తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ప్రపంచానికి మార్గం.. బాపూ యాంత్రీకరణ విధానం - గాంధీ

యాంత్రీకరణ...! ప్రస్తుతం ఆర్థిక అభివృద్ధిలో ఎంతో కీలకం. కానీ... యాంత్రీకరణను మహాత్మా గాంధీ తీవ్రంగా వ్యతిరేకించేవారని తెలుసా? ఎందుకలా? గాంధేయ ఆర్థిక భావజాలం ఏం చెబుతోంది? యాంత్రీకరణపై గాంధీ ఉద్దేశాలు ఏంటి? అవి ప్రపంచానికి ఏ విధంగా మేలు చేస్తాయి?

ప్రపంచానికి మార్గం.. బాపూ యాంత్రీకరణ విధానం

By

Published : Aug 28, 2019, 7:01 AM IST

Updated : Sep 28, 2019, 1:33 PM IST

  • భారత వస్త్ర పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతోంది. రానున్న రోజుల్లో ఈ పరిశ్రమపై ఆధారపడిన 10 కోట్ల మంది జీవితాలపై ఆ ప్రభావం కనిపించనుంది.
  • భారత తేనీటి పరిశ్రమ భవిష్యత్తు గొప్పగా ఏమీ లేదు. వరుస నష్టాల వల్ల 10 లక్షల మంది కార్మికుల బతుకులు చితికిపోతున్నాయి.
  • బిస్కట్‌ల ఉత్పత్తిలో రారాజైన పార్లె ప్రొడక్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ రానున్న రోజుల్లో 10 వేల మంది ఉద్యోగులకు శ్రీముఖం ఇవ్వనుంది.

ప్రముఖ పత్రికల్లో వచ్చిన ఈ వార్తాకథానాలు ప్రస్తుత దేశ ఆర్థిక పరిస్థితిని కళ్లకు కడుతున్నాయి.

నాణేనికి మరోవైపు..

ద్రవ్యలోటు అధిగమించేందుకు ప్రభుత్వరంగ సంస్థల్లో వాటాల విక్రయం ఊపందుకుంది. గతేడాది రూ. 90 వేల కోట్లు సమీకరించాలనే లక్ష్యం విధించుకోగా.. రూ. 80 వేల కోట్లు ప్రభుత్వ ఖజానాలో జమయ్యాయి. ప్రభుత్వ రంగ వాటాల విక్రయం విషయంలో కేంద్ర సర్కార్‌ ఎంత దూకుడుగా ఉందో అర్థమవుతుంది. యూపీఏ హయాంలోనే శరవేగంగా సాగిన వాటాల విక్రయ ప్రక్రియ ఇప్పుడు తారస్థాయికి చేరింది. అధికారంలోకి ఎవరు వచ్చినప్పటికీ.. ఇలాంటి విధానాలు మాత్రం మారడం లేదు.

దేశ ఆర్థిక వ్యవస్థకు ఈ సంకేతాలు ఆరోగ్యకరమైనవా..? సంక్షోభం ఎదురుగా కనిపిస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం మాత్రం.. అలాంటిదేమీ లేదని బుకాయిస్తోంది.

ఇది కాదు గాంధేయ విధానం...

ఆర్థిక వ్యవస్థపై గాంధేయ విధానం ఇందుకు పూర్తి భిన్నం. యాంత్రీకరణను మహాత్ముడు ఎప్పుడూ వ్యతిరేకించలేదు. అయితే.. పెరిగిపోతున్న ఖర్చులను తగ్గించుకునేందుకు యంత్రాలను తెచ్చి.. ఉద్యోగులను తీసివేయడాన్ని ఆయన నిరసించారు. ఈ విధానం వల్ల వేలమంది నిరుద్యోగులయ్యారు. పోగవుతున్న సంపద కొందరి చేతుల్లోకి కాకుండా.. అందరికీ చేరి ఆనందం పంచాలని బాపూజీ ఆకాంక్షించారు. ఉద్యోగులను తొలగించి, ఎక్కువ లాభాలు పొందడమే పొదుపు చర్యల అసలు మర్మమని గాంధీజీ బలంగా నమ్మేవారు. గాంధీజీ ఆర్థిక ఆలోచనలన్నీ ప్రజల కేంద్రంగా ఉంటాయి.

యాంత్రీకరణకు అసలు అర్థం...

