అక్టోబర్ 2... ఈ ఏడాది ఎంతో ప్రత్యేకం. అందుకు కారణం... మహాత్మా గాంధీ 150వ జయంత్యుత్సవం కావడం. ఏడాది ముందు నుంచే ఉత్సవాలు ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం. అయినా ఎక్కడో ఏదో నిరాశ. 72 ఏళ్లుగా గాంధీజీ ఆదర్శాలను విస్మరిస్తూ వస్తున్నామన్న బాధ. ఇలానే కొనసాగితే... భారత దేశ భవిష్యత్ ఏంటన్న ఆందోళన.
ప్రపంచీకరణ యుగం ఇది. దుబారా ఖర్చులు, విలాసవంతమైన జీవితం సర్వసాధారణమైపోయిన కాలం. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా గాంధేయవాదం గురించి మాట్లాడితే వింతగా చూస్తారు. అనాగరిక, మధ్య యుగం నాటి మనస్తత్వం ఉన్న వ్యక్తిగా ముద్ర వేస్తారు.
కానీ... దేశ జనాభాలో సగానికిపైగా ఉన్న యువత ఆలోచన మాత్రం అలా లేదు. మహాత్ముడి సిద్ధాంతాల గురించి వారు తెలుసుకోవాలని అనుకుంటున్నారు. గాంధీ ఆదర్శాలు, విలువలు ప్రస్తుత కాలానికి ఏ విధంగా సరిపోతాయో అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు.
సృజన, కఠోర పరిశ్రమతో లక్ష్యాలు త్వరగా సాధించాలని ప్రస్తుత యువత పరితపిస్తూ ఉండొచ్చు. కానీ... మన సంస్కృతి మూలాలను, వ్యవస్థ మౌలిక విలువల పట్ల అవగాహన పెంచుకునే సామర్థ్యం వారికి ఉంది. అప్పుడే ఏమైనా దిద్దుబాటు చర్యలు అవసరమైతే సత్వరమే చేపట్టవచ్చని వారికి తెలుసు. ఐన్‌స్టీన్ వంటి శాస్త్రవేత్తలు, రస్సెల్ వంటి తత్వవేత్తలు, బెర్నార్డ్ షా వంటి సాహితీ దిగ్గజాలు, నోబెల్ పురస్కార గ్రహీతలు... బాపూజీని ఓ మార్గదర్శిగా చూశారని తెలుసుకునేందుకు ప్రస్తుత యువ తరం ఎంతో గర్వపడుతుంది.
మహాత్ముడు పేదల కోసమే బతికారు. తన జీవితాన్ని మానవాళి సంక్షేమం కోసమే అంకితమిచ్చారు. రాజ్‌మోహన్ గాంధీ రాసిన "మోహన్‌దాస్" పుస్తకంలో అరబ్ కవి మిఖైల్ నొయేమా రాసిన ఓ కవిత ఉంటుంది. అది బాపూ ప్రస్థానానికి అద్దం పడుతుంది.