తెలంగాణ

telangana

ETV Bharat / bharat

గాంధీ 150: బాపూ జీవితం భావితరాలకు స్ఫూర్తిదాయకం - స్ఫూర్తిదాయకం

ఒక రాజకీయ నాయకుడు వచ్చే ఎన్నికల గురించి మాత్రమే ఆలోచిస్తాడు. ఓ రాజనీతిజ్ఞుడు భవిష్యత్తు తరాల గురించి ఆలోచిస్తాడు. సాధువుగా ఉండటానికి ప్రయత్నిస్తున్న ఓ రాజకీయ నాయకుడినని తన గురించి తాను మహాత్ముడు చెప్పుకునేవారు. ఆయన మాటలు, చేతలు, ఆలోచనలు.. ఎప్పుడూ మనిషి, సమాజం చుట్టూనే ఉండేవి. మనసా వాచ కర్మేణా.. ఎప్పుడూ తాను నమ్మిన దానికోసం తపించే ఓ అసాధారణ వ్యక్తి గాంధీజీ.

గాంధీ 150: బాపూ జీవితం భావితరాలకు స్ఫూర్తిదాయకం

By

Published : Oct 2, 2019, 7:01 AM IST

Updated : Oct 2, 2019, 8:22 PM IST

స్వచ్ఛమైన జీవన విధానం, సమగ్రమైన అవగాహన గాంధీని శక్తిమంతుడిని చేసింది. ఆ ఆకర్షణ తరాల పాటు ప్రభావం చూపుతూనే ఉంది. మనిషిలో చైతన్యాన్ని మేలుకొలిపిన గౌతమబుద్ధుడు, మహావీర్‌ జైన్‌, ఏసు క్రీస్తులాంటి గొప్ప వ్యక్తి మన బాపూజీ. నైతికత, సత్యం, అంతరాత్మ ద్వారా మనిషి ప్రవర్తన రూపొందడంలో వీరందరూ సహాయపడ్డారు.

సనాతన సంప్రదాయ కుటుంబంలో జన్మించిన గాంధీజీ.. కాలంతో పాటు మారారు. అన్ని విశ్వాసాలను మించిన మానవతావాదాన్ని ప్రదర్శించారు. సార్వత్రిక సోదరభావాన్ని బోధించారు. మహాత్ముడు ఎప్పుడూ హింసను ద్వేషించలేదు. కానీ.. అన్యాయాన్ని ఎదిరించారు. హింసకు తావులేని భిన్నమైన ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించి సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేశారు.

మహాత్ముడి ఆలోచనలు, జీవితం, అసాధారణ శక్తి.. ముందు తరాలకు స్ఫూర్తినిస్తాయి. మార్గనిర్దేశనం చేస్తాయి.

మానవజాతిని కొన్ని వందల సార్లు నాశనం చేసే శక్తి ఉన్న అణ్వాయుధ యుగంలో మనం జీవిస్తున్నాం. రెండో ప్రపంచయుద్ధం తర్వాత శాంతి కోసం జరిగిన ఉద్యమాలపై గాంధీజీ అహింసా సిద్ధాంతం శక్తిమంతమైన ప్రభావం చూపింది. రెండో ప్రపంచ యుద్ధం మిగిల్చిన చేదు అనుభవాల వల్ల.. ప్రస్తుత ప్రపంచం అణ్వాయుధాల వాడకం గురించి ఆలోచించడం లేదు. ఒక దేశం భూభాగాన్ని మరో దేశం ఆక్రమించుకోవడం అనే ఊహ సైతం కనిపించడం లేదు. అనేక సవాళ్లు ఉన్నప్పటికీ.. మానవజాతి చరిత్రలో అత్యంత ప్రశాంతమైన కాలాన్ని నేటి ప్రపంచం చూస్తోంది.

గాంధీ విధానాలతోనే థంబెర్గ్​ నిరసనలు...

వాతావరణంలో పెరుగుతున్న కర్బన ఉద్గారాలు, భూతాపానికి వ్యతిరేకంగా స్వీడన్‌కు చెందిన 15 ఏళ్ల విద్యార్థి గ్రెటా థంబెర్గ్​​.. శాంతియుత నిరసన చేపట్టింది. తన ఉద్యమంతో ప్రపంచాన్ని ఆలోచనలో పడేసింది. పర్యావరణంపై థంబెర్గ్‌ చేసిన నిరసన... మనజాతులు, ప్రకృతి మధ్య సామరస్యం కోసం ఆమె తపన రెండూ గాంధీ విధానాల్లో భాగమే.