యాంత్రీకరణ... మానవ పురోభివృద్ధికి సహకరించాలని గాంధీజీ ఆలోచన. కుట్టుమిషన్‌ లాంటి పరికరాల రాకను ఆయన స్వాగతించారు. మనిషి నైపుణ్యాన్ని పెంచుతుందని నమ్మేవారు. వంటపాత్రలను సరిచేసే ఓ ఆవిష్కరణను గాంధీజీ ఇలాగే స్వాగతించారు. ఎందుకంటే.. ఆ పరికరాన్ని ఓ కమ్మరి తయారు చేయాల్సి ఉంటుంది. కొత్తగా వచ్చే ఇలాంటి పరికరాలు.. మనిషికి మరింత పనిని కల్పించాలనేది బాపూజీ భావన. యాంత్రీకరణపై తన విధానంలో వచ్చిన సందేహాలకు మహాత్ముడు స్పష్టమైన సమాధానమే ఇచ్చారు. మనిషి సాయం లేని యంత్రం అవసరం లేదంటారు. ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ఆవిష్కరణకు చోటు లేదంటారు.

అలాంటి యాంత్రీకరణ వల్ల ప్రయోజనం లేదని తెలిపారు బాపూ. మోటారు వాహనాలు మనిషి ప్రాథమిక అవసరాలను తీర్చలేవని గాంధీజీ నమ్మేవారు. మనిషికి కావాల్సింది అవసరాలే కానీ.. సౌకర్యాలు కావన్నారు.

మానవ శరీరమే అద్భుత పరికరం..

యంత్రం ఎప్పుడైనా మనిషికి సహాయకారిగా, అతడి అభివృద్ధికి ఉపయోగపడేదై ఉండాలని గాంధేయ విధానం చెబుతుంది. మానవ శరీరంలాంటి యంత్రాలు మాత్రమే అవసరమని మహాత్ముడు నమ్మారు. అలాంటి పరికరాల వల్ల ఎక్కువ మేలు జరుగుతుందని విశ్వసించారు. బాపూజీకి సంబంధించినంత వరకు ఆత్మ నుంచి వేరుచేయని అద్భుత పరికరం మానవ శరీరం.

యాంత్రీకరణ చెడుకు సంకేతమన్న గాంధీజీ.. అది దేశాన్ని చీకట్లోకి నెట్టిందన్నారు. యంత్రాల వల్ల కార్మికులు బానిసలైపోగా.. యజమానులు మాత్రం అనైతికంగా ధనవంతులైపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.

పేదలు ఎప్పుడూ బ్రిటిషర్లపై పోరాడేందుకు సిద్ధంగా ఉండేవారని గాంధీజీ తెలిపారు. మిల్లు యజమానులు మాత్రం బ్రిటిష్‌ సైన్యానికే మద్దతు తెలిపేవారన్నారు. స్వాతంత్ర్య సంగ్రామంలో భాగంగా.. మిల్లుల్ని మూసివేయాలని నిర్ణయం తీసుకోవడం తనకు చాలా కష్టమైందన్నారు. అయితే మిల్లుల్ని విస్తరించకూడదని మాత్రం గాంధీజీ చెప్పారు. మిల్లుల విస్తరణపై 8 దశాబ్దాల క్రితం గాంధీజీ అవలంబించిన విధానాలు ఎందుకు మేలు చేస్తాయో మనకు నిత్యం కనిపిస్తూనే ఉన్నాయి. ఇదే సందర్భాన్ని ప్రస్తుత తేనీటి పరిశ్రమకు అన్వయిస్తే.. గాంధీజీ విధానం స్పష్టంగా అర్థమవుతుంది. అధికోత్పత్తిని కట్టడి చేసేందుకు.. ఐదేళ్లపాటు విస్తరణపై నిషేధం విధించాలని భారత టీ అసోసియేషన్‌ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.

మహాత్ముడి విధానానికి మంచి ఉదాహరణ

భారత టీ పరిశ్రమలాగే ఇతర పరిశ్రమలు డిమాండ్‌ను మించి ఉత్పత్తి చేస్తే ఏమవుతుంది? ఈ ప్రశ్నకు గాంధీజీ సమాధానం చెప్పారు.
స్వాతంత్ర్య సంగ్రామ సమయంలో అధికోత్పత్తి మార్కెట్‌లోకి రాకముందే.. స్వదేశీ విధానాన్ని పాటించాలన్నారు. వినియోగించిన పరికరాలను మరోసారి ఉపయోగించుకోవాలని సూచించారు. యంత్రాలతో తయారుచేసిన అన్ని వస్తువులను ఒకేసారి మానేయడం సాధ్యం కాదన్న మహాత్ముడు.. ఎవరికి వారు తమ పరిధిలో ఏం చేయగలరో అది చేయాలన్నారు. క్రమంగా స్వదేశీ బాటపట్టాలని ఉపదేశించారు.

