తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బాపూ స్ఫూర్తితోనే 'సరిహద్దు గాంధీ' ఉద్యమం - Gandhi, Azad and Ghaffar Khan

మహాత్ముడి నుంచి ఎందరో స్ఫూర్తి పొంది గొప్ప నేతలుగా ఎదిగారు. వారిలో అబ్దుల్​ గఫర్​ ఖాన్​, మౌలానా ఆజాద్​ ప్రముఖులు. గాంధీ విధానాలను అనుసరిస్తూనే.. దేశ చరిత్రలో వారికంటూ ఒక చెరగని ముద్రవేసుకున్నారు. ద్వేషాన్ని రేకెత్తించి, ప్రజలను విభజించేది అసలు మతమే కాదని విశ్వసించేవారు.

మహాత్ముడి స్ఫూర్తితోనే 'సరిహద్దు గాంధీ' ఉద్యమం

By

Published : Sep 23, 2019, 12:29 PM IST

Updated : Oct 1, 2019, 4:28 PM IST

అహింసా విధానాలతో నిత్య సత్యాన్వేషిగా సాగిన గాంధీజీ జీవితం భారతీయులకు ఆదర్శం. హిందూ, ముస్లింలనే తేడా లేకుండా మతాలకు అతీతంగా.. ఆయన జీవనతత్వాన్ని అనుసరించారు. మహాత్ముడి స్ఫూర్తితో ఖాన్‌ అబ్దుల్‌ గఫర్‌ ఖాన్‌, మౌలానా ఆజాద్‌.. శాంతి, సహజీవనం, సహనం, అహింస సూత్రాలను పాటించారు.

భారత వాయవ్య సరిహద్దుల్లో.. అదే గాంధీ స్ఫూర్తితో ఖాన్‌ అబ్దుల్‌ గఫర్‌ ఖాన్‌ బ్రిటిష్‌ రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడారు. ఆయనను బాద్​షా ఖాన్‌ అని పిలుస్తుంటారు. ఆయన పష్తున్‌ స్వాతంత్ర్య పోరాటయోధుడు. ఆయన గొప్పతనం ఆ ప్రాంతంలో కనిపించే మత, గిరిజన విభజనను మించి వెలిగిపోయింది. తెగల మధ్య పోరాటాలు, నిత్యం రక్తపాతాలకు కేంద్రమైన వాయవ్య సరిహద్దుల్లో జన్మించిన అబ్దుల్‌ గఫర్‌ ఖాన్‌... మహాత్ముడి బలమైన అనుచరుడు. కల్లోల ప్రాంతంలో అహింస, సత్యాగ్రాహం ద్వారా మార్పు తెచ్చే ప్రయత్నం చేశారు. అందుకే ఆయనను సరిహద్దు గాంధీ అంటారు.

మహాత్ముడి ఆలోచనతో మక్కాకు వెళ్లి తిరిగి వచ్చిన తర్వాత... దేవుని సేవకుల ఉద్యమాన్ని ప్రారంభించారు. రాజీలేని తీరు, అహింసపై నిబద్ధత, ఐక్య భారతంపై అచంచల నమ్మకం కలిగిన గఫర్‌ ఖాన్‌ అంటే.. అక్కడి ప్రజలకు ఎంతో గౌరవం. దేవుని సేవకుల ఉద్యమం వేలమందిని ఆకర్షించింది. ఆయనకు అనుచరులను చేసింది. సంప్రదాయ యుద్ధం చేసే పష్తున్‌ సమాజం... లక్ష్యాల సాధన కోసం అహింస పద్ధతులను అనుసరించగలదని నిరూపించింది.

గాంధీని మెప్పించిన ఖాన్​...

1928లో తొలిసారి మహాత్ముడిని కలిసిన ఖాన్‌.. కాంగ్రెస్‌ పార్టీతో కలిసి పనిచేశారు. ఆ తర్వాత గాంధీకి అత్యంత సన్నిహితుడయ్యారు. గాంధీజీ, ఖాన్‌వి భిన్న నేపథ్యాలు. గాంధీ నిరాడంబరంగా పెరగగా, ఖాన్‌ అందుకు విరుద్ధంగా జీవించారు. ఇద్దరూ రాజకీయాలు, మతం, సాంస్కృతిక సమస్యలపై గంటల తరబడి చర్చించుకునేవారు. గఫర్‌ ఖాన్‌ చిత్తశుద్ధి, స్పష్టత, సరళమైన జీవితం చూసి.. గాంధీజీ ముగ్ధుడయ్యారు. గఫర్‌ నిజమైన దేవుని సేవకుడని భావించేవారు. సరైన ప్రవర్తన, విశ్వాసం, ప్రేమ అనే మూడు అంశాల మధ్య జీవితం గడిపారు.

గాంధీజీ, గఫర్‌ ఖాన్‌ ఇద్దరి కల ఒకటే... ఐక్య భారతం, స్వతంత్ర, అవిభక్త భారతదేశం ఏర్పడాలని బలంగా కోరుకున్నారు. హిందువులు, ముస్లింలు ఇద్దరూ కలిసి ఉన్న భారతాన్ని చూడాలనుకున్నారు.

