స్వరాజ్య సంగ్రామంలో 'గుజరాత్ విద్యాపీఠ్' చేసిన కృషిని గాంధీ ప్రశంసించారు. శాసన ఉల్లంఘన ఉద్యమంలో 16 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న 40 మంది విద్యార్థులు తమ ఉపాధ్యాయులతో కలిసి చురుకుగా పాల్గొనడాన్ని గాంధీ మెచ్చుకున్నారు. గుజరాత్ విద్యాపీఠం నినాదం 'సా విద్యా యా విముక్త్యే'... అంటే నిజమైన విద్యకు అర్థం స్వేచ్ఛ వైపుకు అడుగులు వేయడమే. ఆధ్యాత్మికత, భౌతికవాద జీవనం నుంచి విముక్తి పొందడమే.
విద్యార్థులే కీలకం...
ఉప్పు తన స్వభావాన్ని కోల్పోతే.. వంటను రుచిగా ఎలా మార్చగలదు. అలాగే విద్యార్థుల్లో చిత్తశుద్ధి, కృషి, సంకల్ప శక్తి లోపిస్తే దేశాభివృద్ధి ఎలా సాధ్యం? ఏ దేశానికైనా బలమైన పునాదులు అవసరం. విద్యార్థులే దేశానికి మూల స్తంభాలు. దేశాభివృద్ధిలో వారి పాత్ర చాలా కీలకమైనదని మాహాత్ముడు బలంగా విశ్వసించారు. పౌరుల వ్యక్తిత్వం దృఢంగా ఉంటే దేశం వేగంగా అభివృద్ధి చెందుతుంది. అదే సమష్టి సమ్మేళనానికి ఉదాహరణగా నిలిచి ప్రపంచాన్ని నడిపిస్తుంది.
గురుశిష్యుల బంధం...
విద్యార్థుల జీవితాల్లో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషిస్తేనే వారి వ్యక్తిత్వాన్ని బలోపేతం చేయడం సాధ్యమవుతుంది. విద్యార్థులకు జ్ఞానాన్ని ఇవ్వడమే కాక, వారికి మార్గదర్శకులుగా, ఆదర్శప్రాయులుగా గురువులు నిలుస్తారని మహాత్ముడు వివరించారు.
గురుశిష్యుల మధ్య బలమైన బంధం అవసరం. జ్ఞానసముపార్జన ఇరువైపుల నుంచి జరగాల్సిన ప్రక్రియ.. అని మహాత్ముడు నమ్మేవారు. విద్యార్థులకు బోధించే ప్రక్రియలో గురువే ఎక్కువనేర్చుకుంటాడు. పిల్లల శారీరక, మానసిక, నైతిక అభివృద్ధికి విద్య దారి చూపాలని బాపూ ఆశించారు. గాంధీ దూరదృష్టి గలవారు. విద్యార్థుల సమగ్ర అభివృద్ధి కోసమే గాంధీ ‘'అందరికీ ప్రాథమిక విద్య అవసరం'’ అనే విధానాన్ని తెలిపారు. 7-14 సంవత్సరాల వయస్సు గల విద్యార్థులందరికీ వారి మాతృభాషలో ఉచిత విద్యను అందించాలన్నారు.
విద్య అంటే...
చిన్న, స్వయం ఆధారిత వర్గాలతో కూడిన దేశాన్ని గాంధీ ఊహించారు. అలాంటి ఆదర్శ సమాజాన్ని నిర్మించాలంటే జ్ఞానబోధన, ఐక్యకార్యాచరణ ద్వారానే సాధ్యం అని తెలిపారు. పాఠశాల స్థాయి విద్యార్థులకు పాఠ్యాంశాలలో విజ్ఞానంతో పాటు కుండల తయారీ, చేనేత, వండ్రంగి పనులు, బుట్టల తయారీ వంటి హస్తకళలను తప్పనిసరిగా నేర్పించాలని గాంధీ సూచించారు.
