భారత జాతీయోద్యమంలో పత్రికలు క్రియాశీలంగా వ్యవహరించాయి. ప్రారంభ దశ నుంచి.. భిన్న సంస్కృతులు, ప్రాంతాల ప్రజలను ఒక్కటి చేసి.. మహోద్యమంగా మారడంలో చురుకైన పాత్ర పోషించాయి. ఉద్యమ కార్యాచరణ ప్రజలకు చేరడానికి, వలసవాద ఆధిపత్య ధోరణిని వివరించడానికి.. చివరిగా జాతీయ భావజాలం ఏర్పడానికి స్వదేశీ పత్రికలు ప్రధాన సాధనమయ్యాయి. భయం, బెరుకు లేకుండా నాటి పాత్రికేయులు వెలువరించిన వార్తలతో శక్తి వంతమైన పత్రికలు వెలువడ్డాయి. నాటి ఉద్యమంలో ప్రధాన రాజకీయ నాయకుడు లేడు. ఎలాంటి పత్రికలు లేవు. నాయకులకు పత్రికల శైలి అంతగా తెలియని రోజులవి.
అలాంటి రోజుల్లో.. జాతీయోద్యమంలో మహాత్మా గాంధీ పత్రికల ద్వారా ఆంగ్లేయులపై అక్షర ఆయుధాలు సంధించారు. ఓ పాత్రికేయునిగా, రచయితగా, వ్యాసకర్తగా గాంధీజీ ప్రయాణంలో 1903 నుంచి దక్షిణాఫ్రికాలో ప్రారంభమై 1945 వరకు సాగింది. నిబద్ధత గల పాత్రికేయునిగా, సంపాదకుడిగా బాపూజీ నిత్యం ప్రజా సమస్యలపై పత్రికల్లో రచనలు చేశారు.
నాటల్ ఇండియన్ కాంగ్రెస్....
1903 నుంచి 1914 వరకు, తిరిగి 1919 నుంచి 1948లో తన తుదిశ్వాస వరకు.. గుజరాతీ, ఇంగ్లీష్, ఇతర భాషల్లో మహాత్ముడు వారపత్రికలను ప్రచురించారు. యంగ్ ఇండియా, నవజీవన్, హరిజన్, ఇండియన్ ఓపినీయన్‌ల ద్వారా గాంధీజీ చేసిన ప్రయత్నం... తనను ప్రత్యేకంగా నిలిపింది. 1893లో దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌లో దిగజారుతున్న భారత ప్రజల పరిస్థితులను, నాటి భారత ప్రభుత్వానికి తెలిపేందుకు.. 'నాటల్ ఇండియన్ కాంగ్రెస్' - ఎన్ఐసీ స్థాపించారు. ఈ సమస్యల పరిష్కారానికి ఓ వేదికగా వారపత్రికను తేవాలనే ప్రయత్నం 1896 వరకు నెరవేరలేదు. బోయర్ యుద్ధానంతరం.. వార పత్రిక అత్యవసరమని గుర్తించారు. ఈ పరిస్థితుల్లో గాంధీజీ తన ముఖ్య రాజకీయ సహచరులతో ఇండియన్ ఒపీనియన్ పేరుతో వారపత్రికను ప్రారంభించాలని నిర్ణయించారు.
చివరకు 1903 జూన్‌లో డర్బన్ నుంచి ఇండియన్ ఒపీనియన్ వారపత్రిక మొదలైంది. అప్పుడు గాంధీజీ జోహన్నెస్‌బర్గ్‌లో న్యాయవాదిగా ప్రాక్టీసు చేస్తున్నారు. ఓ పాత్రికేయునిగా బాపూజీ సుదీర్ఘకాలం, క్రియశీల పాత్ర పోషించారు. వర్ణ వివక్షతతో శ్వేతజాతీయుల పాలనలో భారతీయుల సమస్యలను చర్చించారు. ఓ పత్రిక లేకుండా సహోద్యోగులకు, ప్రజలకు సమస్యపై అవగాహన కల్పించడం అంత సులువు కాదని దక్షిణాఫ్రికా పరిస్థితులు గాంధీజీకి నేర్పాయి. ఇండియన్ ఒపీనియన్‌ని తన సహచరుల సహకారంతో.. ఇంగ్లీష్, హిందీ, గుజరాతీ, తమిళ భాషల్లో బాపూజీ తీసుకువచ్చారు. అంతా కలిసి వారపత్రికను సమగ్రంగా తీసుకు వచ్చేవారు. ఇండియన్ ఒపీనియన్‌కి భారతీయుల నుంచే కాకుండా నల్లజాతీయుల నుంచి మంచి ఆదరణ లభించింది. వర్ణవివక్ష పోరాటంలో.. సామాజిక, ఆర్థిక, రాజకీయ దుస్థితికి సంబంధించి ప్రశ్నలను శ్వేతజాతి ప్రభుత్వంపై సంధించింది. భారతీయ, దక్షిణాఫ్రికా నల్ల జాతీయులు ఎదుర్కోంటున్న సమస్యలపై లోతైన రచనలు చేసిన గాంధీజీ.. అవి విస్తృతంగా చర్చకు వచ్చేందుకు కృషి చేశారు.
