తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'సుస్థిర అభివృద్ధికి గాంధీ సిద్ధాంతాలు అవసరం'

మహాత్మా గాంధీ 150వ జయంత్యుత్సవాల సందర్భంగా ఈటీవీ భారత్ ముఖాముఖిలో పాల్గొన్నారు గాంధేయ వాది, ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే. గ్రామీణాభివృద్ధికి బాపూజీ సూచించిన మార్గదర్శకాలను, అనుసరించాల్సిన ఆవశ్యకతను తెలియజేశారు. పట్టణీకరణ వేగంగా పెరిగి పర్యావరణంపై తీవ్ర ప్రభావం చూపుతున్న తరుణంలో గాంధీ ఆలోచనలు ఎంత విలువైనవో చెప్పారు.

'సుస్థిర అభివృద్ధికి గాంధీ సిద్ధాంతాలు అవసరం'

By

Published : Aug 30, 2019, 7:05 AM IST

Updated : Sep 28, 2019, 8:02 PM IST

గ్రామాలను అభివృద్ధి చేయకుండా పట్టణాభివృద్ధి వైపు మొగ్గుచూపడం సరికాదన్నారు గాంధేయవాది, సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే. మహాత్మా గాంధీ ఆలోచనలకు విరుద్ధంగా ముందుకు వెళ్తున్నామని అభిప్రాయపడ్డారు. బాపూజీ 150వ జయంత్యుత్సవాల సందర్భంగా ఈటీవీ భారత్​తో ముఖాముఖిలో పాల్గొన్నారు. గాంధీ సిద్ధాంతాలు, విలువలు ఎంత గొప్పవో చెప్పారు.

అన్నా హజారేతో ఈటీవీ భారత్​ ముఖాముఖి

'దేశం ప్రగతి పథంలో ముందుకు సాగాలంటే గ్రామాలను అభివృద్ధి చేయాలని గాంధీ చెప్పారు. స్వాతంత్ర్యానంతరం మనం తప్పుడు దారి ఎంచుకుని పట్టణాల అభివృద్ధిపై దృష్టి సారించాం.'

-అన్నా హజారే

గ్రామాల్లో కనీస సదుపాయాలు కరవయ్యే ప్రజలు పట్టణాలకు వలస వెళ్తున్నారన్నారు హజారే. ప్రభుత్వాలు పట్టణాలపైనే దృష్టి కేంద్రీకరించి తప్పు చేస్తున్నాయన్నారు.

ఈ రోజుల్లో సహజ వనరులను అతిగా వినియోగించడాన్ని తీవ్రంగా ఖండించారు హజారే. సుస్థిర అభివృద్ధికి గాంధీ గ్రామీణాభివృద్ధి ఆలోచనలను తక్షణమే అనుసరించాల్సిన అవసరముందని స్పష్టం చేశారు.

పట్టణీకరణ పెరగడం వల్ల పర్యావరణం ప్రభావితమవుతుంది, పునరుత్పాదకం కాని వనరుల వినియోగం అధికమై కాలుష్యం, రోగాలకు దారితీస్తుందన్నారు హజారే. ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరగడం ఆందోళనకరమన్నారు.

'గాంధేయవాదం శక్తిమంతం'

గాంధేయవాదానికి ఈ రోజుల్లో కూడా అత్యంత ప్రాధాన్యం ఉందని దృఢంగా విశ్వసిస్తున్నట్లు తెలిపారు హజారే. సత్యం, అహింస ఎంతో శక్తిమంతమన్నారు. వీటి విలువ ప్రపంచానికి తెలియాలంటే మెుక్కుబడిగా పాటిస్తే సరిపోదని స్పష్టం చేశారు.

" గాంధీ ప్రవర్తన స్వచ్ఛం, నిర్మలం. గాంధేయవాదులూ అలాగే ఉండాలి. వారి స్వభావం, ప్రవర్తన, ఆలోచనలలో స్వచ్ఛత ఉండాలి. వారి జీవితంలో సమాజం, జాతీయ దృక్పథం మిళితమై ఉండాలి. పరిత్యాగిగా జీవించానలనుకునేవారు సత్యం, అహింస సిద్ధాంతాలను అలవర్చుకోవాలి. ఈ విలువల్ని మంచి స్వభావం లేని వారు పాటించినా ప్రయోజనం ఉండదు"

- అన్నా హజారే

అవమానాన్ని భరించగల శక్తి ప్రజలకు ఉండాలన్నారు హజారే. మహాత్ముడు తన జీవితంలో ఇలాంటివి ఎన్నో ఎదుర్కొన్నారని, రైలులో నుంచి బయటకు తోసేసినా ఎంతో సహనంతో ఉన్నారే తప్ప ఆవేశానికి లోను కాలేదని గుర్తు చేశారు.

ఎవరూ బోధించట్లేదు...

ఈ తరానికి గాంధేయవాదాన్ని ప్రభావవంతంగా బోధించట్లేదనడం చేదు నిజమన్నారు హజారే. మహాత్ముని ఆలోచనలు ఈపాటికే ప్రతిఒక్కరి జీవితంలో మిళితమై ఉండాల్సిందని... కానీ అది జరగలేదన్నారు.

తల్లిదండ్రులు మహాత్ముని విలువలను పిల్లలకు యుక్త వయసులోనే బోధించాలని, అలా జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు హజారే. పాఠశాలలు, కళాశాలు విలువల్ని పాటించకపోవడం బాధాకరమన్నారు. పిల్లలకు వీటిపై పుస్తక జ్ఞానం ఉన్నా.. వాటిని నిజ జీవితంలో ఏలా సాధన చేయాలో వారికి చెప్పేవారు లేరన్నారు హజారే.

ఈరోజుల్లో సత్యం, అహింసల ప్రభావం అంతగా లేకపోవడానికి పెరిగిన స్వార్థమే ప్రధాన కారణమని హజారే అన్నారు.

Last Updated : Sep 28, 2019, 8:02 PM IST

ABOUT THE AUTHOR

...view details