భూమాత ప్రతి ఒక్కరి అవసరాలను తీరుస్తుందని, కానీ.. దురాశకు వెళ్లి సౌకర్యాలు కావాలంటే మాత్రం నవగ్రహాలు సైతం సరిపోవని హెచ్చరించిన మొట్టమొదటి పర్యావరణవేత్త మహాత్ముడే. గాంధీజీ విధానాలను ఇప్పుడిప్పుడే అవలంబించేందుకు ప్రపంచం సిద్ధమవుతోంది. ఆయన సిద్ధాంతాలకు గతంలో కంటే ఇప్పుడే విలువ పెరుగుతోంది.

అహింసా విధానాలే ప్రేరణగా...

అన్యాయాలపై పోరాటానికి గాంధీజీ ప్రపంచానికి శక్తిమంతమైన ఆయుధాలను ఇచ్చారు. మహాత్ముడి అహింసా విధానాలు, సత్యాగ్రాహ పోరాటాలు అనేక ఉద్యమాలను ప్రభావితం చేశాయి. గాంధీజీ స్ఫూర్తితో కొందరు జరిపిన ఉద్యమాలు మానవజాతి చరిత్ర గతినే మార్చేశాయి.

ఇదీ చూడండి:గాంధీ 150: అహింసతో ప్రపంచంపై చెరగని ముద్ర

వర్ణవివక్షకు వ్యతిరేకంగా దక్షిణాఫ్రికాలో నెల్సన్‌ మండేలా, అమెరికాలో మార్టిన్ లూథర్‌ కింగ్‌ జూనియర్ జరిపిన ఉద్యమాలకు మహాత్ముడి అహింసా, సత్యాగ్రహమే తారకమంత్రాలు. ఈ విషయాన్ని మండేలా, లూథర్‌కింగ్‌ అనేక సందర్భాల్లో భిన్నవేదికలపై చెప్పారు.

తొలి నుంచి సాయుధ పోరాటం చేసిన నెల్సన్‌ మండేలా.. గాంధీజీ స్ఫూర్తితో రక్తపాత రహిత ఉద్యమాన్ని నడిపించారు. జాత్యహంకారానికి ముగింపు పలికారు. ఆర్చ్‌ బిషప్‌ డెస్మెండ్‌ టుటు నేతృత్వంలో మండేలా నియమించిన 'ద ట్రూత్‌ అండ్‌ రీకన్సీలియేషన్‌ కమిషన్‌'.. దశాబ్దాల వర్ణ వివక్ష తాలూకు గాయాలను రూపుమాపింది. నలుపు, తెలుపు జాతుల ఏకీకరణకు అనుమతినిచ్చింది. ఇదంతా.. గాంధేయ విధానాల విజయం.

పరస్పర ప్రయోజనాల కోసం పోరాడుతున్న రెండు వర్గాల మధ్య శాంతియుత సయోధ్యనే.. గాంధేయ విధానం.

సామరస్య ప్రయత్నాల ద్వారా విభేదాల పరిష్కారమే.. అహింసావాదం.

ఎన్నో శాంతియుత ఉద్యమాలపై గాంధీ ప్రభావం...

అమెరికాలో పౌర హక్కుల ఉద్యమం, బర్మా, ఫిలిప్పీన్స్‌ సహా అనేక దేశాల్లో ప్రజాస్వామ్యం కోసం జరిగిన శాంతియుత ఉద్యమాలు... బెర్లిన్‌ గోడ పతనం - జర్మనీ ఏకీకరణ, సోవియట్‌ యూనియన్‌ పతనం, తూర్పు ఐరోపాలో నిరంకుశ నియంతృత్వంపై జరిపిన పోరాటాలు.. మహాత్ముడి అహింసా, సత్యాగ్రహం ప్రభావంతో జరిగినవే.

