భారత రాష్ట్రపతిగా విశేష సేవలందించిన ప్రణబ్ ముఖర్జీ అంత్యక్రియలు ముగిశాయి. దిల్లీలోని లోధీ స్మశానవాటికలో సైనిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలు జరిగాయి. కొవిడ్ నిబంధనలకు అనుగణంగా అంత్యక్రియలు పూర్తయ్యాయి.
సైనిక లాంఛనాలతో ముఖర్జీకి అంతిమ వీడ్కోలు
13:56 September 01
అంతిమ వీడ్కోలు
13:41 September 01
శ్మశానవాటికకు భౌతికకాయం
ప్రణబ్ ముఖర్జీ భౌతికకాయాన్ని శ్మశానవాటికకు తీసుకొచ్చారు. లోధీలోని శ్మశానవాటికలో ఆయన అంత్యక్రియలు జరుగుతున్నాయి.
కొవిడ్ నిబంధనలు పాటిస్తూ అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు అధికారులు. కుటుంబసభ్యులు, బంధువులు పీపీఈ కిట్లు ధరించి అంతిమ సంస్కారాల్లో పాల్గొన్నారు.
13:06 September 01
అంతిమయాత్ర...
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అంతిమయాత్ర మొదలైంది. లోథిలోని శ్మశానవాటికలో ఆయన పార్థివదేహానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
10:54 September 01
రాహుల్, మన్మోహన్ నివాళి
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పార్ధీవదేహాన్ని రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కేంద్ర మంత్రులు హర్షవర్ధన్, నిర్మలా సీతారామన్, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్... ముఖర్జీ చిత్రపటానికి నివాళులు అర్పించారు.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, లోక్‌సభా పక్షనేత అధీర్ రంజన్ చౌధురీ సహా భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఆరెస్సెస్ అధినేత మోహన్ భగవత్‌లు ముఖర్జీ చిత్రపటం వద్ద పుష్పాంజలి సమర్పించారు.
10:20 September 01
రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని నివాళి
ప్రణబ్ చిత్రపటానికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు. దిల్లీలోని రాజాజీ మార్గ్‌లో ఉన్న ప్రణబ్ నివాసానికి చేరుకున్నారు. ప్రణబ్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు మోదీ.
09:58 September 01
లోక్‌సభ స్పీకర్ నివాళి
లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా.. ముఖర్జీ చిత్రపటానికి నివాళులు అర్పించారు. ముఖర్జీ కుటుంబసభ్యులతో మాట్లాడారు.
ప్రముఖుల సందర్శనార్థం ప్రణబ్ భౌతికకాయాన్ని దిల్లీ రాజాజీ మార్గ్-10లోని ఆయన నివాసంలో ఉంచారు.
09:50 September 01
ప్రణబ్‌కు త్రివిధ దళాధిపతులు నివాళి..
భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నివాసానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చేరుకున్నారు. పుష్పగుచ్చంతో ఆయన చిత్రపటానికి నివాళి అర్పించారు.
చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ సహా త్రివిధ దళాల అధిపతులు సైతం ముఖర్జీకి పుష్పాంజలి ఘటించారు. సైన్యాధిపతి జనరల్ ఎంఎం నరవణె, వాయుసేనాధిపతి ఎయిర్‌చీఫ్ మార్షల్ ఆర్కేఎస్ భదౌరియా, నేవీ చీఫ్ అడ్మిరల్ కరంబిర్ సింగ్.. ముఖర్జీకి నివాళులు అర్పించారు.
09:40 September 01
భౌతికకాయం తరలింపు
ప్రణబ్ ముఖర్జీ భౌతికకాయాన్ని రాజాజీ మార్గ్-10లోని నివాసానికి తరలించారు అధికారులు.
09:20 September 01
ఉదయం 9 గంటల నుంచి చివరి దర్శనం
ప్రణబ్ ముఖర్జీ అంతిమయాత్ర ఆయన ప్రస్తుత నివాసమున్న 10-రాజాజీ మార్గ్ నుంచి ప్రారంభమవుతుంది. ఆసుపత్రి నుంచి మంగళవారం ఉదయం 9 గంటలకు ఆయన భౌతిక కాయాన్ని అక్కడకు తీసుకెళ్లి, ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. ఉదయం 9.15 నుంచి 10.15 గంటల వరకు అధికార ప్రముఖులు, 10.15 నుంచి 11 వరకు ఇతర ప్రముఖులు, 11 నుంచి మధ్యాహ్నం 12 వరకు సాధారణ ప్రజలు సందర్శించి, నివాళులర్పిస్తారు.
కొవిడ్ కారణంగా గన్ కారేజ్ లేదు.
కరోనా కారణంగా భౌతికదూరం, వైద్యపరమైన నిబంధనలు అమల్లో ఉన్నందున ఆయన మృతదేహాన్ని గన్ క్యారేజ్‌పై కాకుండా సాధారణ అంబులెన్స్‌లోనే శ్మశానవాటికకు తరలిస్తారు. కాగా, కొవిడ్-19కి సంబంధించి కేంద్ర వైద్యఆరోగ్య, హోంశాఖలు జారీచేసిన నిబంధనలు, ప్రొటోకాల్స్‌ను కఠినంగా అమలు చేయాలంటూ రక్షణశాఖ సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది.