ముస్లిం మహిళల రక్షణ కోసం కేంద్రం నూతనంగా రూపొందించిన ముమ్మారు తలాక్ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టారు కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చాక సభ ముందుకు తీసుకువచ్చిన మొదటి బిల్లు ఇది.
ముమ్మారు తలాక్ బిల్లును ప్రవేశ పెట్టేందుకు 186 మంది సభ్యులు అంగీకారం తెలిపారు. 74 మంది వ్యతిరేకించారు.
ఇది మతానికి సంబంధించిన విషయం కాదని మహిళల న్యాయం కోసం తీసుకువచ్చిన బిల్లని రవిశంకర్ ప్రసాద్ చెప్పారు. గతంలో మద్దతిస్తామని తెలిపిన కాంగ్రెస్ ఇప్పడు వ్యతిరేకించడాన్ని తప్పుబట్టారు.
వ్యతిరేకించిన కాంగ్రెస్
ముమ్మారు తలక్ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని కాంగ్రెస్ నేత శశిథరూర్ వివరణ ఇచ్చారు. కేవలం ఓకే వర్గాన్ని లక్ష్యం చేసుకుని రూపొందిన బిల్లును తాము అంగీకరించబోమని తేల్చిచెప్పారు.