సాధారణ మనిషి నుంచి మహాత్ముడిగా ఎలా...? మహాత్మ.. ఈ పదం వినగానే ప్రతి భారతీయుడి చెవుల్లో మార్మోగే పేరు ఒక్కటే.. మోహన్‌దాస్ కరంచంద్ గాంధీ. కానీ ఆ పిలుపు గాంధీజీకి ఇబ్బంది కలిగించేదట. అందరిలానే ఓ సాధారణ మనిషిగా గాంధీజీ తనను తాను అనుకునేవారు కాబట్టే ఆయనకు ఆ ఇబ్బంది కలిగి ఉండొచ్చు. ఇంట్లో ఉండే నలుగురిని ఒక మాటపైకి తీసుకురావడమే క్లిష్టతరమైన పని. అలాంటిది 30కోట్ల మంది గొంతుకలను, అంతమంది అభిప్రాయాలను, ఒక్కలాగే ప్రతిధ్వనించేలా చేయడానికి ఎంతటి నేర్పు కావాలి? తాను నమ్మిన సిద్ధాంతంపై అచంచల విశ్వాసముంది కాబట్టే గాంధీజీకి మహాత్ముని కిరీటాన్ని భరతజాతి కట్టబెట్టింది.
స్వీయలోపాలను స్వయంగా గుర్తించి వాటిని ఎప్పటికప్పుడు సరిదిద్దుకోవటమే బాపూజీ ఉన్నత శిఖరాలకు చేర్చిందని అందరు అంగీకరించే విషయం. సత్యశోధనలో తనమీద, తనవారి మీద, సమాజం మీద చేసిన ప్రయోగాలు ఆయనను వ్యక్తి నుంచి శక్తిస్థాయికి తీసుకుని వెళ్లాయి. మంచి లక్ష్యం ఎంతముఖ్యమో దానిని చేరుకునే మార్గం అంతే అంతేమంచిగా ఉండటం ముఖ్యం అని బలంగా నమ్మేవారు గాంధీజీ. ఆయన స్వాతంత్య్రానంతరం ఎలాంటి అధికారం, పదవుల కోసం కూడా పాకులాడలేదు. అయినా ఆయనను జాతిపితగా కీర్తించారు దేశ ప్రజలు.
జాతిపిత బిరుదు ఇచ్చిన బోస్....
గాంధీజీ జాతిపిత అన్నది ప్రభుత్వమో, రాజ్యమో ఇచ్చిన గౌరవం కాదు. అది ప్రజల గుండెల్లో నుంచి ఉప్పొంగిన భావన. భారత్‌ను ఓ జాతిగా నిర్మించడంలో గాంధీజీ చేసిన కృషిని గుర్తించి నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆయనకు తొలిసారిగా 'జాతిపిత' అనే బిరుదు ఇచ్చారని చెబుతారు. జీవనగమనంలో ప్రతీది అనుభవ పూర్వకంగానే ఆమోదంలోకి తీసుకున్నారు. ఆహారం, ఆరోగ్యం, వ్యాయామం, సమయపాలన, ప్రకృతితో మమేకం... ఇలా అన్ని విషయా ల్లో ప్రయోగాల ద్వారానే తన ఆలోచనలకు ఒకరూపం ఇచ్చారు బాపూజీ.
జీవితకాలంలో గాంధీజీ పొరపాట్లకు అతీతులేమీ కాదు. కానీ ఒకసారి చేసిన పొరపాటు మరోసారి చేయకుండా జాగ్రత్తపడే తీరే ఆయన అభ్యున్నతికి దోహదపడింది. ఎప్పటికప్పుడు ఆత్మ పరిశీలన చేసుకునేవారు. పనుల్లోనే కాదు ఆలోచనల్లో తప్పు దొర్లినా దాన్ని దైవం గమనిస్తుంది అని బాపూ భావించేవారు. ప్రపంచం మన తప్పుల్ని గుర్తించేలోగా.. మనమే వాటిని ఒప్పుకోవాలనేది మహాత్ముడి సిద్ధాంతం. దక్షిణాఫ్రికాలోని ఫీనిక్స్ ఆశ్రమంలో ఉంటుండగా... ఒక తప్పు చేసినందుకు ఒకపూట భోజనం చేయకుండా, ఉప్పును త్యజించి తనకుతాను శిక్ష వేసుకున్నారు. తన ఆత్మపరిశీలనలో ఏ తప్పు దొరికినా... మరుక్షణమే అది ఇతరులకు చెప్పేవారు.
ఎవరేం చెప్పినా శ్రద్ధ పెట్టి...