" అహింస అంటే ప్రేమగా ఉండటం. ఇది ప్రజలకు ధైర్యాన్నిస్తుంది. అహింసను ఆచరించనంత వరకు ప్రజలకు శాంతి లేదు, జీవితానికి ప్రశాంతత ఉండదు."
------- ఖాన్ అబ్దుల్‌ గఫర్‌ ఖాన్‌.

'మానవుని సేవే.. దేవుని సేవ' అని గఫర్‌ ఖాన్‌ నమ్మారు. సంఘర్షణను, ద్వేషాన్ని రేకెత్తించి, ప్రజలను విభజించి, ఐక్యతను నాశనం చేసేది.. మతమే కాదని గఫర్ ఖాన్‌ వాదించేవారు.

అహింస భావన పవిత్ర ఖురాన్‌లో ఉందని గఫర్‌ ఖాన్‌ పదేపదే చెప్పేవారు.

"ఇది ప్రవక్త ఆయుధం. అది మీకు అర్థం కాదు. ఆ ఆయుధాన్ని సహనం, ధర్మం అంటారు. ఈ గ్రహం మీద ఏ శక్తి... ఈ ఆయుధం ముందు నిలవలేదు."
------- ఖాన్ అబ్దుల్‌ గఫర్‌ ఖాన్‌

బాపూ స్ఫూర్తితో ఆజాద్ ముందడుగు​...

మహాత్ముడిని అనుసరించిన మరో ముస్లిం నేత మౌలానా ఆజాద్‌. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన ప్రభావశీలమైన నేత. ఆయన ఒక కాంగ్రెస్‌ నేతే కాదు... సుప్రసిద్ధ రచయిత, కవి, పాత్రికేయుడు. 1923, 40లలో కాంగ్రెస్‌ అధ్యక్షునిగా పనిచేశారు. మహమ్మద్‌ అలీ జిన్నా లాంటి ఇతర ప్రముఖ ముస్లిం నేతల విధానాలను మౌలానా ఆజాద్‌ తీవ్రంగా వ్యతిరేకించారు.

ఈజిప్టు, టర్కీ, సిరియా, ఫ్రాన్స్‌ పర్యటనల తర్వాత దేశానికి తిరిగి వచ్చిన ఆజాద్‌... ప్రముఖ హిందూ విప్లవకారులు అరబిందో ఘోష్‌, శ్యామ్‌ సుందర్ చక్రవర్తిలను కలిశారు. వారి వద్ద ఆజాద్‌ రాజకీయ పాఠాలు నేర్చుకున్నారు. ఆ తర్వాత భారతదేశ జాతీయోద్యమంలో పాల్గొన్నారు. జాతీయ ప్రయోజనాలపై దృష్టిపెట్టకుండా.. మతపరమైన సమస్యల పరిష్కారం కోసం పనిచేసే ముస్లిం రాజకీయ నాయకులను ఆజాద్‌ తీవ్రంగా వ్యతిరేకించారు. అఖిల భారత ముస్లిం లీగ్‌ ప్రతిపాదించిన మత వేర్పాటువాద సిద్ధాంతాలను తిరస్కరించారు.

కాంగ్రెస్​లో ప్రత్యేక సేవలు...

మహాత్ముడు ప్రారంభించిన సహాయ నిరాకరణ ఉద్యమానికి మద్దతిస్తూ.. ఆజాద్‌... 1920 లో కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్‌ ముఖ్య నేతల్లో ఒకరిగా ఎదిగారు. 1923లో జరిగిన కాంగ్రెస్‌ ప్రత్యేక సమావేశానికి అధ్యక్షత వహించారు. కాంగ్రెస్‌కు అధ్యక్షుడిగా ఎన్నికైన అతిపిన్న వయస్కుడిగా పేరుగాంచారు. కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సభ్యుడిగా, ప్రధాన కార్యదర్శిగా వివిధ హోదాల్లో పనిచేశారు. మతం ఆధారంగా ప్రత్యేక ఓటింగ్‌ విధానాన్ని ఆజాద్‌ వ్యతిరేకించారు. లౌకికవాదానికి కట్టుబడి ఉన్న ఒకే దేశం విధానానికి కట్టుబడి ఉన్నారు.

మతాల సహజీవనమే మానవ జీవితానికి మంచిదని ఆజాద్‌ బలమైన నమ్మకం. హిందూ, ముస్లింలు కలిసి జీవించే ఏకీకృత స్వతంత్ర భారతం ఆయన కల. 'దేశం విడిపోయినప్పటికీ... సహజీవనం, సహనమే రక్ష' అని చివరివరకు విశ్వాసించారు. తోటి ఖిలాఫత్‌ నాయకులతో దిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు. దేశంలోని విభిన్న ప్రాంతాలు, మతాలు, సంస్కృతుల నుంచి వచ్చిన విద్యార్థులకు విద్యనందిస్తున్న ఈ విశ్వవిద్యాలయం.. వ్యవస్థాపకుల స్ఫూర్తితో ముందుకు సాగుతోంది.

--అసద్​ మీర్జా

Last Updated : Oct 1, 2019, 4:28 PM IST

ABOUT THE AUTHOR

...view details