గాంధీజీ ఎల్లప్పుడూ ఆత్మగౌరవం, సమానత్వం, పరస్పర గౌరవం కోసం పోరాడారు. వివిధ సమూహాల మధ్య శాంతి, సామరస్యం కోసం ఉద్యమించారు. మహాత్మాగాంధీ పాటించిన విలువలకు భారత్​... ఓ దేశంగా ప్రత్యేకమైన గుర్తింపు కలిగింది. అయితే.. ఓ దేశంగా పురోగమిస్తూనే.. మహాత్ముడి ఆదర్శాలను పాటించే దిశలో మనం ఇంకా చాలా దూరం ప్రయాణం చేయాల్సి ఉంది. అనేక భాషలు, మతాలు, సంస్కృతుల సమ్మేళనమైన లోపభూయిష్టమైన ప్రజాస్వామ్యం మనది. ఇలాంటి స్థితిలో శాంతి, సామరస్యంతో ఒక దేశంగా సహజీవనం చేయడం అద్భుతమే. స్వాతంత్ర్యం తర్వాత ఒక దశాబ్దపు అనుభవాలను చూసిన చాలా మంది పండితులు, చరిత్ర పరిశీలకులు.. భారత్‌ ఒక దేశంగా ఎక్కువ కాలం ఉండలేదని భావించారు. అసాధారణ వైవిధ్యం వల్ల... త్వరలోనే ముక్కలు, ముక్కలుగా విడిపోతుందన్నారు.

మన దేశంలో ఓట్ల ద్వారా అధికారం శాంతియుతంగా బదిలీ అవుతందని ఎవరూ నమ్మలేదు. ప్రజాస్వామ్య పద్ధతిలో స్వేచ్ఛా సమాజంగా జీవించగలమని ఊహించలేదు. ఇలాంటి అనేక భయాలను భారత్‌ విజయవంతంగా అధిగమించింది. భారతీయులందరినీ ఓ గూటికి చేర్చేందుకు గాంధీజీ గొప్ప ప్రయత్నం చేశారు. సహనం, సహజీవనం, సయోధ్య అనే మహాత్ముడి సందేశం.. మన సమాజంలో అంతర్భాగమైపోయింది.

మన జీవనం.. యావత్​ ప్రపంచానికే ఆదర్శం...

అసాధారణ భాషా వైవిధ్యం ఉన్నప్పటికీ... ఒక దేశంగా మనం జీవిస్తున్న తీరు... ప్రపంచానికి గొప్ప ఉదాహరణ. భాషా వైవిధ్యం వల్ల.. పాకిస్థాన్‌ నుంచి బంగ్లాదేశ్‌ విడిపోయింది. నాటి పాకిస్థాన్‌ నుంచి నేటి బెల్జియం వరకు, శ్రీలంక సహా అనేక దేశాల్లో.. భిన్న భాషలు మాట్లాడుతున్న ప్రజల మధ్య పోరాటాలు జరిగాయి. జరుగుతూనే ఉన్నాయి. బహు భాషా, బహు జాతి, బహు మతాలు, బహు సంస్కృతులు కలిగినప్పటికీ.. విశిష్టమైన విజయవంతమైన దేశంగా భారత్‌ నిలిచింది.

ప్రజాస్వామ్యం, సమాఖ్యవాదం, మానవ హక్కుల పరిరక్షణ, లౌకికవాదం, న్యాయమైన పరిపాలన అందుకు దోహదపడ్డాయి. మహాత్ముడి సందేశం, ఆలోచనలు, కృషి.. భారతీయ సమాజాన్ని శాశ్వతంగా ప్రేరేపించాయి. అందుకే ఈ అద్భుతం జరిగింది.

ఆధునికయుగంలో మొట్టమొదటి మహిళా హక్కుల కార్యకర్త... మహాత్ముడే. మహిళల గాంధీజీ ఆలోచన, నాయకత్వానికి స్త్రీ విముక్తి ఉద్యమం, స్త్రీవాదం ఎంతో రుణపడి ఉన్నాయి. ప్రపంచంలో ఎక్కడైనా సరే... అణచివేత, అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడుతున్న వారందరికీ.. ఉత్తేజం కలిగించే శక్తిగా గాంధీజీ నిలిచారు.

'విభజించు.. పాలించు'ను తప్పుబట్టిన గాంధీ...

