కరోనా వైరస్ ప్రమాదం పారిశుద్ధ్య కార్మికులకే ఎక్కువగా పొంచి ఉంటుంది. కానీ, వారు వైరస్‌కు ఎదురొడ్డి నిలిచి తమ విధులను నిర్వర్తిస్తున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖ్‌నవూకు చెందిన మున్నా కూడా ఆ జాబితాలో వాడే. అక్కడి బైకూనాథ్ ధామ్ ఎలక్ట్రిక్ శ్మశానవాటికలో తన పని తాను చేసుకుపోతున్నాడు. అయితే ఇప్పుడు అతడి గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే.. మున్నా గత ఆరు నెలల కాలంలో కుటుంబానికి దూరంగా శ్మశాన వాటిక వద్దే ఉంటూ, కరోనాకు భయపడకుండా ఆ వైరస్‌తో మరణించిన 700 మందికి అంత్య క్రియలు నిర్వహించాడు. చాలా మంది కార్మికులు అందుకు వెనకాడినా ఏమాత్రం వెరవకుండా ముందుకొచ్చిన మొదటి వ్యక్తి అతడేనంటూ లఖ్‌నవూ మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నతాధికారి దిలీప్ డే వెల్లడించడం అందుకు నిదర్శనం. 'ఏప్రిల్ నుంచి మున్నా, అతడి బృందం ఒక్క సెలవు కూడా తీసుకోకుండా 700 కొవిడ్ మృతుల అంతిమ సంస్కారాలు నిర్వహించారు. కొవిడ్ మృతదేహాల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మేం ముందుగానే వారికి శిక్షణ ఇచ్చాం' అని తెలిపారు.
" ఇది ఒక ఉద్యోగం. ఇందుకోసం దేవుడు నన్ను ఎంచుకున్నాడు. దీనికి నేను ఏ మాత్రం సిగ్గుపడటం లేదు. కరోనాకు భయపడి ప్రజలందరూ దూరందూరంగా బతుకుతున్న తరుణంలో మేం ఆ మృతదేహాలకు దగ్గరగా వెళ్లి అంత్యక్రియలు నిర్వహిస్తున్నాం. నేను కాస్త చదువుకొని ఉండటంతో బ్యాక్టీరియా, వైరస్‌కు మధ్య తేడా తెలుసు. ఇందులో ప్రమాదం పొంచి ఉన్నప్పటికీ నేను ముందుకు రావడానికి కారణం నా కుటుంబమే. ఈ విధంగానైనా మనం సమాజానికి సహకరించవచ్చని వారు నన్ను ప్రోత్సహించారు."
- మున్నా