పౌరచట్టానికి వ్యతిరేకంగా సుప్రీంలో మరో పిటిషన్ దేశవ్యాప్తంగా నిరసనలకు కారణమైన 2019 పౌరచట్టానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పౌరహక్కుల రక్షణ సంస్థ (ఏపీసీఆర్) అనే సామాజిక సంస్థ పిటిషన్ దాఖలు చేసింది. పౌరచట్టం రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేలా ఉందని పిటిషన్లో పేర్కొంది. ఈ చట్టాన్ని కార్యరూపం దాల్చకుండా చూడాలని విజ్ఞప్తి చేసింది.
పౌరచట్టంలోని నిబంధనలు, నోటిఫికేషన్లు రాజ్యాంగంలోని ఆర్టికల్ 13, 14, 15, 21, 51 (సి) 51-(ఎ )లను ఉల్లంఘించేలా ఉన్నాయని ఏపీసీఆర్ ఆరోపించింది. నిబంధనలు ఏకపక్షంగా ఉన్నాయని వాటిని కార్యరూపం దాల్చకుండా చూడాలని పిటిషన్లో తెలిపింది.
పౌరచట్టంలో పొందుపరిచిన మతపరమైన ఆంక్షలు లౌకిక వాదానికి, రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగించేలా ఉన్నాయని పేర్కొంది. ముస్లింలను వారి మతం ఆధారంగా, పుట్టిన స్థలం ప్రకారం వారి పౌరసత్వాన్ని నిర్దేశించటం వివక్ష పూరితమైనదని పిటిషన్లో ప్రస్తావించింది. పౌరచట్టం, ఎన్ఆర్సీలు కార్యరూపం దాల్చితే.. సరైన పత్రాలు లేని అనేక మంది భారతీయులు నిరాశ్రయులవుతారని పేర్కొంది. అందువల్ల ఈ చట్టాలను అమలు కాకుండా న్యాయస్థానం చొరవతీసుకోవాలని పిటిషన్లో పేర్కొనట్లు ఎన్జీఓ సంస్థ తెలిపింది.
1955 పౌరచట్టంలోని సెక్షన్ 3(1)నూ సవాలు చేశారు పిటిషనర్. నాటి చట్టం ఏకపక్షంగా, రాజ్యాంగ విరుద్ధంగా ఉందని తన వ్యాజ్యంలో పేర్కొన్నారు.