తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు

నేటి నుంచే పార్లమెంటు శీతాకాల సమావేశాలు  ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో చర్చల సందర్భంగా వ్యూహాత్మకంగా ముందుకు సాగాలని.. ప్రభుత్వ వర్గాలు నిర్ణయించినట్లు సమాచారం. ఆర్థిక మందగమనం, నిరుద్యోగం సహా వివిధ అంశాలపై చర్చకు విపక్షాలు పట్టుబట్టనున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రభుత్వం వివిధ బిల్లులకు ఆమోదం పొందేందుకు యోచిస్తున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు

By

Published : Nov 18, 2019, 5:36 AM IST

పార్లమెంటు శీతాకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో దిల్లీలోని పార్లమెంట్ భవనంలో ఆదివారం అఖిలపక్ష సమావేశం జరిగింది. విపక్షాలు ప్రస్తావించే అంశాలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని.. పార్టీల నేతలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

'చర్చించండి..'

ఆర్థిక మందగమనం, నిరుద్యోగం, వ్యవసాయ సమస్యలపై ప్రధానంగా చర్చించాలని అఖిలపక్ష సమావేశం వేదికగా ప్రతిపక్షాలు డిమాండ్​ చేసినట్లు సమాచారం. ప్రభుత్వం నిర్వహించిన అఖిలపక్ష భేటీలో 27 పార్టీలకు చెందిన పలువురు సీనియర్ నాయకులు, ఎంపీలు హాజరయ్యారని తెలుస్తోంది.

70వ రాజ్యాంగ దినోత్సవం..

ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే రానున్న 70వ పార్లమెంటు దినోత్సవం, రాజ్యసభ 250వ సమావేశ ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ నెల 26న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు ఉభయసభల సంయుక్త సమావేశం జరగనుంది. రాజ్యసభ 250వ సభ సందర్భంగా నేటి మధ్యాహ్నం నుంచి ప్రత్యేక చర్చ నిర్వహించనున్నారు.

వీటిపైనే ప్రధాన చర్చ..

  • పౌరసత్వ సవరణ బిల్లు, వ్యక్తిగత సమాచార రక్షణ బిల్లు, సహా మరో 25 బిల్లులకు ఈ సమావేశాల్లోనే ఆమోదం పొందాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఆర్థిక సంబంధమైన అంశాలు మొదలుకొని సులభతర వాణిజ్యం, పన్నులు, ఆరోగ్యం, విద్యారంగానికి సంబంధించిన కీలక బిల్లులు సభ ముందుకు రానున్నాయి.
  • సహకార రంగంలో సంస్కరణలకు సంబంధించిన బహుళ రాష్ట్రాల సహకార సంఘాల(సవరణ) బిల్లు-2019 ఈ సమావేశాల్లోనే ప్రవేశపెట్టనున్నారు.
  • పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్​ల నుంచి వచ్చిన ముస్లిమేతరులకు పౌరసత్వం కల్పించే ఉద్దేశంతో పౌరసత్వ సవరణ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
  • పౌరుల వ్యక్తిగత సమాచారానికి రక్షణ, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ పెరుగుదలను ప్రోత్సహించే లక్ష్యంతో వ్యక్తిగత సమాచార రక్షణ బిల్లును ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం.

'వ్యూహాత్మకంగా ముందుకు'

విపక్షాలను ఎదుర్కోవడంపై వ్యూహాత్మకంగా వ్యవహరించాలని ప్రభుత్వం యోచిస్తోందని తెలుస్తోంది. గత సమావేశాల్లో 370, 35 ఏ అధికరణల రద్దు, ముమ్మారు తలక్​ బిల్లులకు ఆమోదం పొంది ప్రతిపక్షాలపై ఆధిపత్యం ప్రదర్శించిన ప్రభుత్వం.. ఈసారీ అదే పంథాతో ముందుకెళ్లేందుకు నిర్ణయించిందని సమాచారం. రామజన్మభూమి, రఫేల్ కేసుల్లో ప్రభుత్వ వైఖరికి అనుకూలంగా తీర్పురావడం ఆత్మవిశ్వాసాన్ని పెంచినట్లయిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మిత్రపక్షంగా ఉన్న శివసేన దూరమైనప్పటికీ పట్టించుకోకుండా దూకుడు ప్రదర్శించాలని ప్రభుత్వ వర్గాలు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా ప్రాంతీయ పార్టీల సహకారంతో ముందుకెళ్లాలని ఇప్పటికే పలు రకాల ప్రయత్నాలు సాగాయి.

ఇదీ చూడండి: 'కాలుష్య పోరు'లో ప్రపంచం నుంచి భారత్​ నేర్చుకోవాల్సింది?

ABOUT THE AUTHOR

...view details