తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భారత్​ భేరి: తమిళ కింగ్​మేకర్​ దినకరన్? - 2019 ELECTIONS

వ్యక్తిస్వామ్యం... తమిళనాడుకు కొత్త కాదు. ఒకప్పుడు అంతా అమ్మ శకం. లేదంటే 'కరుణ'మయం. ఇప్పుడు అగ్రనేతలు ఇద్దరూ లేరు. ఆ స్థాయి నేతలు రెండు పార్టీల్లోనూ లేరు. కానీ... తమిళ రాజకీయ భవిష్యత్​ ఆధారపడి ఉంది మాత్రం ఓ వ్యక్తిపైనే. లోక్​సభ, శాసనసభ ఉపఎన్నికల్లో దినకరన్​ ప్రభావం ఎంత అన్నదే అసలు ప్రశ్న.

తమిళనాట దినకరన్​ కీలకమా...?

By

Published : Apr 3, 2019, 2:20 PM IST

తమిళనాట దినకరన్​ కీలకమా...?
అన్నాడీఎంకే... తమిళనాట అధికార పక్షం. భాజపాకు మిత్రపక్షం. అయినా... ఇప్పుడొచ్చిన సార్వత్రిక సమరం ఆ పార్టీకి చావుబతుకుల సమస్య. ఇందుకు కారణం ప్రజావ్యతిరేకత కాదు. ప్రతిపక్ష డీఎంకే బలపడడం అసలే కాదు. అన్నాడీఎంకే ఆందోళనకు మూలం... ఓ వ్యక్తి.

అధికార పార్టీ నేతల్లో గుబులు రేపుతున్న వ్యక్తి టీటీవీ దినకరన్. ఆయన పార్టీ 'అమ్మ మక్కల్​ మున్నేట్ర కళగం.' ఎన్నికల గుర్తు గిఫ్ట్​ ప్యాక్​.

ఇవీ చూడండి:

భారత్​ భేరి: రాజకీయ వినోదం @​ ట్విట్టర్

భారత్​ భేరి: ఓటేస్తే సగం ధరకే ఆలూ బోండా

  • దివంగత జయలలిత నెచ్చెలి శశికళ మేనల్లుడు దినకరన్.
  • అన్నాడీఎంకేలో కోశాధికారిగా అనుభవం. గతంలో రాజ్యసభ, లోక్​సభకు ప్రాతినిధ్యం.
  • శశికళ జైలుకెళ్లే ముందు 2017 ఫిబ్రవరి 15న అన్నాడీఎంకే డిప్యూటీ ప్రధాన కార్యదర్శిగా నియామకం.
  • 2017 ఆగస్టులో అన్నాడీఎంకే నుంచి బహిష్కరణ
  • 2107 డిసెంబర్​లో ఆర్కే నగర్​ ఉపఎన్నికలో గెలుపు
  • 2018 మార్చి 15న అమ్మ మక్కల్​ మున్నేట్ర కళగం పార్టీ స్థాపన

అమ్మ వారసుడిగా!

జయలలిత మరణం తర్వాత...అన్నాడీఎంకేలో దినకరనే కీలకం అవుతారని భావించారంతా. కానీ... తమిళ రాజకీయాల్లో నాటకీయ మలుపులతో పరిస్థితి తారుమారైంది. చివరకు... 'అమ్మ మక్కల్​ మున్నేట్ర కళగం-ఏఎంఎంకే' పేరుతో సొంత పార్టీ పెట్టుకున్నారు దినకరన్.

ఆర్కే నగర్​ ఉపఎన్నికల్లో విజయంతో వ్యక్తిగతంగా తానేంటో నిరూపించుకున్నారు దినకరన్. ఇప్పుడు పార్టీపరంగా సత్తా చాటే సమయం వచ్చింది. అందుకు ముహూర్తం ఏప్రిల్​ 18. ఆ రోజు తమిళనాడులోని 39 లోక్​సభ నియోజకవర్గాలు, 18 శాసనసభ స్థానాలకు పోలింగ్​.

కొత్త పార్టీ అయినా...

తమిళనాడులో 39 లోక్​సభ నియోజకవర్గాలున్నా.... అన్నాడీఎంకే పోటీ చేస్తోంది 20 స్థానాల్లోనే. మిగిలినవి మిత్రపక్షాలకు కేటాయించింది. డీఎంకేదీ అదే కథ.

దినకరన్​ పార్టీ మాత్రం 38 లోక్​సభ నియోజకవర్గాల్లో పోటీ చేస్తోంది. మిగిలిన ఒక స్థానాన్ని మిత్రపక్షం ఎస్​డీపీఐకి కేటాయించింది. ఉపఎన్నికలు జరిగే 18 సీట్లలోనూ పోటీకి దిగింది ఏఎంఎంకే.