విద్య అంటే అక్షరాస్యత సాధించడమే కాదు. జ్ఞానంతో పాటు హస్తకళలను నేర్చుకోవడం. ఇతర విషయాలను తెలుసుకోవడం. ప్రతి పాఠశాలా స్వయం సహాయకంగా ఉండాలి. రాష్ట్రంలో ఆర్థికంగా, సామాజికంగా స్వతంత్ర శక్తిగా ఎదగాలి. ఈ విధానంతో విద్యార్థులు స్వావలంబన పొందడమే కాదు మోటారు నైపుణ్యాలు, ఏకాగ్రతను పెంచుకోగలుగుతారు. పని పట్ల ఆసక్తి పెరిగి అతను జీవితంలో సంపాందించగలుగుతాడు.
ఆధారపడుతున్నారు...
ప్రస్తుత రోజుల్లో పిల్లల్లో నైపుణ్యాల్ని పెంపొందించేందుకు 3 ఏళ్ల వయసు నుంచే... పాఠశాలల్లో విభిన్న ఆటలు ప్రవేశపెడుతున్నారు. వీటిల్లో వారు ఎంతో కొంత విజయవంతమవుతారు.. కానీ, వారు జీవితంలోని వాస్తవికత నుంచి దూరం అవుతున్నారు. వారు రోజువారీ పనులను చేసుకోవడాన్ని ఒక అలవాటుగా మార్చుకోవడంలో విఫలమవ్వడమే కాక... ఎక్కువగా కౌమారదశ నుంచే ప్రతి చిన్నపనికీ వారి తల్లిదండ్రులపైనే ఆధారపడుతున్నారు.
విద్యావంతులైనప్పటికీ... వారికి చిన్న తరహా పరిశ్రమలపైనా కనీస అవగాహన ఉండట్లేదు. వారిని వారు మెరుగుపర్చుకునే దశలో.. ఉన్నత, సాధారణ ప్రజల నుంచి దేశంతో సంబంధాలు కోల్పోతున్నారు.
వారు చైతన్యవంతులు కాలేరు. ఇతరుల సాయం కోసం ఎదురుచూస్తారు. సోమరితనం పెరుగుతుంది. అహంకారిగా మారతారు.
గాంధీ విద్యావిధానం...
గాంధీ సూచించిన విద్యావిధానం నేటికీ పదిలంగానే ఉంది. విద్యలో ఆయన తన మొట్టమొదటి ప్రయోగాన్ని దక్షిణాఫ్రికాలోని లియో టాల్‌స్టాయ్ ఆశ్రమంలో చేశారు. 'హరిజన్' పత్రికలో రాసిన ఓ వ్యాసంలో ఆయన విద్యాబోధనను గురించి వివరించారు. అనతి కాలంలోనే బహుళ ప్రాచుర్యం పొందిన ఈ వ్యాసంలో హస్తకళల యాంత్రిక వినియోగంపైనే కాకుండా వాటి వెనక ఉన్న శాస్త్రీయతకు విశేష ప్రాధాన్యం ఇచ్చారు.
ప్రతి ప్రక్రియ ఎందుకు, ఎక్కడ నుంచి జరుగుతుందని విద్యార్థి తెలుసుకోవాలని నొక్కి చెబుతారు బాపూజీ.
"ప్రజలకు విద్య అంటే సరైన అవగాహన లేకపోవడమే అసలు సమస్య. భూమిని, స్టాక్ మార్కెట్లో వాటాలను ఎలా కొలుస్తామో అలానే విద్యను లెక్కిస్తుంటాం. అధిక ధనార్జనకు ఉపయోగపడే విద్యనే విద్యార్థికి అందించాలని కోరుకుంటాం. విద్యావంతుల వ్యక్తిత్వాన్ని మెరుగుపరచడంపై ఏమాత్రం ఆలోచన చేయం. బాలికలు డబ్బు సంపాదించకూడదు అంటాం. తద్వారా వారికి చదువు ఎందుకు అని ప్రశ్నిస్తాం. ఇలాంటి భావనలు మనలో ఉన్నంతకాలం విద్య నిజమైన విలువ మనకు తెలియదు." - మోహన్‌దాస్ కరంచంద్ గాంధీ
(రచయిత... డా. వర్షా గుప్తా, ఆచార్యులు, దిల్లీ విశ్వవిద్యాలయం)