హక్కులతో పాటు బాధ్యతలనూ గుర్తించి నడుచుకున్నప్పుడే ప్రజాస్వామ్యం వికసిస్తుంది. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా నవంబరు 26న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ రాజ్యాంగంలో పొందుపరచిన ప్రాథమిక విధులపట్ల సంపూర్ణ నిబద్ధతతో నడచుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు.
మహాత్ముడి మాట గాలికి వదలొద్దు!
‘ప్రాథమిక హక్కులకు మూలం ప్రాథమిక విధుల్లోనే ఉంది. మన విధులను సక్రమంగా నిర్వర్తించినట్లయితే... హక్కులకోసం మనమంతా ఎక్కడో అన్వేషించాల్సిన అవసరం లేదు. ఒకవేళ విధులను మనం గాలికొదిలేస్తే హక్కులు ఏనాటికీ సాకారం కాని లక్ష్యంగానే మిగిలిపోతాయి’- మహాత్మాగాంధీ చేసిన వ్యాఖ్యలివి. దేశం నాకేమిచ్చిందనే భావన స్థానే దేశానికి నేనేమిచ్చానన్న అంతర్మథనం రగులుకొనాలంటే ఆదేశిక సూత్రాలపట్ల అవగాహన పెరగాలి. అప్పుడే పౌరుల నడవడి నైతికబద్ధంగా ఉంటుంది. రాజ్యాంగం ఆత్మ- అవతారికలోనూ, ప్రాథమిక హక్కుల ప్రస్తావనలోనూ, ఆదేశిక సూత్రాల్లోనూ, ప్రాథమిక విధుల్లోనూ ఉందన్నారు బాపూజీ.
సమాజానికి సత్తువ
దేశవ్యాప్తంగా గడచిన ఏడు దశాబ్దాలుగా రాజ్యాంగంలోని మూడో భాగంలో గుదిగుచ్చిన ప్రాథమిక హక్కులపై విస్తృత చర్చ జరుగుతోంది. పౌర హక్కులపై సునిశిత చర్చ అవసరమే!
రాజ్యాంగంలోని మూడో అధ్యాయంలో పొందుపరచిన ప్రాథమిక హక్కుల పునాదిపైనే ప్రజాస్వామ్య సౌధం రెక్కవిచ్చుకుంది. బతికే స్వేచ్ఛ, చట్టం ముందు ప్రతి ఒక్కరూ సమానమన్న సూత్రీకరణ, భావ ప్రకటన స్వేచ్ఛ; సంస్థలు స్థాపించి సంబంధిత లక్ష్యాలకోసం పనిచేసే స్వేచ్ఛ వంటివన్నీ భారత ప్రజాస్వామ్యానికి మూలాధారంగా ఉన్నాయి.
నిబద్ధత అవసరమే..
ప్రాథమిక హక్కులు... ప్రజాస్వామ్య సౌధానికి పటిష్ఠ పునాదులు. వీటి పరిరక్షణకోసం సర్వోన్నత న్యాయస్థానం తొలినాళ్లనుంచి రాజీలేని ధోరణితో ముందుకు వెళుతోంది. ఇవన్నీ ఆహ్వానించదగిన పరిణామాలే. కానీ, రాజ్యాంగంలో అధికరణ 51 (ఎ) ద్వారా పొందుపరచిన ప్రాథమిక విధులపట్ల సైతం అదే స్థాయి ఉత్సుకతను, నిబద్ధతను కనబరచాల్సి ఉంది.
ప్రాథమిక విధుల జాబితా!
ఆత్యయిక పరిస్థితి కొనసాగుతున్న తరుణంలో 1976లో 42వ సవరణ ద్వారా ప్రాథమిక విధులను రాజ్యాంగ అంతర్భాగంగా మార్చారు. రాజ్యాంగానికి కట్టుబడి దాని ఆదర్శాలను గౌరవించడంతోపాటు- జాతీయ పతాకానికి, గీతానికి విధేయత చాటాలి.
మరోవంక స్వాతంత్య్రం కోసం జరిగిన జాతీయ పోరాట ఆదర్శాలపట్ల గౌరవం చూపాలి. దేశ సార్వభౌమత్వాన్ని, ఐక్యతను, సమగ్రతను కాపాడాలి. దేశ రక్షణకు సదా సన్నద్ధంగా ఉండాలి. మత, భాషా, ప్రాంతీయ, వర్గ వైవిధ్యాలకు అతీతంగా పౌరులందరిపట్ల సోదర భావాన్ని, స్ఫూర్తిని పెంపొందించాలి.
మహిళా గౌరవానికి భంగం కలిగించే విధానాలను విడనాడాలి. భారతావని మిశ్రమ సంస్కృతి, ఔన్నత్యం, సంప్రదాయాలను గౌరవించి, పరిరక్షించాలి. అడవులు, సరస్సులు, నదులు, వన్య ప్రాణుల పట్ల కారుణ్యాన్ని కలిగి ఉండాలి.
ప్రకృతి వనరులను పరిరక్షించి, వాటి విస్తరణకు కృషి చేయాలి. శాస్త్రీయ దృక్పథాన్ని, మానవ జిజ్ఞాసను, పరిశోధన, సంస్కరణ స్ఫూర్తిని పెంపొందించుకోవాలి. ప్రజల ఆస్తిని సంరక్షించాలి. హింసను ప్రేరేపించే చర్యలకు దిగరాదు.