రాజకీయం, పాలనారంగంలో గాంధీజీ ఆలోచనలు, ఆదర్శాలకు శాశ్వతమైన విలువ ఉంది. రాజకీయాలు నైతిక ప్రవర్తనలో భాగమే అని మహాత్ముడి విశ్వాసం. ఎప్పుడూ ప్రజల అంగీకారంతోనే అధికారం చేపట్టాలి. మంచిని ప్రోత్సహించడం, స్వేచ్ఛను కాపాడటం, పరస్పర విరుద్ధ ఆసక్తులను పునరుద్ధరించే ఆదర్శాలతో పాలన సాగాలని గాంధీజీ చెప్పేవారు. పౌరుడి సార్వభౌమత్వం కేంద్రంగా పనిచేయాలి. పరిపాలకులు పరిమితమైన పాత్ర, విధులు కలిగి ఉండాలి. అధికారం కేంద్రీకృతంగా, వ్యక్తి కేంద్రంగా ఉండకూడదు.

అధికారం స్థాయి పౌరుడు, కుటుంబం, సమాజంతో మిళితమై ఉండాలి. 'మా, మనం'; 'వాళ్లు, వీళ్లు' అంటూ విభజించు, పాలించు అనే సూత్రాన్ని గాంధీజీ తప్పుపట్టారు. 'ఇతరులు' అంటూ వేరు చేయడాన్ని మహాత్ముడు నిరసించారు. భిన్న సమాజంలో పడికట్టు సత్యాలు పాక్షికమైనవి. నిరంతర చర్చలు, పరస్పర గౌరవం, సరైన గుర్తింపు సామరస్యపూర్వక సమాజానికి అవసరమని గాంధీజీ విశ్వాసం.

పౌరులు కేంద్రంగా, వికేంద్రీకరణ ప్రభుత్వం.., సామరస్యపూర్వక సమాజాన్ని నిర్మించేందుకు నిరంతర స్థిరమైన చర్చలు జరపడం, సయోధ్య వంటి మూడు సూత్రాలు అన్ని ఆధునిక ప్రజాస్వామ్య దేశాల్లో ముఖ్యాంశాలుగా ఉన్నాయి. ఐక్య, ప్రజాస్వామ్య, శాంతియుత దేశంగా... భారతదేశపు వర్తమానం, భవిష్యత్‌, అభివృద్ధి.. ఈ అంశాలపైనే ఆధారపడి ఉంది.

సంరక్షకులుగా ధనవంతులే...

చివరకు... ప్రజల సంరక్షకులుగా వారికి మంచి చేసే ధర్మకర్తలుగా ధనవంతులు ఉండాలనే మహాత్ముడి విధానానికి ప్రపంచవ్యాప్తంగా క్రమంగా ఆమోదం లభిస్తోంది. బిల్‌గేట్స్‌, వారెన్‌ బఫెట్‌, అజీమ్‌ ప్రేమ్‌జీ ఇందుకు ఉదాహరణ.

మానవ సమాజం అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. చరిత్ర కవాతులో కొంతమంది గొప్ప వ్యక్తులు, తెలివైన రుషులు, లోతైన ఆలోచనాపరులు.. సమాజంపై తీవ్రమైన, శాశ్వతమైన ప్రభావం చూపారు. ప్రపంచ గమ్యాన్ని నిర్దేశించారు. గాంధీజీ అందించిన సందేశం, జీవితం, విలువలు మానవాళికి చాలా ముఖ్యమైన పాఠాలు నేర్పాయి. శాంతి, సామరస్యం, సత్యం, ఆత్మగౌరవం, సుస్థిరత అనే మహాత్ముడి సందేశాలు... మానవ సమాజంలోని భవిష్యత్‌ తరాల్లో ప్రతిధ్వనిస్తుంది.

(రచయిత... డా. జయప్రకాశ్​ నారాయణ్​, 'లోక్​సత్తా' వ్యవస్థాపకులు)

ఇదీ చూడండి:సత్యాన్వేషి, దీక్షాదక్షుడు, జగత్​ ప్రేమికుడు.. మహాత్ముడు

Last Updated : Oct 2, 2019, 8:22 PM IST

ABOUT THE AUTHOR

...view details