ప్రపంచంలో కోట్లాది మందికి ప్రేరణను, స్ఫూర్తిని ఇచ్చారు మన మహాత్ముడు. ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు సంపాదించిన మహానుభావులు- మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్, దలైలామా, నెల్సన్ మండేలా, అడోల్ఫో పెరెజ్ ఎస్‌క్వీవ్.. వీరందరూ తమకు స్ఫూర్తి, ఆదర్శం గాంధీజీ అని పలుమార్లు చెప్పారు. గాంధీజీ బాటలో నడిచిన వీరికి నోబెల్ పురస్కారమూ దక్కింది.
కోట్లాది మంది భారతీయులలో తన చేతలు, మాటల ద్వారా చైతన్యాన్ని నింపి, దేశ స్వాతంత్య్రం వైపు నడిపించారు గాంధీజీ.
గాంధీ మార్గంతో..
నెల్సన్ మండేలా, డెస్మండ్ టుటు దక్షిణాఫ్రికా ప్రజాస్వామ్య పోరాటంలో ప్రధాన పాత్ర పోషించారు. జాతివివక్ష వ్యతిరేక పోరాటంలో.. గాంధీ మార్గంలో శాంతియుతంగా వ్యవహరించి.. ప్రజాస్వామ్యాన్ని సాధించారు. హింసాత్మక అంశాల్ని ఉపసంహరించుకోవడం ద్వారా అది వారికి రాజకీయ హక్కుల్ని తెచ్చిపెట్టింది. ప్రపంచవ్యాప్తంగా అణచివేతకు వ్యతిరేకంగా పోరాడే కోట్ల మంది ప్రజలకు మండేలా ఒక ప్రతీకగా మారారు. నల్లజాతీయుల కోసం పోరాడిన మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్... అమెరికన్ గాంధీగా ప్రసిద్ధి చెందారు. ఆయన అహింసా మార్గం గురించి ఇలా రాసుకొచ్చారు.
''నేను గాంధీ సిద్ధాంతాల్ని లోతుగా పరిశోధించినప్పుడు... అధికారాన్ని నిలుపుకోవాలన్న నా ఆలోచన క్రమక్రమంగా తగ్గింది. నా సంశయాలు తొలిగిపోయాయి. ప్రేమను బోధించే క్రైస్తవ సిద్ధాంతాల్లో కూడా గాంధేయ వాదమైన అహింసా మార్గం ఉన్నట్టు తొలిసారి అర్థం చేసుకున్నాను.'' - మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్, నాయకుడు
మహాత్ముడి స్ఫూర్తితోనే ఇంకెందరో...
స్టాన్లీ జోన్స్, హెన్రీ రోజర్, డా.కోర్మన్, డబ్ల్యూడబ్ల్యూ పియర్సన్, సీఎఫ్ ఆండ్రూస్ ఇలా అంతా గాంధీని ఆరాధించినవారే. మహాత్ముడి మార్గంలో నడిచినవారే.
అహింసా మార్గంలోనే ఎన్నో విజయాలు దరిచేరాయని చరిత్ర చెబుతోంది. ప్రపంచవ్యాప్తంగా వేర్వేరు చోట్ల జరిగిన ఉద్యమాల్లో ఇదే కీలక పాత్ర పోషించింది. అయితే.. దీనికి మహాత్ముడినే స్ఫూర్తి, ప్రేరణగా తీసుకున్నామని... ఆ పోరాటాల్ని సాగించిన నాయకులు పలుమార్లు చెప్పడం విశేషం. గాంధీజీ పాటించిన అహింసా మార్గంలోనే విజయాలు సాధించామని వారు చెప్పుకొచ్చారు.
మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ నేతృత్వంలో 1960ల్లో అమెరికా పౌర హక్కుల ఉద్యమం.. ఆఫ్రికన్-అమెరికన్లకు రాజకీయ హక్కులతో ముగిసింది. దీనితో ఆయన అత్యున్నత శిఖరాలకు ఎదిగారు.
తూర్పు ఐరోపాలో అహింసా నిరోధకతను ఎదుర్కొన్నప్పుడు పోలండ్‌లో అధికార వ్యతిరేక సామాజిక ఉద్యమం సాలిడరిటీ, చెకొస్లోవేకియాలో చార్టర్ 77 ఉద్యమాల శక్తుల నేతృత్వంలో కమ్యూనిజం కుప్పకూలింది.
1986లో ప్రజలు భారీ ప్రదర్శనతో ఫెర్డినాండ్ మార్కోస్ నియంతృత్వ పాలనను అంతమొందించారు. అప్పట్లో సైన్యం ప్రజలపై కాల్పులు జరిపేందుకు నిరాకరించింది. ప్రజాస్వామ్య అనుకూల ఉద్యమంలో ఇదొక గొప్ప విజయం.
శాంతి సేవకుడిగా డెల్ వాస్టో..
క్రైస్తవవాది జోసెఫ్ జీన్ లాంజా డెల్ వాస్టో.. గాంధీజీని కలిసేందుకు 1937లో గుజరాత్‌లోని వార్ధాకు వచ్చారు. అనంతరం.. ఆయన భావజాలాన్ని స్ఫూర్తిగా తీసుకొని.. 'లీ పెలెరినేజ్ ఆక్స్' మూలాలను రచించారు. ఆయన.. గాంధీ అనుచరుడి గానూ మారారు. మహాత్ముడు ఆయనను శాంతిదాస్, శాంతి సేవకుడుగా కీర్తించారు. తదనంతరం.. 1957లో ఫ్రెంచ్ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించారు. అల్జీరియన్ ప్రజలపై ఫ్రెంచ్ దౌర్జన్యాన్ని నిరసిస్తూ.. 20 రోజుల పాటు నిరాహార దీక్ష చేశారు.