చదువు, ఆస్తిపాస్తులు, రంగు, కులం, మతం ఆధారంగా కాక ప్రతి మనిషికీ ఉండే వ్యక్తిత్వం ఆధారంగా ఒకరిపై గాంధీజీ అంచనాకొచ్చేవారు. సాధారణంగా రాజకీయ నాయకులంతా తామెక్కువ మాట్లాడి... ఎదుటివారు చెప్పే మాటలను దాదాపుగా పెడచెవిన పెడతారు. అయితే తన సభలు, సమావేశాలకు సైతం ఏనాడూ సిద్ధపడి వెళ్లని గాంధీజీ.... తన దగ్గరకొచ్చి ఎవరేం చెప్పినా శ్రద్ధగా వినేవారు. మిగతా వారి నుంచి ఆయనను వేరు చేసింది ఈ గుణమే. మన భావాలు వేరొకరిపై బలవంతంగా రుద్దటం హింసాయుతంగా భావించేవారు. మనం వెళ్లేమార్గంలో మంచిని గ్రహించి ఎవరికివారు అందులోకి వస్తే అది శాశ్వతమార్పు, సంస్కరణకు అవకాశం ఇస్తుందని చెప్పేవారు.
సాధారణంగా ప్రపంచంలో భౌగోళిక, రాజకీయ పరిమితులకు లోబడి ఓ జాతి నిర్మాణం జరుగుతుంది. ఐతే మాట్లాడే భాష ఆధారంగా బంగ్లాదేశ్, ఆచరించే మతం ఆధారంగా పాకిస్థాన్ ఏర్పడ్డాయి. భావోద్వేగాల ఐక్యత వల్ల ఏర్పడిన ఒకేఒక్క దేశం...భారతదేశం. బ్రిటీషర్ల సంకెళ్ల నుంచి విముక్తి కోసం ప్రజలందరినీ ఒక్కచోట చేర్చి వారిలో జాతీయవాదమనే భావన ఏర్పడేలా చేయటంలో గాంధీజీది అసమాన పాత్ర . ఇదేసమయంలో భాషవిధానం పట్ల గాంధీ ఆలోచనలు చాలా స్పష్టంగా ఉండేవి. అమ్మభాషను మరవద్దు అంటునే... అదనంగా ఇతర భాషలు నేర్చు కుంటే అవకాశాల ద్వారాలు తెరుచుకుంటాయనే వారు.
మహిళల్లో స్వాతంత్ర్య కాంక్ష రగిలించిన గాంధీ..
ఈ క్రమంలో భాషా సంపదలపై అమితమైన ఆసక్తి, ప్రేమతో సరళమైనరీతిలో సామాన్యులకు సైతం చేరువయ్యారు గాంధీజీ. ప్రజలకు అర్థమయ్యే సరళమైన పదాలను ఉపయోగిస్తూనే తన ప్రసంగాలతో వారిని ఆకట్టుకునేవారు. తనతో పాటు సమావేశాలకు హాజరయ్యే నాయకులందర్నీ తమ మాతృభాషలోనే ప్రసంగించాలని పట్టుబట్టేవారు. దేశ జనాభాలో సగభాగమున్న మహిళలను స్వాతంత్ర్య పోరాటంవైపు నడిపించిన ఘనత మహాత్ముడిదే. ఆయన చూపిన సత్యాగ్రహం, అహింసా బాటల పట్ల ఆకర్షితులై లక్షలాది మంది మహిళలు ఆయన వెంట నడిచారు. ఏమీ కానివారినీ ఆత్మీయులుగానే చూసేవారు గాంధీజీ.
అహ్మదాబాద్‌లోని సబర్మతీ ఆశ్రమాన్ని వార్ధాలోని సేవాగ్రామ్‌కు తరలించేటప్పుడు పక్కనున్న గ్రామాల్లో సేవా కార్యక్రమాలు చేపట్టాల్సిందిగా తన ఆశ్రమవాసులకు గాంధీజీ చెప్పారు. అనంతరం స్వయంగా అక్కడి వీధులను శుభ్రపర్చి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. గాంధీ ఏం చెప్తే అదే చేశారు. ఏం చేస్తారో అదే చెప్పేవారు. మనసా వాచా కర్మణా నమ్మిన సిద్ధాంతాన్ని జీవితాంతం ఆచరించి చూపించారు. ఈ లక్షణమే మిగతా నాయకుల నుంచి ఆయన్ను భిన్నంగా మరో స్థాయిలో నిలబెట్టింది.
ఇదీ చూడండి: మహాత్ముని స్మరణ.. 'వైష్ణవ జన తో' ఆవిష్కరణ