస్​. బెదిరింపులు, దౌర్జన్యాలు, అపహరణలు, దోపిడీలు, హత్యలతో ఎన్నో కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. 20 ఏళ్ల కిందటి భాజపా నేత హత్య కేసులోనూ ఆరోపణలు ఎదుర్కొన్నాడు. ఇతడిపై 60కిపైగా క్రిమినల్​ కేసులున్నాయి.

ఈ నెల 3న అర్ధరాత్రి.. చౌబేపుర్​ పోలీస్​స్టేషన్​ పరిధిలోని బిక్రూ గ్రామంలో తనను పట్టుకునేందుకు వచ్చిన పోలీసు బృందంపై విచక్షణారహితంగా కాల్పులు జరిపింది వికాస్​ ముఠా. ఈ ఘటనలో అక్కడికక్కడే 8 మంది పోలీసులు చనిపోయారు. మరికొందరు గాయపడ్డారు. గంటల వ్యవధిలోనే ఇద్దరు దుబే అనుచరులనూ పోలీసులు ఎన్​కౌంటర్​లో హతమార్చారు.

ఇదీ చూడండి:రౌడీషీటర్ల దాడిలో 8 మంది పోలీసులు మృతి

అలా దొరికాడు...

వికాస్​ కోసం ప్రత్యేక బృందాలను నియమించి గాలింపు చేపట్టింది యూపీ ప్రభుత్వం. ఈ క్రమంలో అతని ప్రధాన అనుచరుడు అమర్​ దుబేను బుధవారం మట్టుబెట్టారు పోలీసులు. మధ్యప్రదేశ్​ ఉజ్జయిన్​లో దుబే అరెస్టయ్యే కొద్దిసమయం ముందు మరో ఇద్దరు అనుచరులను ఎన్​కౌంటర్​ చేశారు. ఇప్పటివరకు ఈ కేసులో దుబే సహా ఆరుగురు హతమయ్యారు. దుబే తలపై రూ. 5 లక్షల రివార్డు ఉంది.

అరెస్టుకు ముందుకు వికాస్‌ దుబే పోలీసులకు చిక్కకుండా ముప్పుతిప్పలు పెట్టాడు. బిక్రూలో పోలీసుల్ని బలితీసుకున్న ఘటన తర్వాత కాన్పుర్‌ నుంచి రాజస్థాన్‌లోని కోటా మీదుగా 1500 కిలోమీటర్లు ప్రయాణించి, హరియాణాలోని ఫరీదాబాద్‌ చేరుకున్నాడు. అక్కడ పోలీసులకు చిక్కినట్టే చిక్కి తప్పించుకున్నాడు. ఆ తర్వాత మధ్యప్రదేశ్​లోని ఉజ్జయిన్‌ వచ్చాడు. ఇద్దరు అనుచరులతో కలిసి అతడు మధ్యప్రదేశ్‌ చేరుకున్నాడు. ఎట్టకేలకు ఉజ్జయిన్‌ నగరంలోని మహాకాలేశ్వరుడి ఆలయం వద్ద గురువారం దొరికాడు. దుబే అనుచరులిద్దరు కూడా పట్టుబడ్డారు.

ఇదీ చూడండి:రెండు రాష్ట్రాలు దాటి ఉజ్జయిన్​కు దూబే.. ఎలా?

రాజకీయ విమర్శలు...

వికాస్​ అరెస్టు తర్వాత యోగి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన విపక్షాలు ఎన్​కౌంటర్​ అనంతరం.. మరింత దూకుడు పెంచాయి.

ఇదీ చూడండి:'గ్యాంగ్​స్టర్​ వికాస్​ కేసును సీబీఐకి అప్పగించాలి'

'క్రిమినల్​ చనిపోయాడు.. మరి అతడిని రక్షించిన వారి సంగతేంటి?' అంటూ ట్విట్టర్​లో పోస్ట్​ చేశారు కాంగ్రెస్​ నేత, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ. అంతకుముందు గురువారం వికాస్​ అరెస్టైన అనంతరం.. ఈ కేసు విచారణను సీబీఐ అప్పగించాలని, వాస్తవాలు బయటకు తీయాలని డిమాండ్​ చేశారు. వికాస్​ కేసులో యోగి ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.

ప్రియాంక గాంధీ ట్వీట్​

ఎన్​కౌంటర్​కు ముందు వాస్తవానికి కారు బోల్తాపడలేదని అన్నారు సమాజ్​వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్​ యాదవ్​. నిజాలు బయటకు వస్తే ప్రభుత్వం కూలిపోతుందన్న భయంతో చేసిన ప్రయత్నం అని యూపీ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు.

అఖిలేశ్​ ట్వీట్​

ABOUT THE AUTHOR

...view details