గుజరాత్ పోర్బందర్కు చెందిన కుర్రాడు అతడు. రాజ్‌కోట్ పాఠశాలలో చదివే రోజుల్లోనే మత సామరస్యం, మనుషులంతా ఒక్కటే అనే భావాలు ఇనుమడింపజేసుకున్నాడు. బారిష్టర్ చదివేందుకు ఇంగ్లాండ్ వెళ్లే ముందు తన తల్లి పాదాల చెంత ప్రమాణం చేశాడు. స్వచ్ఛంగా జీవిస్తానని, ఎప్పటికీ క్రమశిక్షణ వదలనని హామీ ఇచ్చాడు. అతడే మోహన్‌దాస్ కరమ్‌చంద్ గాంధీ.
రాటుదేలింది అక్కడే...
గాంధీ తన తొలినాళ్లలో న్యాయవాదిగా దక్షిణాఫ్రికాలో 20 ఏళ్లకు పైగా ఉన్నారు. ఎన్నో అవమానాలు, భౌతిక దాడులు.. గాంధీని అసహాయులకు నాయకుడ్ని చేశాయి. నిరంకుశ పాలకులు, జాతి విద్వేషకులకు వ్యతిరేకంగా అహింసా ఉద్యమం చేసేందుకు ఆయన్ను పురిగొల్పాయి.
అదే పెద్ద మలుపు...
1906... గాంధీ జీవితాన్నే కాదు ఆధునిక ప్రపంచ చరిత్రను మార్చిన సమయం ఇది. తొలిసారి దక్షిణాఫ్రికాలోనే 'సత్యాగ్రహం' మొదలుపెట్టారు మాహాత్ముడు. సత్యాగ్రహ ఉద్యమం గురించి భారత రచయిత రామచంద్ర గుహ మాటల్లో...
"కత్తి దూయలేదు. తుపాకీ పేల్చలేదు. అయినప్పటికీ ఓ పెద్ద శత్రువును ఓడించిన గాంధీ హీరోయిజానికి సమానమైనది ఎక్కడా లేదు."
- రామచంద్ర గుహ, రచయిత
దక్షిణాఫ్రికాకు చెందిన రామచంద్ర గుహ స్నేహితుడు ఒకరు ఆయనకు రాసిన ఓ లేఖలో గాంధీ గురించి ప్రస్తావిస్తూ.. 'మీరు మాకు ఓ న్యాయవాదిని ఇస్తే.. మేము మీకు మాహాత్ముడ్ని ఇచ్చాం' అని పేర్కొన్నారు.
ఈ భూమిపై ఉన్న అతి శక్తిమంతమైన ఆయుధంగా సత్యాగ్రహాన్ని అభివర్ణించారు మాహాత్ముడు.
- ఇదీ చూడండి: గాంధీ-150: 'చౌరీచౌరా'తో 'సహాయ నిరాకరణ'కు తెర
గాంధీ వచ్చేసరికి...
ఎక్కడ చూసినా నిరాస, నిస్పృహ, నిస్సహాయత, గందరగోళం. ఇది దక్షిణాఫ్రికా నుంచి గాంధీ వచ్చేసరికి.. భారత్ పరిస్థితి. గాంధీ లక్ష్యం ఒక్కటే.. ఆంగ్లేయుల దాస్యశృంఖలాల నుంచి భరతమాతకు స్వేచ్ఛను కల్పించాలి. సూటు వేసుకొని ఇంగ్లాండ్‌లో బారిష్టర్ చేసిన గాంధీ.. భారత్‌లో తెల్లవాడికి వ్యతిరేకంగా ఖద్దరు కట్టి పోరుబాట పట్టారు. సత్యాగ్రహం, అహింస, ప్రేమ అనే ఆయుధాలను చేతపట్టి రణరంగంలో కదం తొక్కారు. గాంధీ చేసిన యుద్ధం గురించి అరబ్ కవి మిఖాయిల్ నోయిమా చెప్పిన తీరు అజరామరం.
"గాంధీ చేతిలో ఉన్న కర్ర.. కత్తి కంటే పదునైనది. ఆయన బక్కపలచని ఒంటిపై ఉన్న తెల్లని వస్త్రమే... తెల్లవాడి వేల తుటాల నుంచి కాపాడే రక్షణ కవచం. ఆయన చెంతన ఉండే మేక... బ్రిటిష్ సింహం కన్నా బలమైనది."
- మిఖాయిల్ నోయిమా, అరబ్ కవి