ఆరు నుంచి పద్నాలుగేళ్లలోపు పిల్లలకు విద్యావకాశాలు కల్పించే బాధ్యతను తల్లిదండ్రులు లేదా సంరక్షకులు స్వీకరించాలి.
అవగాహన కలిగి ఉండాలి
సమాజ నడవడిని మరింత సుస్థిరంగా తీర్చిదిద్దే మూలకాల సమాహారమిది. ప్రాథమిక హక్కులు ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తే- ప్రాథమిక విధులు సమాజానికి కొత్త సత్తువనిస్తాయి. రాజ్యాంగం నిర్దేశించిన బాధ్యతల మేరకు వ్యవహరించినట్లయితే ప్రజా జీవన నాణ్యత ఇనుమడిస్తుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా, లెక్కకు మిక్కిలి విభిన్నతలున్న జాతిగా విలసిల్లుతున్న భారతావనిలో ప్రాథమిక విధులపట్ల సహేతుక అవగాహన తప్పనిసరి.
పాఠశాల స్థాయినుంచే ప్రాథమిక విధులను పాఠ్య ప్రణాళికలో అంతర్భాగం చేయడం ద్వారా విద్యార్థుల్లో బాధ్యతాయుత అవగాహన పెంచాలని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సూచించారు. రాజ్యాంగానికి కట్టుబడి పౌరులు నెరవేర్చాల్సిన విధులను పాఠశాల గోడలపైనా, ప్రభుత్వ కార్యాలయాలపైనా, రోడ్ల కూడళ్ల వద్ద హోర్డింగుల రూపంలో ప్రముఖంగా కనిపించేలా ఉంచాలన్న ఆయన సూచన శిరోధార్యం.
మోదీ కొత్త పుంత
దేశ పౌరుల్లోనూ రాజ్యాంగంపట్ల మెరుగైన అవగాహన కల్పించేందుకు మోదీ తీసుకుంటున్న చర్యలు ఏదో స్థాయిలో సానుకూల ఫలితాలనే ఇస్తున్నాయి. ప్రాథమిక విధుల ప్రాధాన్యాన్ని నొక్కి చెప్పడం ద్వారా రాజ్యాంగంపై చర్చను మోదీ ఇటీవల కొత్త పుంతలు తొక్కించారు.
భారతదేశం గణతంత్రంగా ఆవిర్భవించింది మొదలు ప్రాథమిక హక్కులు కేంద్రంగా అర్థవంతమైన చర్చ జరుగుతోందని, ప్రాథమిక విధులపైనా దృష్టి సారించాల్సిన అవసరం ఇప్పుడు ఉరుముతోందని ఆయన పేర్కొన్నారు. ‘బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించకుండా మన హక్కులను కాపాడుకోలేం’ అని మోదీ చెప్పిన మాటలు అక్షర సత్యాలు.
బాధ్యతలతోనే హక్కులు
ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల రాజ్యాంగాల్లో ప్రాథమిక విధులకు సమున్నత స్థానం కల్పించారు. నార్వే రాజ్యాంగంలోని 109 అధికరణలో దేశ రక్షణ బాధ్యతల్లో పాలుపంచుకోవడాన్ని పౌరుల కనీస బాధ్యతగా పేర్కొన్నారు. డెన్మార్క్ రాజ్యాంగంలోని 81వ అధికరణ మేరకు ఆయుధాలు ఉపయోగించడం తెలిసిన ప్రతి పురుషుడు దేశ రక్షణలో భాగస్వామి కావాలి. ఫ్రాన్స్ రిపబ్లిక్ ప్రాథమిక హక్కులు, విధుల భాగస్వామ్య పునాదులపై ఆవిర్భవించింది. సుప్రీంకోర్టులో పిటిషన్ల ద్వారా, కేసుల రూపంలో ప్రాథమిక విధులను అమలులోకి తీసుకురావడం కుదరదు.
కానీ, వివిధ సందర్భాల్లో న్యాయస్థానాలు రాజ్యాంగంలోని అధికరణ 51 (ఎ)లో ప్రస్తావించిన ప్రాథమిక విధులను సృజనాత్మకంగా అమలు చేయాల్సిన అవసరాన్ని ఉద్బోధిస్తూ తీర్పులు ఇచ్చాయి. పౌరులతోపాటు ఈ విధులు ప్రభుత్వాలకూ వర్తిస్తాయి. ఉదాహరణకు ప్రతి వారం కనీసం ఒక గంటపాటు అన్ని విద్యా సంస్థల్లోనూ సహజ వనరులను, ప్రకృతి సంపదను కాపాడుకోవాల్సిన తీరుతెన్నులను విద్యార్థులకు వివరిస్తూ ఒక క్లాసు నిర్వహించడాన్ని తప్పనిసరి ప్రాథమిక విధిగా నిర్దేశించారు. పౌరులకు, ప్రభుత్వాలకు సహేతుక బాధ్యతలు మప్పే పాథమిక విధులపట్ల అవగాహన విస్తరించడం సామాజిక సమతుల్యతకు కీలకం.
-ఎ సూర్యప్రకాశ్, రచయిత, ప్రసార భారతి ఛైర్మెన్
ఇదీ చదవండి:'ప్రియాంక'తో సెల్ఫీ కోసం.. దూసుకొచ్చిన కారు..!