పాత్రికేయుని మూడు లక్షణాలు..
గాంధీజీ దృష్టిలో పాత్రికేయం... ఓ గొప్ప వృత్తి. పాత్రికేయులు, పత్రికలకు మూడు కనీస లక్షణాలు ఉండాలి. ప్రజల దుస్థితిని గుర్తించాలి, అర్థం చేసుకుని, పరిష్కారం దిశగా సమర్థవంతంగా పనిచేయడం మొదటి లక్షణం. సమాజానికి అవసరమైన సామాజిక, రాజకీయపరమైన అవగాహన కల్పించి, ప్రజలను ప్రేరేపించడం రెండో లక్షణం. వలస రాజ్యాల లోపాలను బహిర్గతం చేసి.., అణచివేత, దోపిడీకి వ్యతిరేకంగా పోరాడేందుకు ప్రజల్ని సంఘటితం చేయడం... మూడో లక్షణం. నలభై ఏళ్ళకు పైగా పత్రికలను నడిపిన బాపూజీ ఈ మూడు లక్షణాలను ఏనాడూ విడవలేదు. ఈ 'గాంధేయ పాత్రికేయ నీతి' నిజమని నిర్థరించేందుకు.. ఆయన ఎప్పుడూ ప్రకటనలను పత్రికల్లో ప్రచురించలేదు. పాఠకుల చందాతోనే పత్రికను నడిపారు.
ఇండియన్ ఒపీనియన్ వారపత్రిక ప్రాముఖ్యత దాని పరిణామంలో లేదు. ఆ పత్రిక అందించిన వార్తల్లో ఉంది. 58 ఏళ్లపాటు సేవలు అందించిన ఇండియన్ ఒపీనియన్ చందాదారుల సగటు సంఖ్య 2 వేలు. ఓ సంతవత్సరంలో 3 వేల 500మంది ఉన్నారు. ఇండియన్ ఒపీనియన్.. నాటల్ ఇండియన్ కాంగ్రెస్ నుంచి వెలువడిన మొదటి భారతీయ పత్రిక కాదు. 1898లో ఇండియన్ వరల్డ్ అనే స్వల్పకాలిక వారపత్రిక ఉంది. 1901లో పీఎస్ అయ్యర్ తమిళం, ఇంగ్లీష్‌లో కలోనియల్ ఇండియన్ న్యూస్‌ని రెండేళ్లపాటు నడిపించారు. నాటల్‌లోని ఆఫ్రికన్లు కూడా కొన్నాళ్లు పత్రికలు ప్రచురించారు. ఇండియన్ ఒపీనియన్ నాటి బ్రిటిష్ ప్రభుత్వంపై పరిమితమైన స్వరాన్నే వినిపించింది.
1857 తిరుగుబాటు తర్వాత నాటి విక్టోరియా రాణి ఇచ్చిన వాగ్దానంపై గాంధీజీకి పూర్తి నమ్మకం ఉండేది. బ్రిటీష్ సామ్రాజ్యం స్వభావికంగా మంచిదేననే అభిప్రాయంతో అప్పుడు ఉన్నారు. భారతీయ సమాజానికి, దక్షిణాఫ్రికా నల్లజాతీయులకు రాజ్యాంగం ద్వారా న్యాయం జరుగుతుందని బాపూజీ నమ్మేవారు. వలసవాద ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాస్తే.. ఆ పత్రికను మూసివేయడం తప్ప మరో మార్గంలేని పరిస్థితుల్లో.. గాంధీజీ మధ్యేమార్గాన్ని అనుసరించారు. నాటి బ్రిటిష్ రాజ్యాంగానికి లోబడి ప్రాథమిక ఆందోళన, అన్యాయాలకు వ్యతిరేకంగా పత్రికను నడిపారు.