తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మృత్యువును ప్రేమించిన జగత్​ప్రేమికుడు... మహాత్ముడు

అనుక్షణం భయపడుతూ జీవించడమంటే.. ఎప్పుడో ఒక్కసారి రావాల్సిన మరణాన్ని రోజూ ఆహ్వానించడమే. దానికన్నా ఒక్కసారి మృత్యుఒడిలోకి చేరడం మేలు అంటారు. సృష్టి అనివార్యతలైన  జనన, మరణాల్లో కేవలం ఒకదానిపైనే మమకారం పెంచుకునే వారు కోకొల్లలు. ఒక వ్యక్తిని ప్రాణం కన్నా మిన్నగా ప్రేమించిన వారు అమరప్రేమికుడైతే... జగత్తునే తన కుటుంబంగా భావించి, ప్రతి జీవరాశిలోనూ ప్రేమ పాశాన్ని వెతికిన వ్యక్తిని ఏమంటారు? అలా మృత్యువునూ  ప్రేమించిన జగత్‌ప్రేమికుడు.. మహాత్ముడు.

మృత్యువును ప్రేమించిన జగత్​ప్రేమికుడు... మహాత్ముడు

By

Published : Sep 30, 2019, 11:27 PM IST

Updated : Oct 2, 2019, 4:33 PM IST

మృత్యువును ప్రేమించిన జగత్​ప్రేమికుడు... మహాత్ముడు

సత్యంలో దైవాన్ని, సంగ్రామంలో స్వరాజ్యాన్ని, బలహీనతలో బలాన్ని శోధించి, సాధించిన మహాత్ముడు బాపూజీ. అంతేకాదు... మృత్యువునూ ప్రేమించిన ధీరోదత్తుడు. 'సత్యాగ్రహ ఇన్‌సౌతాఫ్రికా' పుస్తకంలో మృత్యువు గురించి గాంధీజీ వ్యక్తం చేసిన అభిప్రాయాలు.. నేటికీ సగటు మనిషి ఆలోచనా విధానాన్ని సవాలు చేస్తుంటాయి.

"జననం, మరణం రెండూ సత్యాలే. మరి ఒకదానిపైనే ఎందుకు నీకీ ప్రేమ? చాలాకాలం క్రితం విడిపోయిన స్నేహితుడ్ని ఆహ్వానించినట్టే మృత్యువునూ ఆహ్వానించు. మరణం నీ స్నేహితుడు మాత్రమే కాదు... నీకు అత్యంత ఆప్తుడు."

-మహాత్మా గాంధీ

బారిష్టర్‌ చదివిన దగ్గర నుంచి స్వతంత్ర సంగ్రామ బాధ్యతలు చేపట్టే వరకూ మహాత్ముడు ఎదుర్కొన్న ఆటుపోట్లు అన్నీ ఇన్నీ కావు. కష్టాలు, కన్నీళ్లు, బాధలు, భయాలు.. ఆయన అతీతుడు కాదు. కానీ వాటికి ఆయన తలవంచలేదు. ఈ తీరే మృత్యువుకైనా భయపడని ధైర్యాన్ని గాంధీజీకి ఇచ్చింది. అందుకే...

"భయపడుతూ వేల సార్లు మరణించే కన్నా మృత్యువు వచ్చినప్పుడు ధైర్యంగా ఒక్కసారి స్వాగతం పలకడం మిన్న" అంటూ ఓసారి సాహసోపేత ప్రకటన చేశారు.

మహాత్ముడి జీవిత మజిలీని నిశితంగా గమనిస్తే.. ఎన్ని కష్టాలు దరిచేరినా... ఏనాడూ సత్యాన్ని వీడని సత్యాన్వేషి దర్శనమిస్తాడు. 1948 జనవరి 30 కన్నా ముందు గాంధీజీపై పలుమార్లు హత్యాయత్నాలు జరిగాయి. దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు బాపూజీని ఎవరో చంపబోయారు. ఆయన బ్రిటీష్‌ స్నేహితుడి వల్ల ఆ ముప్పు తప్పింది.

భారత్‌లో 1934 తర్వాత ఆయన భద్రతపై ఎన్నో అనుమానాలు వ్యక్తమయ్యాయి. దేశానికి తానెంత ముఖ్యమో.... తన జీవితమూ అంతే ముఖ్యమని గాంధీజీ భావించినా.... ఎప్పుడూ ఎలాంటి భద్రతనూ కోరుకోలేదు. ఈ స్వభావమే గాంధీజీని భారతీయులందరికీ మరింత దగ్గర చేసింది. వారిలో స్వతంత్ర కాంక్షను రేకెత్తించింది.

ఒకానొక సమయంలో గాంధీజీ గురించి ప్రస్తావించిన ఉక్కుమనిషి సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్''తెల్లవారు పారిపోయింది బక్కపల్చని బాపూ గుండెను చూసి కాదు... దాని లోపల ఉన్న ఉక్కు సంకల్పాన్ని చూసి బెంబేలెత్తిపోయారు" అని అన్నారు.

ఎప్పుడు, ఎక్కడికి వెళ్లాలన్నా ఎలాంటి సంకోచాలు లేకుండా ఒంటరిగా వెళ్లేందుకైనా మహాత్ము డు సిద్ధమయ్యేవారు. జనన, మరణాలు రెండింటినీ పరమసత్యంగా భావించిన మహాత్ముడ్ని.. మారణాయుధాలు, మరఫిరంగులు ఎదిరించలేకపోయాయి. మృత్యువునే ధైర్యంగా స్వాగతించి న, ప్రేమించిన జాతిపితను జగత్‌ప్రేమికుణ్ని చేశాయి.

Last Updated : Oct 2, 2019, 4:33 PM IST

ABOUT THE AUTHOR

...view details