అరవింద్ కేజ్రీవాల్...దేశ రాజకీయాల్లో అందరికీ సుపరిచితమైన పేరు. అతి సాధారణంగా రాజకీయ ప్రవేశం చేసి.. అనూహ్యంగా దిల్లీ పీఠాన్నే దక్కించుకున్నారు. తొలిసారి 2013లో కాంగ్రెస్ మద్దతుతో ఆప్ సర్కార్‌ను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత.. 2015లో ఏకంగా 70 స్థానాలకు గానూ 67 చోట్ల ఆప్ నెగ్గడం వెనుక కేజ్రీవాల్ పోరాటం ఎంతో ఉంది. ఈసారీ ఎన్నో అడ్డంకుల్ని ఎదుర్కొని.. మరోసారి సీఎం పీఠాన్ని అధిరోహించనున్నారు. దిల్లీలో హ్యాట్రిక్ విజయాలతో మరోసారి కేజ్రీవాల్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. ఆయన వ్యక్తిగత జీవితం, రాజకీయ అరంగేట్రం, ఇతర విశేషాలపై ఓ లుక్కేద్దాం...
ఉద్యమం నుంచి రాజకీయంవైపు...
ఆదాయపు పన్ను శాఖలో ఉన్నతాధికారి అరవింద్ కేజ్రీవాల్. తమ శాఖలో ఎవరికీ లంచాలు ఇవ్వాల్సిన అవసరం లేదనీ, ఎవరైనా అడిగితే తనకు చెప్పాలంటూ అప్పట్లో ప్రజలకు ఫోన్ నెంబరు ఇచ్చారు ఆయన. ఫలితంగా 18 నెలల్లో 800 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత వృత్తిపరంగా అనేక కీలక పరిణామాలు. చివరకు 2006లో ఉద్యోగానికి రాజీనామా చేసి అవినీతి వ్యతిరేక ఉద్యమాన్ని విస్తృతం చేశారు కేజ్రీవాల్.
2011లో ఉద్యమకర్త అన్నా హజారేతో కలిసి జన లోక్‌పాల్ బిల్లు కోసం పోరాడినప్పుడు తొలిసారి అందరి దృష్టిని ఆకట్టుకున్నారు అరవింద్. అప్పట్లో హజారేతో పాటు తొలి మహిళా ఐపీఎస్ అధికారి కిరణ్ బేడీ, న్యాయవాది ప్రశాంత్ భూషణ్‌లతో ఆయన ఉద్యమించారు. జనలోక్‌పాల్ బిల్లు ముసాయిదా రూపకల్పనలో పౌరసమాజం ప్రతినిధిగా వ్యవహరించారు. వారు ఇచ్చిన ముసాయిదాను ప్రభుత్వం తిరస్కరించింది. దమ్ముంటే రాజకీయాల్లోకి వచ్చి విజయం సాధించి అవినీతి నిర్మూలనకు పార్లమెంటులో అడుగుపెట్టాలని కాంగ్రెస్, ఇతర పార్టీలు విసిరిన సవాల్‌ను ఆయన స్వీకరించారు. దాని ఫలితంగానే 2012 నవంబర్ 26న పురుడు పోసుకుంది ఆమ్ ఆద్మీ పార్టీ.
కొడితే కుంభస్థలం...
కొడితే కుంభస్థలం కొట్టాలన్నట్లు దిల్లీలో 15 ఏళ్లుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ను తొలుత 2013 అసెంబ్లీ ఎన్నికల్లో 'ఏకే' మట్టి కరిపించారు. అనూహ్యంగా ఆ ముచ్చట 49 రోజుల్లోనే ముగిసిపోయినా ఏమాత్రం వెరవలేదు. అధికారంలో ఉన్నది కొద్ది రోజులే అయినా తనదైన ముద్ర చూపించాలని ఆరాటపడ్డారు. పద్ధతీపాడూలేని విద్యుత్తు బిల్లులను చించివేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్తు సరఫరా సంస్థల ఒప్పందాలు, తాగునీటి సరఫరా తీరుపైనా కొరడా ఝుళిపించారు. అంతకు ముందు ఓ సందర్భంలో దిల్లీ సీఎంగా ఉన్న షీలా దీక్షిత్ ఇంటి ముందు ఆయన ఆందోళన చేపట్టినప్పుడు పోలీసులు ఈడ్చిపడేసినా వెనక్కితగ్గలేదు. సీఎంగా అర్థంతరంగా గద్దె దిగిపోయినందుకు ఎన్ని విమర్శలు వచ్చినా కుంగిపోలేదు.
మోదీతోనే సై...