దినకరన్​ది కొత్త పార్టీ. సంస్థాగత నిర్మాణం పూర్తి కాలేదు. అయినా... ఆయన ఎక్కడ ఎన్నికల ప్రచారం చేసినా విశేష స్పందన వస్తోంది. అన్నాడీఎంకే తరఫున ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉపముఖ్యమంత్రి పన్నీర్​సెల్వం పాల్గొంటున్న ప్రచార సభలు మాత్రం జనం లేక వెలవెలబోతున్నాయి. ఈ పరిణామం అధికార పార్టీని ఆందోళనకు గురిచేస్తోంది.

'గుర్తు'లేక ఓట్ల బదిలీ...?

దక్షిణ, తూర్పు తమిళనాడులో దినకరన్​కు మంచి ఆదరణ ఉంది. కొన్ని స్థానాలను ఆయన పార్టీ గెలుచుకోగలదని అంచనా. ఉత్తర తమిళనాడులో అన్నాడీఎంకే ఓట్లు చీల్చి... డీఎంకే విజయానికి ఉపకరించే అవకాశముంది.

అన్నాడీఎంకే 19 లోక్​సభ నియోజకవర్గాల్లోనే పోటీ చేయడం ఏఎంఎంకేకు మరో సానుకూలాంశం. మిగిలిన 20 నియోజకవర్గాల్లో అన్నాడీఎంకే రెండాకుల గుర్తు కనిపించకపోతే ఆ పార్టీ మద్దతుదారులు దినకరన్​వైపే మొగ్గుచూపే అవకాశముంది.

భాజపాతో అన్నాడీఎంకే పొత్తు నేపథ్యంలో మైనార్టీల ఓట్లు తమకే పడతాయని లెక్కలు వేసుకుంటోంది ఏఎంఎంకే.

అసలు లెక్క వేరే...

దినకరన్​ అసలు లక్ష్యం సాధ్యమైనన్ని శాసనసభ స్థానాలు దక్కించుకోవడమే. ఇందుకు కారణం... ఆ రాష్ట్ర ప్రస్తుత రాజకీయ పరిస్థితే. తమిళనాడు శాసనసభలో మొత్తం సీట్ల సంఖ్య 235. ప్రస్తుతం 22 ఖాళీలున్నాయి. మిగిలినవాటిలో అన్నాడీఎంకే బలం 113. డీఎంకేకు 88, కాంగ్రెస్​కు​ 8మంది సభ్యులు ఉన్నారు. మిగిలినవి చిన్నపార్టీల సభ్యులు, ఇతరులవి. ఇప్పుడు ఉపఎన్నికల్లో దినకరన్​ పార్టీ ప్రభావం చూపితే... రాజకీయ ముఖచిత్రమే మారిపోతుంది.

  1. అన్నాడీఎంకే విఫలమైతే? :దినకరన్​ పార్టీకి వచ్చిన ఓట్ల శాతంపై చర్చ జరుగుతుంది. ఆయన్ను అన్నాడీఎంకేలోకి తిరిగి తీసుకురావాలన్న డిమాండ్​ వస్తుంది. ఏఎంఎంకే ప్రభావం పెద్దగా లేకపోతే... అన్నాడీఎంకేలో పళనిస్వామి-పన్నీర్​సెల్వం హవా కొనసాగుతుంది.
  2. విలీనం:అత్యధిక స్థానాల్లో ఏఎంఎంకే అభ్యర్థులు గెలిస్తే దినకరన్​ దూకుడు పెంచుతారు. తెరవెనుక వ్యూహాలతో అన్నాడీఎంకే పగ్గాలను చేజిక్కించుకునే అవకాశముంది.
  3. బేరసారాలు: ఉపఎన్నికలు జరిగే 18 శాసనసభ స్థానాల్లో ఏఎంఎంకే ఎక్కువ సీట్లు గెలుచుకుంటే ఈపీఎస్​-ఓపీఎస్​ వర్గం దినకరన్​తో బేరసారాలకు వచ్చే అవకాశముంది. ప్రభుత్వం కొనసాగేందుకు అవసరమైన సీట్లు అన్నాడీఎంకేకు లేకపోతే... చర్చల ప్రతిపాదనను దినకరన్​ తిరస్కరిస్తారని అంచనా. తద్వారా పళనిస్వామి ప్రభుత్వాన్ని కూల్చేందుకు డీఎంకేకు మద్దతిచ్చే అవకాశముంది. తమిళనాడులో అన్నాడీఎంకే, కేంద్రంలో భాజపా పాలనకు తెరదించడమే లక్ష్యమని దినకరన్​ ప్రచార సభల్లో పదేపదే చెబుతున్నారు.

మే 23 వరకు దినకరన్​ సహా తమిళ రాజకీయ భవితవ్యంపై ఉత్కంఠ కొనసాగుతుంది.

ఇవీ చూడండి:

భారత్​ భేరి: డబుల్​ ధమాకాపై డీఎంకే గురి​​​​​​​

వీరికి ఓటు వేసే అవకాశం కల్పించలేమా?

ABOUT THE AUTHOR

...view details