ఇటీవల పాశ్చాత్య దేశాల్లో ఊపందుకున్న"ఫ్లైట్‌ షేమ్‌ అండ్‌ ట్రైన్‌ బ్రాకింగ్‌" ఉద్యమం గాంధేయ విధానానికి మంచి ఉదాహరణ. పెరిగిపోతున్న కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు విమానాల్లో కాకుండా.. రైళ్లల్లో ప్రయాణించాలని స్వీడన్‌కు చెందిన గ్రెటా థన్బెర్గ్‌ అనే బాలిక ఈ ఉద్యమాన్ని చేపట్టింది. ఈ పోరాటానికి ఆమె తల్లి, ప్రముఖ గాయని మలీనా ఎర్న్‌మన్ మద్దతు పలికింది. ఎంతోమంది ప్రముఖులతో పాటు.. యూరోపియన్‌ ప్రజలు సైతం విమానాలకు బదులు రైళ్లనే తమ ప్రయాణంలో భాగం చేసుకుంటున్నారు. ఫ్లైట్‌ షేమ్‌ అండ్‌ ట్రైన్‌ బ్రాకింగ్‌ ఉద్యమం వల్ల.. స్వీడన్‌లోని విమానాల్లో ప్రయాణించే వారి సంఖ్య గణనీయంగా తగ్గింది. రైళ్లు కిటకిటలాడిపోతున్నాయి.

అపరిమితమైన యాంత్రీకరణ...

మనదేశంలోనూ ఈ తరహా ఉద్యమాలు జరుగుతూనే ఉన్నాయి. లఖ్​నవూకు చెందిన ఆరోగ్య కార్యకర్త బాబీ రమాకాంత్‌ కారులో ప్రయాణించడం మానేశారు. నడక, సైకిల్‌.. లేదంటే ప్రజా రవాణాను ఉపయోగించుకుంటున్నారు. బెంగళూరుకు చెందిన గురుమూర్తి మాతృభూతం విమానాల్లో ప్రయాణించడానికి స్వస్తి పలికారు. రైళ్లలో ప్రయాణిస్తున్నారు. యంత్రాలపై ఆధారపడటాన్ని వీలైనంత తగ్గించుకుంటున్న వ్యక్తులు మన చుట్టూ ఎంతో మంది ఉన్నారు.

అభివృద్ధికి ఆర్థిక నమూనాగా మారిన పారిశ్రామికీకరణ అంతిమ నష్టం.. వాతావరణ సంక్షోభానికి దారితీస్తోంది. ఈ ఉదాహరణలు గాంధేయ ఆర్థిక విధానానికి నిలువెత్తు నిదర్శనాలు. అపరిమితమైన యాంత్రీకరణ వల్ల కలిగే నష్టాలను చవిచూస్తున్న ప్రపంచం.. వాటి నుంచి బయటపడేందుకు అప్పుడప్పుడైనా ప్రయత్నిస్తోంది.

2006లో ప్రవేశపెట్టిన జాతీయ ఉపాధి హామీ పథకం.. గాంధీ భావజాలానికి ఇచ్చిన అద్భుత నివాళి. ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే పనుల్లో గుత్తేదారులకు ఆధిపత్యం, యంత్రాల రాజ్యమే నడుస్తుంది. ఈ రెండూ మహాత్ముడికి అసహ్యం. కానీ ప్రభుత్వం.. కార్మికుల ప్రయోజనాలకే పట్టం కట్టింది. బెల్జియం మూలాలున్న ప్రముఖ భారత ఆర్థికవేత్త జీన్‌ డ్రేజ్‌ విధానాలను పరిగణనలోకి తీసుకుని ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టారు. ప్రజలకు పెద్దఎత్తున్న ఉపాధి కల్పించాలనుకుంటే.. యంత్రాలకు ఏ మాత్రం స్థానం ఉండొద్దని ఆయన తెలిపారు. గాంధీ విధానమూ అదే.

- సందీప్​, లఖ్​నవూ.

ఇదీ చూడండి:- గాంధీ-150: ఆచరణాత్మక ఆదర్శవాది 'బాపూ'

Last Updated : Sep 28, 2019, 1:33 PM IST

ABOUT THE AUTHOR

...view details